సీఎం వైయ‌స్ జగన్‌కు సినీ న‌టుడు చిరంజీవి ధన్యవాదాలు  

హైద‌రాబాద్‌:  సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై తన సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విటర్‌లో ‘ఎగ్జిబిటర్స్‌ కోసం సినిమా రిసార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన సీఎం వైయ‌స్‌ జగన్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించి సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలను పలువురు ప్రముఖులు అభినందించారు. లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు.  

కాగా కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊరటనిచ్చింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది.మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

Back to Top