సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: సీపీఎస్‌ రద్దుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత చర్చించి ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మాది స్నేహపూర్వక ప్రభుత్వమని, వైయస్‌ జగన్‌ సర్కార్‌ ఉద్యోగుల యోగక్షేమాలు చేస్తోందన్నారు. అవినీతి రహిత పాలనకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. వ్యవస్థలను కాపాడాలనేది సీఎం ఆశయమని, ఉద్యోగులు కూడా అలాగే చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మనమంతా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దన్నారు. ఎవరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఇది సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన మాట అని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.   
 

Back to Top