కుప్పంలో బహిరంగ చర్చకు సిద్ధమా..?

చంద్రబాబుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి బాబు కళ్లు బైర్లుకమ్మాయి

ప్రజలు తిరస్కరించినా టీడీపీ అధినేతకు ఇంకా బుద్ధిరాలేదు

విధ్వంసకర పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌ గత ఐదేళ్ల టీడీపీ పాలన

తాడేపల్లి: మీ పాలన వద్దంటూ ప్రజలు తిరస్కరించి 23 సీట్లకే పరిమితం చేసినా  చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లుకమ్మాయన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్నాడన్నారు. జూమ్‌ మీటింగ్‌లు పెట్టి తన పాలన గొప్పగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో చంద్రబాబు చర్చకు సిద్ధమని, ఏడాదిలో చేసిన సంక్షేమ కార్యక్రమాలపై కుప్పం నియోజకవర్గం నుంచే బహిరంగ చర్చ మొదలుపెడదామని చంద్రబాబుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. చంద్రబాబు రాలేకపోతే లోకేష్‌ను చర్చకు పంపాలన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసకర పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు పాలన మిగిలిపోయిందన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కొని పంచుకొని వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు.

ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి రేషన్, పెన్షన్‌ కోసం పేదలను బెదిరించి లంచాలు గుంజారే అది విధ్వంసం అంటే. మట్టి, ఇసుక, బొగ్గు, మైనింగ్‌ ఇలా పంచభూతాలను పంచుకుతిన్నారే.. అది విధ్వంసం అంటే. 43 వేల బెల్టుషాపులు పెట్టి ఆఖరికి పాన్‌షాపుల్లో కూడా మద్యం విక్రయాలు జరిపించి మహిళల జీవితాలతో ఆడుకోవడం విధ్వంసం అంటే. రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి అమరావతి నుంచి ఢిల్లీ వరకు హవాలా స్కామ్‌ చేయడం విధ్వంసం అంటే. పక్కరాష్ట్రంలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం విధ్వంసం. ఇసుక పేరుతో గతంలో విప్‌గా పనిచేసిన చింతమనేని వనజాక్షిపై దాడి చేయడం విధ్వంసం అంటారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 
 

Back to Top