సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రౌండ‌ప్‌

రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రుల‌తో చ‌ర్చ‌

రెండ్రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకొని తాడేప‌ల్లి చేరుకున్న సీఎం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకొని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం రోడ్డు మార్గంలో తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో భేటీ అయ్యారు. 45 నిమిషాలకు పైగా ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి.. రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి నివేదించారు. 

అదేరోజు సాయంత్రం 5.30 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అయ్యారు. పోలవరం సవరించిన అంచనాలు, బకాయిల విడుదల తదితర అంశాలపై చర్చించారు. వివిధ పద్దుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణ పరిమితిలో కోతలు విధించడం సరికాదని నివేదించారు. 

గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమ‌య్యారు. పోలవరం నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలోని పలు అంశాలను కేంద్ర‌మంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, నిధులు ఎప్పటికప్పుడు విడుదల తదితరాలను ప్రస్తావించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర‌మంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలోని అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ రాత్రి అక్కడే బస చేశారు.  

శుక్ర‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. 
 

Back to Top