సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు

 విప‌క్ష నేత బొత్స స‌త్యనారాయ‌ణ ఫైర్ 

అమరావతి: శాసనమండలిలో అధికార పార్టీ స‌భ్యులు అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నార‌ని విప‌క్ష నేత బొత్స స‌త్యనారాయ‌ణ మండిప‌డ్డారు. విపక్ష స‌భ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని మండిపడ్డారు. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్‌లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నార‌ని బొత్స ధ్వజమెత్తారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ..  ‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

Back to Top