అమరావతి: రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి, విప్‌లు కొరుముట్ల శ్రీనివాస్, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి అసెంబ్లీ సెక్రటరీ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం ఉంటుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలన్నది బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. శాసనసభ, మండలిలో ప్రతీ సీటు శానిటేషన్ చేస్తున్నారని, భౌతికదూరం పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.