ఏలూరు ‘సిద్ధం’

రేపు ఏలూరులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ

ఉభయగోదావరితో పాటు కృష్ణా నుంచి హాజరుకానున్న లక్షలాది మంది క్యాడర్‌

50 నియోజకవర్గాల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు

జాతీయ రహదారిపై భారీ వాహనాల మళ్లింపు

110 ఎకరాల ప్రాంగణంలో ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లు తుది దశకు

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దెందులూరు చేరుకోనున్న సీఎం వైయ‌స్ జగన్‌

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కారుమూరి, తలశిల, ఎమ్మెల్యేలు

ఏలూరు  : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. 
ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్‌’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. 

గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి
ఎన్నికలకు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు.

ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ  ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 

3న దెందులూరుకు సీఎం
‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.  

తాజా వీడియోలు

Back to Top