రేపు నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం వైయ‌స్ జగన్‌

 నంద్యాల: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈనె 8వ తేదీన నంద్యాల జిల్లాకు వస్తున్నారు.  ఈసందర్భంగా సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ మనజీర్‌జిలానీ శామూన్‌  బుధవారం రాత్రి వెల్లడించారు.  విజయవాడ నుంచి   కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11.10 గంటలకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు.  

అక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి 11.35గంటలకు  బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం, పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కు  తిరుగు ప్రయాణమవుతారు.  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ నుంచి మధ్యాహ్నం 1 గంటకు  ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. 

ఏర్పాట్ల పరిశీలన
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్, ఎస్పీజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ వేదిక  వద్ద ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌జిలానీ శామూన్, కర్నూలు జిల్లా రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్, ఎస్పీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు 
 సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీన నంద్యాల రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు  ఏర్పాటు చేయాలని అధికారులను  కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌తో కలసి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గన్నవరం నుంచి విమానంలో ఓర్వకల్లు చేరుకొని హెలికాప్టర్‌ ద్వారా నంద్యాల వెళ్లనున్నారన్నారు. అలాగే తిరిగి నంద్యాల నుంచి హెలికాప్టర్‌లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకొని విమానంలో గన్నవరం వెళ్లనున్నారని పేర్కొన్నారు. 

Back to Top