షరతులతోనే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీసుల షరతులు పక్కాగా పాటింపు

పాదయాత్ర శాంతియుత నిర్వహణకు పూర్తి బాధ్యత వహించిన వైఎస్సార్‌సీపీ

ఆద్యంతం క్రమశిక్షణ, పక్కా ప్రణాళికతో సాగిన ప్రజా సంకల్ప యాత్ర

ప్రస్తుతం లోకేశ్‌ పాదయాత్రకు అవే షరతులతో పోలీసుల అనుమతి

అయినా సరే వక్రీకరిస్తూ టీడీపీ, ఈనాడు రాజకీయ రాద్ధాంతం

లోకేశ్‌ పాదయాత్రకు హైప్‌ సృష్టించేందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం

ప్రజల నుంచి స్పందన లేకపోవడంతోనే కుట్ర రాజకీయాలు

అమరావతి: చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నది రాజ్యాంగం స్పష్టం చేస్తున్న అంశం. కానీ చట్టానికి తాము అతీతమన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు ‘ఈనాడు’, ఇతర ఎల్లో మీడియా  వత్తాసు పలుకుతూ వక్రీకరణలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు మధ్య పరస్పర వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు. అందుకోసం చంద్రబాబును అర్జంటుగా సీఎంను చేసేయాలని రామోజీరావు ఆరాటపడుతూ ఉండొచ్చు.

లోకేశ్‌కు లేని ప్రజాదరణను ఉన్నట్టుగా చూపించేందుకు నానా తంటాలు పడొచ్చు. కానీ చట్టానికి వాటితో ఏం పని? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలా కాకుండా చట్టం తమ చుట్టం అని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావిస్తూ రాజకీయ రాద్ధాంతం చేస్తుండటం విస్మయ పరుస్తోంది. అందుకే తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ కట్టుకథలతో కనికట్టు చేసేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతోంది.

లోకేశ్‌ పాదయాత్రకు నిబంధనల మేరకు పోలీసు శాఖ అనుమతిచ్చింది. అయినా సరే ‘యువ గళానికి ఆంక్షల సంకెళ్లు’ అంటూ ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తాజా నిదర్శనం. పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు చట్టంలో ఉన్న అతి సామాన్యమైన షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.

ఆ షరతులు ఇప్పటికిప్పుడు కొత్తగా పెట్టినవి కావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్న భారత పోలీసు చట్టంలో పేర్కొన్నవే అవి. 2009లో సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా స్పష్టం చేసిన షరతులనే ప్రస్తుతం పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు.

నాడు పోలీసులు నిర్దేశించిన, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షరతులు ఇలా..
► వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా ఎస్పీలు/ నగర పోలీసు కమిషనర్లు, సంబంధిత ప్రాంతంలోని పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలి.

► పాదయాత్రలోకానీ, పాదయాత్ర సందర్భంగా నిర్వహించే సభల్లో కానీ.. వచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీదే. అంటే పాదయాత్ర నిర్వాహకులదే. వలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. 

► పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. 

► ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగితే, అల్లర్లు చెలరేగితే ఆ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు ఆ పాదయాత్ర నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యకర్తలపై కేసులు పెడతారు. కానీ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నిర్వా­హకులు తెరవెనుక ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా వారిపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. పాద­యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామ­ని...­అందుకు విరుద్ధంగా ఏదైనా విధ్వంసం జరిగితే తాము బాధ్యత వహిస్తామని నిర్వా­హకులు ముందే లిఖిత పూర్వకంగా తెలియ­జేయాలి. 

► పాదయాత్ర కొనసాగే పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ అధికారి ప్రత్యేకంగా ప్రైవేట్‌ వీడియో­గ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని మరీ పాద­యాత్ర/సభను వీడియో తీయించాలి. ఏదైనా విధ్వంసం జరిగితే సంబంధిత వీడియో క్లిప్పింగులను ఆధారాలుగా పరిగణిస్తూ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలి. ఆ వీడియో సీడీనీ మెజిస్ట్రేట్‌ ఎదుట సమర్పించాలి. 

► పాదయాత్రలో ఏదైనా విధ్వంసం సంభవిస్తే నిర్వాహకులు వెంటనే పోలీసు అధికారులను కలవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు గాను రూట్‌మ్యాప్‌లో మార్పులు చేయాలి.

► ఎటువంటి ఆయుధాలను పాదయాత్రలో అనుమతించరు.

► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ, దుస్సంఘటనగానీ జరిగితే పోలీసులు తగిన వీడియో ఆధారాలతో ప్రభుత్వానికి నివేదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నివేదికను రూపొందించాలి. అవసరమైతే వాటి­ని హైకోర్టుకుగానీ సుప్రీంకోర్టుకుగానీ సమర్పించాలి. ఎందుకంటే ఆ విధ్వంసం/ దుర్ఘటనపై సుమోటోగా హైకోర్టుగానీ సుప్రీంకోర్టుగానీ కేసు నమోదు చేయవచ్చు. అప్పుడు విచారణకు ప్రభుత్వం ఆ నివేదికను సమర్పించాలి. 

► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాయి. బాధితులకు నిర్వాహకులతో నష్టపరిహారాన్ని ఇప్పిస్తాయి. అందుకోసం అవసరమైతే సిట్టింగ్‌/ రిటైర్డ్‌ న్యాయమూర్తితో క్‌లైమ్‌ కమిషన్‌ను న్యాయస్థానం ఏర్పాటు చేస్తుంది. 

► పాదయాత్ర సందర్భంగా ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే మీడియా (ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ మీడియా) బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ కల్పించింది. కానీ సంచలనాలకు కాకుండా సంయమనానికి మీడియా అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మీడియాను నియంత్రించడం అని కాదు గానీ ప్రెస్‌ కౌన్సిల్‌ మీడియా బాధ్యతా­యుతంగా వ్యవహరించేలా పర్యవేక్షించాలి. 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆయన పీఎస్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డి 2017లో అప్పటి డీజీపీకి సమర్పించిన దరఖాస్తు  

ఇప్పుడెందుకీ రాద్ధాంతం?
భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అవే షరతులతో ప్రస్తుతం పోలీసు శాఖ నారా లోకేశ్‌ పాదయాత్రకు అనుమతిచ్చింది. గతంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు విధించిన షరతులనే ప్రస్తుతం పేర్కొంది. కొత్తగా ఎలాంటి షరతూ విధించ లేదు. పోలీసులకు రూట్‌మ్యాప్‌ను ముందుగా తెలపాలి.. రూట్‌మ్యాప్‌కు కట్టుబడి పాదయాత్ర సాగాలి.. నిర్ణీత ప్రదేశాల్లోనే సభలు నిర్వహించాలి.. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు.. ఎవరూ మారణాయుధాలు కలిగి ఉండకూడదు.. ఇలా ఎప్పటి నుంచో దేశంలో అమలు­లో ఉన్న సాధారణ షరతులనే పోలీసులు విధించారు.

ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తాము ఆనాడు తలచుకుని ఉంటే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదం. ఇటీవల చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలతో 11 మంది దుర్మరణం చెందారు. అందుకే పాదయాత్ర నిర్వాహ­కు­లు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని.. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సూచించారు.

అందులో తప్పుబట్టడానికి ఏముంది? కేవలం నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించడం లేదన్నదే చంద్రబాబు, ఈనాడు రామోజీ­రావు ఆందోళన. అందుకే పోలీసులు సాధారణ షరతులతో ఇచ్చిన అనుమతిని వక్రీకరిస్తూ ప్రభు­త్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా లోకేశ్‌ పాదయాత్ర పట్ల లేని హైప్‌ను సృష్టించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడు­తు­న్నారని స్పష్టమవుతోందనిపరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
పోలీసుల షరతులు, సుప్రీంకోర్టు తీర్పులోని షరతులతో పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం 

షరతులకు కట్టుబడే.. చరిత్రాత్మక పాదయాత్ర
పోలీసు శాఖ విధించిన షరతులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తునే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పూర్తి చేశారు. తన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను 2017 నవంబరు 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించి.. 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రూట్‌మ్యాప్‌ రూపొందించారు.

సభలు నిర్వహించేందుకు తగినంత విశాలమైన ప్రదేశాలను నిర్వాహకులు ముందుగానే ఎంపిక చేసుకుని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆమోదించిన తర్వాతే ఆ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. ఎక్కడ కూడా ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాదని మరోచోట సభ నిర్వహించ లేదు. అంత పకడ్బందీగా రూట్‌మ్యాప్‌ అనుసరించారు. మైక్‌లను ఉపయోగించేందుకు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.

పాదయాత్రలో, పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలు సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ వలంటీర్లను ముందే నియమించారు. అందుకే అంతటి సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడా సాధారణ జనజీవనానికి ఇబ్బందులుగానీ ట్రాఫిక్‌ సమస్యలుగానీ తలెత్తనే లేదు.  ఎక్కడా తోపులాటలుగానీ తొక్కిసలాటలుగానీ సంభవించలేదు. ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం సజావుగా, సక్రమంగా సాగింది. 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు విశాఖపట్నం పోలీసులు విధించిన షరతులు, మైక్‌ వినియోగానికి జారీ చేసిన అనుమతి పత్రం 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు షరతులతోనే అనుమతి
67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017లో ‘ప్రజా సంకల్ప యాత్ర’పేరుతో చేపట్టిన పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసు శాఖ షరతులతోనే అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన పీఎస్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డి డీజీపీకి దరఖాస్తు చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం అప్పటి డీజీపీ సాంబశివ­రావును కలిసి పాదయాత్రకు అనుమతి కోరింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే డీజీపీ షరతులతో కూడిన అనుమతినిచ్చారు. పోలీసు­లు ఎన్నో షరతులు విధించడంతోపాటు సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన మార్గదర్శకాలు, షరతు­లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాదయాత్ర సాగే జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఆ షరతుల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించారు. 

Back to Top