‘భరోసా’ లేక భారంగా సాగు

గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..

పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత అగచాట్లు.. 

ప్రతీ రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అంటూ సూపర్‌సిక్స్‌లో కూటమి హామీ

పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఊసెత్తని ప్రభుత్వ పెద్దలు.. అప్పుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు

ఐదేళ్ల పాటు పెట్టుబడి సాయం సమయానికి అందించిన వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం

అమరావతి: ఖరీఫ్‌ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగ­చాట్లు పడుతున్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపా­రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టు­బడి సాయం చేతికందగా ఈసారి వ్యవ­సాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్‌ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైయ‌స్ఆర్‌ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్‌ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్‌ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. 

అర హెక్టార్‌ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్‌ సిక్స్‌లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేరు మార్చేందుకే ఉత్సాహం..
ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైయ‌స్ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. 
 

భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్‌ కింద 2024–25 సీజన్‌ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.

పెట్టుబడి కోసం అగచాట్లు..
గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్‌ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లా

సాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..
గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైయ‌స్ఆర్‌ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లా

ఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..
వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్‌ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్‌లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.  
– తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా

మా గోడు పట్టించుకోండి..
గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. 
– రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.

పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..
సీజన్‌ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి  విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. 
– చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా

వారం పది రోజుల్లోనే ఇస్తామని..
అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.
– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్‌ మండలం

వ్యవసాయం ఇక కష్టమే
జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్‌ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,
–ఆకుల నారాయణ రైతు వంగర 

సాయం చేయాలి...
మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. 
– వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట, మర్రిపాడు మండలం

Back to Top