ఓట‌మి భ‌యంతో టీడీపీ దాడులు

 పంచాయతీ ఎన్నికలు.. రెండో దశలో టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ దౌర్జన్యం
 

అమ‌రావ‌తి: ప‌ంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని ముందే గుర్తించిన టీడీపీ మ‌ద్ద‌తుదారులు ఎన్నిక‌ల స‌మ‌యంలో దౌర్జ‌న్యానికి దిగువుతున్నారు. రెండో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా నిర్వ‌హిస్తుండ‌టంతో జీర్ణించుకోలేక టీడీపీ నేత‌లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. నామినేష‌న్ల దాఖ‌లు నుంచి పోలింగ్ దాకా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల తీరు ఒకేలా ఉంది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారులు దాదాపు 90 శాతం స‌ర్పంచ్ స్థానాలు ద‌క్కించుకున్నారు. దీంతో టీడీపీ నీచ రాజ‌కీయాల‌కు తెర లేపింది.  ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శనివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు.

కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యం
కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారు. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా, టీడీపీ నేతను వైయ‌స్ఆర్ ‌సీపీ మద్దతుదారులు అడ్డకున్నారు. ఇర్గువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. పోలీసులు చెదరగొట్టారు

వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ మద్దతుదారులు దాడి
పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రంలో వైయ‌స్ఆర్‌‌సీసీ మద్దతు ఏజెంట్‌పై టీడీపీ మద్దతుదారులు దాడికి తెగపడ్డారు. సదరు ఏజెంట్‌ మాస్క్‌ పెట్టుకోలేదనే నెపంతో దాడి చేశారు. టీడీపీ మద్దతుదారులపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఏస్పీ ఆదేశించారు. 

ప్రకాశం జిల్లా పొదిలి మండలం  దాసల్లపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నేత‌లు ఘర్షణకు దిగారు. వైయ‌స్ఆర్ సీపీ మ‌ద్ద‌తుదారుల‌ను పోలింగ్ కేంద్రానికి వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో అప్రమత్తమయిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

బాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఆగడాలకు అంతే లేదు..
 కుప్పంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఘనత వహించిన మనోహర్‌ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేసిన వారిని బెదిరిస్తున్నాడు. అందులో భాగంగా కుప్పం మండలం వి.మిట్టపల్లె పంచాయతీకి నామినేషన్‌ వేసిన వైయ‌స్ఆర్‌ ‌సీపీ అభిమాని అంజలికి హెచ్చరికలు జారీ చేశాడు. టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న  శివలక్ష్మి భర్త మంజునాథ్‌తో కలిసి అంజలి ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. నామినేషన్‌ ఉపసంహరించుకోకుంటే చంపేస్తామని బెదిరించాడు. దీనిపై  బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.
  
 
పోటెత్తిన పోలింగ్ కేంద్రాలు
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌తో సంతృప్తిగా ఉన్న ఓట‌ర్లు రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేందుకు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల‌కు చేరుకున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో చ‌లి తీవ్ర‌త ఉన్నా స‌రే లెక్క చేయ‌కుండా ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది.  9 వేలకుపైగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్  ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను  రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ పర్యవేక్షిస్తున్నారు. 
  
  

Back to Top