ఎమ్మెల్యేల హక్కులు కాపాడట‌మే త‌మ క‌ర్త‌వ్యం

 ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం

అచ్చెన్నాయుడు సరిగా స్పందించలేదని వెల్లడి

అమ‌రావ‌తి:  శాసనసభ్యుల హక్కులు కాపాడడం తమ కర్తవ్యం అని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో  ఇవాళ‌ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. అనంత‌రం ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ప్రివిలేజ్ కమిటీ పారదర్శక రీతిలో కార్యకలాపాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సభలో 174 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ పైనా విమర్శలు చేస్తున్నారని, కొందరు సభ్యుల వైఖరిని ఆధారాలు సహా ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరవైందని తెలిపారు. ఆశించిన రీతిలో స్పందించని సభ్యులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినట్టు వెల్లడించారు.

టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సరిగా లేదని, అందుకే ఆయనను మరోసారి వివరణ కోరగా, ఏమాత్రం బదులివ్వలేదని తెలిపారు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామని వివరించారు.  ఎవరు ఎవరిపై వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

 మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కూడా హాజరు కావాలని కోరితే, ఆయన కరోనా నేపథ్యంలో రాలేనని జవాబిచ్చారని, ఆయనపై ఆగస్టు 10న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించామని కాకాణి తెలిపారు.  
 

Back to Top