కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

కోవిడ్‌–19 నివారణ చర్యలపై  సీఎం వైయ‌స్‌ జగన్  సమీక్షా

 తాడేప‌ల్లి: కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధి​కారులు తెలిపారు. కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండి..
క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని, వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం వైస్‌ జగన్‌ ఆదేశించారు. భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. ‘‘వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలి. ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్‌ చేయాలి. ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్,కోవిడ్‌ ఆస్పత్రులకు కచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం 3 ఫోన్‌ కాల్స్‌ చేయాలి.క్రమం తప్పకుండా ఆ ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలని’’ సీఎం పేర్కొన్నారు.

సేవల్లో నాణ్యత..
సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పష్టం చేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆస్పత్రులు,క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ఆదేశించారు. మనం దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉంది. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని సీఎం  స్పష్టం చేశారు.

కోవిడ్‌ ఆస్పత్రులు..
కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టండి. జీఎంపీ ప్రమాణాలున్న మందులు వాటిలో చికిత్స పొందుతున్న వారికి అందాలి. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలి

కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని అవి ఎక్కడ ఉన్నాయనే దానిపై ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.‘‘ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం ఉండాలి. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా పెట్టాలి. అదే విధంగా టెస్టులు ఎస్‌ఓపీ ప్రకారం చేయాలి. ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలి. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలని’’  సీఎం సూచించారు.

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అలాగే హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని తెలిపారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా  పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని సీఎం వైయ‌స్‌ జగన్‌కు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.

వారికి మెరుగైన జీతాలు..
కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను సీఎం అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో వారు సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామని వెల్లడించారు. కనీసం 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పెగా నర్సుల  సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించి.. కోవిడ్‌ విస్తృతి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారి సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలపగా, ఆ ప్రణాళికకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top