అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఏపీలోని 13 జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు సాగింది. బీద గుడిసెల్లో పేదవాడి కన్నీటి తడిని తుడిచేస్తూ, అప్పుల అగాధంలో ఉక్కిరిబిక్కిరవుతున్న రైతన్నను అభయహస్తం ఇస్తూ 14 నెలలుగా యాత్ర కొనసాగింది. 341 రోజుల పాటు.. 3,648 కి.మీ. సాగిన ప్రజా సంకల్ప యాత్ర ఇచ్ఛాపురం వేదికగా 2019, జనవరి 9 సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ.. 341 రోజులు ముందుకు సాగారు వైయస్ జగన్. మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగించారు. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో సుమారు 2 కోట్ల మంది ప్రజలతో మమేకమయ్యారు.. ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రస్థానం 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించి.. తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదిలారు. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. పేదలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలతో మమేమకమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే.. ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆ రోజు పాదయాత్రలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కాగానే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. నాటి ప్రజా సంకల్పం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో నెరవేరుతోంది. ఈ పాలన ఇలానే కొనసాగాలని, మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు ఊరూవాడా నినదిస్తున్నారు. మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అన్ని వర్గాలు సమయత్తం అవుతున్నారు. తాను నమ్ముకున్నది పొత్తులు, ఎత్తులు, ఎల్లోమీడియా కాదు.. తాను నమ్మకున్నది దేవుడ్ని, ప్రజల్నే అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అలుపెరగని యోధుడు వైయస్ జగన్ ఘన వ్యక్తిత్వం సాటిలేని దాతృత్వం తిరుగులేని నేతృత్వం నాయకత్వాన నిశ్చలతత్వం చెక్కుచెదరని దృఢ సంకల్పం ఎప్పుడూ తరగని తెగింపు ధైర్యం నిర్ణయాలలో తొణకని స్థైర్యం అన్యాయాన్ని ఎదిరించే శౌర్యం నిత్యం మెరిసే చిరు దరహాసం సత్యం పలికే వినయ విధేయం ఎవరెదురైనా బెదరని వైనం కేసుల కుట్రకు లొంగని మానం ఒకే ఒక్కడుగా కదిలే సైన్యం ప్రజా సేవలో జన్మం ధన్యం అని భావించే విశాల హృదయం పట్టిన పట్టును వదలని ధ్యేయం ప్రజల కోసమై విడువని ధ్యానం ఎవరేమన్నా మరువని లక్ష్యం కోరిక ఒకటే శాంతి; సుభిక్షం ప్రత్యేక హోదా ఒకటే గమ్యం అని చాటించి శ్రమించు నిత్యం బడుగు జనులకు ఎంతో సాయం ఎవరికీ ఇది కాదిక సాధ్యం తండ్రి బాటలో నడిచే పయనం తండ్రి పేరునే తలచే అధరం తండ్రి రూపునే చూసే నయనం తండ్రి తెగువనే నిలిపే సుగుణం పేదలను ఓదార్చే నైజం ప్రజా యాత్రలో పంచిన స్నేహం గుండె గుండెను తాకిన బంధం గడప గడపకు పూసిన గంధం లేనే లేదు కులమతాల భేదం ఉన్నది ఒకటే లౌకిక వాదం గుండెల నిండా సోదర భావం కోరును ఒకటే సరి సమన్యాయం యువతకు ఇచ్చెను నవ చైతన్యం రావాలంటూ నవ స్వాతంత్య్రం అందుకు సర్వం సంసిద్ధం దానికి సకలం సన్నద్ధం ఒంటరి గెలుపే పౌరుష చిహ్నం అని చాటెను... పులివెందుల సింహం తిరుగులేనిది ఈ పట్టుదల ప్రత్యర్థులకు గుండె దడ దిక్కున నిండిన శంఖారావం జెండా కలిపెను గగనం భువనం తిమిరంతోనే జరపగ సమరం ప్రజలు ఇచ్చును ఘనమగు విజయం పొత్తును ఎంచని ఘన విశ్వాసం ఊపిరి నిండా ధర్మావేశం ప్రజా శ్రేయస్సే తన ఉఛ్వాసం ప్రజా రక్షణే తన విశ్వాసం కపట నక్కలకు భయ భూకంపం ముగింపుకొచ్చెనులే రగడ చెల్లదు ఎవడీ ఎత్తుగడ అధర్మమెక్కును ఇక ఉరికంబం... ఆంధ్ర సీమకు పట్టిన దైన్యం వదిలించేది... ఈ ఎన్నిక యుద్ధం నవ్యాంధ్రకు రావాలి నూతన ఉదయం ఓదార్పు యాత్ర ఓ చరిత్ర.. ఓదార్పు యాత్ర రాష్ట్రంలోనే కాదు.. దేశచరిత్రలోనే..ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. 12 జిల్లాల్లో 182 రోజుల్లో 15 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమైన ఓ యువకుడి చరిత్ర అది. సమకాలీన రాజకీయాల్లో ఏ నాయకుడూ జనంలో అంత విస్తృతంగా ప్రయాణించిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూసినంత దగ్గరగా పేదరికాన్ని చూసిన రాజకీయనాయకుడు లేనేలేడు. ఓదార్పు నేపథ్యమేమిటంటే..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని ఆంధ్రావని తట్టుకోలేకపోయింది. అనేక గుండెలు ఆగిపోయాయి. వైఎస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద జరిగిన సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ తన తండ్రి మరణాన్నితట్టుకోలేక మరణించిన ప్రతి కుటుంబాన్నీ రానున్న రోజుల్లో ఓదార్చుతానని మాట ఇచ్చారు. ఇలా మొదలైన ఓదార్పు యాత్ర అశేష జనాదరణతో ఓ ప్రభంజనంలా మారింది. ఆయనకు అంతటి ఆదరణ లభించడం కొందరికి నచ్చలేదు. ఓదార్పు యాత్ర వద్దని కాంగ్రెస్‌అధిష్టానం షరతులు విధించింది.అనేక ఆటంకాలు కలిగించింది. ఎన్ని కష్టాలెదురైనాఇచ్చిన మాటకు కట్టుబడిన జగన్ ముందుకే సాగారు. కాంగ్రెస్ అధిష్టానం మాట వింటే జగన్‌కు కేంద్ర పదవి లభించేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవీ దక్కేది. ఐటీ నోటీసులు, సీబీఐ కేసులు, ఈడీ జప్తులు ఉండేవి కావు. కానీ ‘‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అని నమ్మిన వైఎస్సార్ తనయుడు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ముందుకే సాగారు. అలుపెరుగని ప్రయాణంలో లక్షలాది మంది పేదల కష్టాలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. వారి బాధలు విని తల్లడిల్లిపోయారు. వేనవేల కిలోమీటర్ల ఓదార్పు యాత్రతో బాధిత జనం గుండె తలుపులు తట్టాక ఓదార్పు యాత్ర ఇక జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పు యాత్రగా మారిపోయింది. ఓదార్పు యాత్రలో తాను గమనించిన కష్టజీవుల కడగండ్లే జెండా, ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఏకబిగిన 4,367 గ్రామాలు, 102 పట్టణాలు – నగరాలలో పర్యటించారు. మొత్తం 2,217 సభల్లో 863 గంటల పాటు ప్రసంగించారు. 447 కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. అక్రమ నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం వైఎస్సార్ జిల్లాలో మిగిలిన కుటుంబాలను ఓదార్చారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి పూనుకున్నకేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ జగన్ చంచల్ గూడ జైలులోనే 2013 ఆగస్టు 25 నుంచి 31 వరకు వారం రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దీక్షను భగ్నం చేసిన పోలీసులుజగన్‌ను నిమ్స్‌కు తరలించారు. అక్రమ నిర్బంధం నుంచి జగన్ బయటకు వచ్చిన తరువాత 2013 అక్టోబర్ 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని తన నివాసం వద్దనే నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సమైక్యతను కోరుకుంటూ 2013 అక్టోబర్ 26న సమైక్య శంఖారావం సభను భారీ ఎత్తున నిర్వహించి కేంద్రానికి నిరసన తెలిపారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతల మద్దతు కూడగట్టుకునేందుకు కలిశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. విభజన సమయంలో లోక్‌సభలో ఉన్నజగన్‌తో సహా పార్టీ ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసివిభజన బిల్లును ఆమోదించరాదని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పెద్దలకు వినతులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ వైఎస్ జగన్ అలుపెరుగని పోరు సాగించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టడంతో పాటు ఢిల్లీ స్థాయిలో పలువురు ప్రముఖులకు వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకెళ్లారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు.. హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా ఉద్యమాలకు మద్దతు వైఎస్ జగన్ ముఖ్యమైన సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగిస్తూనే వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, రైతుల సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఇందిరాపార్కువద్దనున్న ధర్నా చౌక్‌లో 2011 ఫిబ్రవరి 18 నుంచి వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.కనీస మద్దతు ధర అందక విలవిల్లాడుతున్న అన్నదాతలకు అండగా గుంటూరులో 2011 మే 15న రైతుదీక్ష చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఒంగోలు కలెక్టరేట్ వద్ద 2012 జనవరి 4న ధర్నా చేపట్టారు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా 2012 జనవరి 27న నరసరావుపేటలోభారీ ధర్నా నిర్వహించారు. విజయవాడలో కల్తీ మద్యం బాధితులను 2015 డిసెంబర్ 8న పరామర్శించారు. సమస్యల సాధన కోసం దీక్షలు చేస్తున్న వీఆర్‌ఏలకూ సంఘీభావం తెలిపారు. 2017 నవంబర్ 20న హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ 2018 ఫిబ్రవరి 8న నెల్లూరు జిల్లా జవ్వలగుంటపల్లిలో విద్యార్థులతో కలసి నినాదాలు చేశారు. అసెంబ్లీలో అలుపెరుగని పోరాటం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా అలుపెరుగని పోరాటం చేశారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు, మహిళలను వేధింపులకు గురి చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, ప్రత్యేక హోదా... డ్వాక్రా మహిళల రుణమాఫీ అమలు కాకపోవడం, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, రాజధాని ఏర్పాటులో జరిగిన అక్రమ వ్యవహారాలు,విద్యార్థులకు ఫీజు చెల్లింపు పథకాన్ని నిర్వీర్యం చేయడం, రిషితేశ్వరి మరణం, ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం, ఓటుకు కోట్లు వ్యవహారం..ఇలా ఎన్నో సమస్యలపై ఎలుగెత్తి చాటారు. అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగావ్యవహరించినా... తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా కట్ చేసినా ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఆయన వెనక్కి తగ్గలేదు. ఒక ప్రతిపక్ష నేతను అసందర్భ వ్యాఖ్యలతో, అవమానకరమైన రీతిలో అధికారపక్షం సభ్యులు దూషిస్తున్నా పంటి బిగువునా ప్రజల కోసం బాధను భరించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ఫిరాయింపులను అధికారపక్షం ప్రోత్సహించినప్పుడు ఒక సందర్భంలో స్పీకర్‌పైనా, మరో సందర్భంలోప్రభుత్వంపైనా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. రైతు భరోసా యాత్ర వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబునాయుడు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని అమలు చేయక పోవడంతో చాలా మంది రైతుల రుణ భారం పెరిగి, పంటలు నష్టపోయిన పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. నిత్య కరవు జిల్లా అయిన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో చాలా మంది రైతులు ఇబ్బందులకు తాళలేక అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటనలను టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో వైఎస్ జగన్ ఆ జిల్లాల్లోని రైతుల్లో మనోనిబ్బరాన్ని పాదుగొల్పుతూ మరణించిన వందకు పైగా రైతుల కుటుంబాలను ఓదారుస్తూ రైతు భరోసా యాత్ర చేపట్టారు. 2015 ఫిబ్రవరి 26న ప్రారంభమైన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదు విడతలుగా జరిగింది. అంతకు ముందు రైతుల ఆత్మహత్యల విషయాన్ని జగన్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించి నిలదీశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా తాను ఆ జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు జగన్ ప్రకటించగానే టీడీపీ ప్రభుత్వం.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని హడావుడిగా జీవో జారీ చేసింది. ఈ యాత్ర.. రైతులకు పెట్టుబడి నిధి కింద ఏటా రూ.12,500 ప్రకటించడానికి కారణమైంది. సమస్యలు, హామీల వైఫల్యంపై.. చిత్తూరు జిల్లాలో 2011 జూన్ 13న సాగుపోరు చేపట్టారు. 2011 అక్టోబర్ 1న రైతుల సమస్యలపై విజయవాడలో మహాధర్నా, ఇదే సంవత్సరం అక్టోబర్ 11న విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 2015 ఆగస్టు 25న కృష్ణాజిల్లా కొత్తమాజేరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి చనిపోయిన 18 మంది కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం 2015, సెప్టెంబర్ 30న టంగుటూరు పొగాకు వేలం కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద 2016, సెప్టెంబర్ 3న రైతు మహాధర్నా నిర్వహించారు. 2016, అక్టోబర్ 4న కరువు, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతు మహా ధర్నా చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 2016, డిసెంబర్ 9న ఒంగోలులో మహాధర్నా నిర్వహించారు. కరువును ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా 2016, మే 2న మాచర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు వైఖరిపై నిరసనగా 2014, జూలై 24నుంచి మూడు రోజులపాటు ‘నారాసుర వధ’ పేరుతో నిరసన తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద «2014, డిసెంబర్ 5న ధర్నా చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇదే అంశంపై తణుకులో 2015, జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజులు రైతు దీక్ష చేపట్టారు. ఇదే విషయమై ప్రజలను జాగృతం చేస్తూ 2016 జూలై 8న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని ఇడుపులపాయలో ప్రారంభించారు. వంచనపై ప్రజాగర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద 2018, మే 16న ధర్నాలు నిర్వహించారు. ఇదే ఏడాది జూన్ 2న నెల్లూరులో, జూలై 2న అనంతపురంలో, ఆగస్టు 9న గుంటూరులో వంచనపై గర్జన కార్యక్రమాలు నిర్వహించారు.పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా 2011, జనవరి 22న విశాఖపట్టణంలో జనదీక్ష నిర్వహించారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ తొలి నుంచీ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలో 2015 జూన్ 3న రెండు రోజుల పాటు సమర దీక్ష చేశారు. కేంద్రంలో మంత్రులను, రాష్ట్రపతిని పలు సందర్భాల్లో కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 2015 ఆగస్టు 10వ తేదీన హోదా కోసం జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు పార్టీ నేతలతో కలిసి దీక్ష నిర్వహించారు. 2015 అక్టోబర్ 7 నుంచి ఏడు రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేశారు. 2015 అక్టోబర్ 17 నుంచి మూడు రోజుల పాటు పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హోదా కోసం ధర్నాలు జరిగాయి. 2016 మే 10న కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనకు నిరసనగా 2016 ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు నిచ్చారు. ఆయన జన మోహనుడు ఆ తర్వాత అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై యువతను జాగృతం చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా 2017 జనవరి 26న విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి అక్కడకు వెళ్లగా, ఎయిర్‌పోర్టులోనే అటకాయించి అరెస్టు చేసి వెనక్కి పంపారు. ప్రత్యేక హోదా కోరుతూ మరెన్నో పోరాటాలు చేసిన అనంతరం 2018 మార్చి 3న ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఆ తర్వాత పార్లమెంటులో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎంపీలు తొలుత 13 సార్లు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. తీర్మానం అనుమతించకుండా అడ్డుపడటంతో 2018 ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. 2016 ఏప్రిల్ 16న ఎంపీల అరెస్టులకు నిరసనగా జగన్ ఒక రోజు బంద్‌కు పిలుపు నిచ్చారు. ఆ తర్వాత అనేక జిల్లాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు, మోదీలు వంచించినందుకు నిరసనగా ‘వంచనపై గర్జన’ సభలు జరిగాయి. హోదా పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై జాతీయ స్థాయిలో పోరు వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేసినందుకు నిరసనగా ‘సేవ్ డెమాక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో వైఎస్ జగన్ ఉద్యమాన్ని చేపట్టి జాతీయ స్థాయిలో ఈ దురాగతాన్ని ఎలుగెత్తి చాటారు. 2016 ఏప్రిల్ 22న పార్టీ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అదే నెలలో ఢిల్లీకి పార్టీ నేతలతో కలిసి వెళ్లి జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపుల పర్వం ఆగక పోవడంతో 2017 అక్టోబర్ 27న రాష్ట్రపతిని కలిసి చంద్రబాబు అనైతిక వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2017 నవంబర్ 9న శాసనసభను బహిష్కరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, నలుగురు ఫిరాయింపు మంత్రులపై చర్యలు తీసుకుంటేనే సభకు హాజరవుతామని స్పీకర్‌కు నివేదించారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించక పోవడంతో శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే సహించలేక ఇక ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందామని జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టి 341 రోజుల పాటు ప్రజల్లోనే గడిపారు. చేనేతలకు భరోసా చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా అనంతపురం జిల్లా ధర్మవరంలో 2012 ఫిబ్రవరి 12న మూడురోజుల పాటు నిరాహర దీక్ష చేశారు. ఆ తర్వాత చేనేత కార్మికులు దీక్షలు చేపడితే వారికి సంఘీభావం తెలపడానికి 2017 అక్టోబర్ 17న ధర్మవరం వెళ్లారు. అక్కడి చేనేత అక్కచెల్లెమ్మల కష్టాలు చూశాక.. వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఇవ్వాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. అంతకు ముందు 2010 డిసెంబర్ 21న విజయవాడ కృష్ణా తీరంలో రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టారు. కృష్ణాజలాల పంపకంలో న్యాయం జరగాలని 2011 జనవరి 11న ఢిల్లీలో, కృష్టా,గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 2016 మే 16 నుంచి మూడు రోజులపాటు కర్నూలులో జలదీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై రైతన్నల ఆకాంక్షను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకు 2011, ఫిబ్రవరి 7న హరితయాత్ర (రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభం– పోలవరం సభతో ముగింపు) 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై 2016, డిసెంబర్ 26న పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా. 2017, ఫిబ్రవరి 6న హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌తో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా. 2015 ఏప్రిల్ 15న పట్టిసీమ వద్దు – పోలవరం ముద్దు అంటూ బస్సు యాత్ర. రాజధాని పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూసేకరణను వ్యతిరేకిస్తూ 2015, ఆగస్టు 26న రైతులకు మద్దతుగా సీఆర్‌డీఎ కార్యాలయం వద్ద ధర్నా మరో చరిత్ర సృష్టించిన ప్రజా సంకల్పయాత్ర ఇంతింతై వటుడింతై అన్న చందంగా ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించింది. చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ, వినీ ఎరుగని రీతిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను కళ్లారా చూశారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రారంభమైన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. దారి వెంట ఆద్యంతం చిన్నారులు మొదలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అవ్వాతాతల వరకు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలుకుతూనే వారి కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సాక్ష్యాలతో వివరించారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాలను కన్నీళ్ల పర్యంతమవుతూ ఏకరువు పెట్టారు. కుల వృత్తుల వారు వారి ఇక్కట్లను కళ్లకు కట్టారు. యాత్ర సాగుతున్న కొద్దీ విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, వివిధ ప్రజా సంఘాల నాయకులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఒక జిల్లాలో యాత్ర ముగించుకుని మరో జిల్లాలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆ ప్రాంతం అభిమానులు, కార్యకర్తలతో జనసంద్రాన్ని తలపించింది. కృష్ణాలో ప్రవేశిస్తున్నప్పుడు జన తాకిడికి కనకదుర్గ వారధి ప్రకంపించడం, రాజమండ్రి వద్ద రైల్ కమ్ రోడ్డు వంతెనపై కనుచూపు మేర జన ప్రవాహం అఖిలాంధ్ర జనాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సభలకైతే జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాల వారు, కుల వృత్తుల వారు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి వైఎస్ జగన్‌కు వారి కష్టాలు చెప్పుకున్నారు. అందరి కష్టాలను ఓపికగా వింటూ.. అప్పటికప్పుడు, అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ, మిగతా సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతున్న తరుణంలో పాలక పార్టీ నేతలకు కన్ను కుట్టింది. ఏకంగా ప్రతిపక్షనేతను కడతేర్చాలని కుట్ర పన్నడం, ఇందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను వేదికగా ఎంచుకోవడం, త్రుటిలో వైఎస్ జగన్ హత్యాయత్నం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. కుట్రలు, కుతంత్రాలు, రోళ్లు పగిలే ఎండలు, ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలు, అనారోగ్యం.. ఇవేవీ జగన్‌ను ఆపలేకపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 341 రోజులు పాటు 231 మండలాల్లో 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రభుత్వ దమన నీతిని, దుర్మార్గాలను కడిగిపడేశారు. 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు మీదుగా సాగిన యాత్రలోం 124 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కష్టాల కడలి నుంచి బయట పడేసేందుకు నవరత్నాలకు మెరుగులు దిద్దడంతో పాటు విమర్శకుల మన్ననలు సైతం పొందేలా కొత్త హామీలు ఇస్తూ ఈ ఏడాది జనవరి 9న ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించారు. యాత్రను ఆద్యంతం గమనించిన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. నాయకుడంటే ఇలా ఉండాలని కితాబులందుకున్నారు.వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ నిర్ణయించారు.