నిరుద్యోగులను నిలువునా ముంచారు

బీసీలకు అనేక హామీలిచ్చి మోసం చేశారు

23 వేల ఉపాధ్యాయ పోస్టులు 6 వేలకే పరిమితం చేశారు

రూ. కోట్ల ఎంఓయూలు, 40 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి బాబూ

ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ వివక్ష

బడుగు, బలహీనవర్గాలను మోసం చేసేలా నిబంధనల ఉల్లంఘన

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి

విజయవాడ: చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. బీసీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీనవర్గాలపై ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కమిషన్‌ వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 వేలు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను 6 వేలకే పరిమితం చేసి నోటిఫికేషన్‌ 2014లో విడుదల చేశారన్నారు. ఇప్పటి వరకు మిగిలిన పోస్టులను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వారిని భర్తీ చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని, ఉపాధి లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ. 20 లక్షల కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం.. ప్రైవేట్‌ పరంగా 40 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. 

ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ బడుగు, బలహీనవర్గాల పట్ల వివక్ష చూపుతున్నారని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. గ్రూపు –1, గ్రూపు –2 ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటే నిబంధనలు తుంగలో తొక్కే విధంగా వ్యవహరించారన్నారు. అత్యధిక జనాభా కలిగిన బలహీనవర్గాలకు చెందిన వారిపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బలహీనవర్గాలకు చెందిన నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సరైన గైడ్‌లైన్స్‌ లేకుండా తప్పుడు విధానాలతో రిజర్వేషన్లు ఉన్న కేటగిరిలను ఓపెన్‌ కేటగిరిలకు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. ఉద్యోగాల రేషియోను ఎందుకు ప్రకటించడం లేదు అని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. బడుగు, బలహీనవర్గాలపై వివక్షత, ఉన్న పోస్టులను తమకు అనుకూలంగా ఉన్నవారికే కేటాయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు.

Back to Top