దళారీలకు కెప్టెన్‌ చంద్రబాబు

తిరువూరు మామిడి రైతులకు ఏటా అన్యాయం

రూ. 30 వేల టన్నుకు రూ. 15 వేలు కూడా దక్కడం లేదు

ఎన్నికలు వచ్చాయని కృష్ణా జలాల తెస్తానని శిలాఫలకాలు వేస్తున్నాడు

ఏ.కోడూరులో కిడ్నీ బాధితులు 30 మంది చనిపోతే దిక్కులేదు

ఇంతకంటే అన్యాయమైన పాలన ఉంటుందా..?

తిరువూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తిరువూరు బహిరంగ సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ స్థానిక సమస్యలపై ప్రస్తావించారు. ప్రజా సంకల్పయాత్రలో  తిరువూరు మీదుగా పాదయాత్రగా వెళ్లిన వైయస్‌ జగన్‌ అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచార సభకు మళ్లీ తిరువూరుకు వచ్చిన జననేత పాదయత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రస్తావించారు. మీ ప్రతి కష్టం విన్నాను.. ప్రతి నష్టం చూశాను.. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను.. నేను విన్నాను.. నేను విన్నాను అంటూ వైయస్‌ జగన్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. 

తిరువూరు నియోజకవర్గంలో రైతన్నలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కాదు. నాగార్జున సాగర్‌ దగ్గరలోనే ఉంది. కానీ సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా చంద్రబాబు దీని గురించి ఆలోచన చేయలేదు. ఇదే తిరువూరు నియోజకవర్గంలో సాగు, తాగునీరు కోసం నూతిపాడు వద్ద అప్పట్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎత్తి పోతల పథకం, తెల్లదేవరపల్లిలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ రెండు ప్రాజెక్టులు ఆ దివంగత మహానేత హయాంలో జరిగాయి. కనీసం వాటిని కూడా సరిగ్గా వాడుకోలేని అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని రైతన్నలు వాపోతున్నారు. తిరువూరులో తాగునీటి కొరత తీర్చడానికి కృష్ణా జలాలు తీసుకువస్తామని, ఇప్పుడు శిలాఫలకాలు వేస్తున్నాడు చంద్రబాబు. ఐదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఉందా లేదా అని చూడలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ శిలాఫలకాలు వేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి పాలకుడు మనకు కావాలా అని అడుగుతున్నా.. అధికారంలో ఉన్నప్పుడు మనం గుర్తుకురాం. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చే ఇలాంటి అన్యాయమైన పాలన కావాలా అని అడుగుతున్నా.. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతుంది.

ఐదేళ్లుగా మామిడికి గిట్టుబాటు ధరలు లేవు. బంగనపల్లి, రసాలు, కలెక్టర్‌ రకాలు టన్ను కనీసం రూ. 30 వేలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. పరిస్థితి చూస్తే మార్కెట్‌లో దళారులంతా సిండికేట్‌ అవుతున్నారు. రూ. 15 వేలు కూడా ధర రాని పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత కంపెనీ లాభాల కోసం రైతులకు నష్టం చేసే విధంగా దళారీలకు తానే కెప్టెన్‌ అయి పంట పండించినప్పుడు రేట్లు తానే దగ్గరుండి తగ్గిస్తున్న అన్యాయమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది.భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువై ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు నిరుడు సంవత్సరం 30 మంది చనిపోయారు. వారు చనిపోతే కనీసం ఒక్క డయాలసిస్‌ యూనిట్‌ కూడా లేదంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా..? నా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అనువు చూశాను. ప్రతి ప్రాంతం చూశాను. ప్రతి కష్టం విన్నాను. ప్రతి నష్టం చూశాను. నేను మీ అందరికీ చెబుతున్నాను.. నేను ఉన్నానని కచ్చితంగా భరోసా ఇచ్చి చెబుతున్నాను.

 

Back to Top