అక్టోబ‌ర్ నెలాఖ‌రిక‌ల్లా `శ్రీ‌శైలం` భూముల‌కు స‌రిహ‌ద్దులు ఖ‌రారు

డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

స‌చివాల‌యం: అక్టోబరు నెలాఖరుకల్లా శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను ఖరారు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం ఎండోమెంట్ భూములపై అధికారుల‌తో మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. శ్రీ‌శైలం దేవ‌స్థాన భూముల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌మావేశం అనంత‌రం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. 

అటవీ, రెవెన్యూ, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్‌ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. 

Back to Top