‘అన్ని వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ కుల, ఆదాయ, ఫ్యామిలీ.. ఇతరత్రా సర్టిఫికెట్లు పొందాలంటే అంత సులువు కాదన్న విషయం అందరికీ అనుభవమే. విద్యా సంవత్సరం ప్రారంభంలో అయితే మరీ కష్టం. సర్టిఫికెట్లు కొంచెం త్వరగా కావాలనుకుంటే రోజుల తరబడి పనులు మానుకుని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు మీకు ఏవైనా సర్టిఫికెట్లు కావాలా? అని ఇంటి వద్దకే వచ్చి వివరాలు తీసుకెళ్తున్నారు. వారం తిరక్కుండానే సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. జయహో జగనన్న సురక్ష’ అంటూ ఊరూరా ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తరఫున వలంటీర్లు ఇంటికే వచ్చి ఏవైనా సమస్యలున్నాయా.. సర్టిఫికెట్లు కావాలా.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. అని అడిగి తెలుసుకోవడం తొలిసారిగా చూస్తున్నామని జనం చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలందించేందుకు జల్లెడ పడుతుండగా మరో పక్క క్యాంపుల ద్వారా అక్కడికక్కడే అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసే కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించి రికార్డు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ పాఠశాలలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సురక్ష శిబిరాల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. వారంలోగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అందించారని విశాఖ జిల్లా వాసి సాసబోయిన దాసు ఆనందంగా చెప్పాడు. ఇంటికే వచ్చి వివరాలు తీసుకుని బర్త్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చారని అనంతపురం జిల్లా వాసి అభిదా సంతోషం వ్యక్తం చేసింది. అత్త, మామల పేర్లను రేషన్ కార్డు నుంచి వేరు చేసి, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చారని పల్నాడు జిల్లాకు చెందిన దుడ్డు ఇందు సంబరపడిపోతూ తెలిపింది. ప్రజల ఇంటికే వచ్చి మీకు ఏ సమస్యలున్నాయని అడుగుతున్న తొలి సర్కారు ఇదేనని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వినతుల పరిష్కారం ► ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు 1,305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే, వాటిలో 4,57,642 అక్కడికక్కడే పరిష్కరించారు. 17వ తేదీ నాటికి 9,721 సచివాలయాల పరిధిలో 53.24 లక్షల వినతులు వస్తే, అందులో 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒక్క రోజే 6.5 లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. ► ఇప్పటిదాకా 1,69,891 మంది వలంటీర్లు జగనన్న సురక్ష శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా, అధికారులు 4,37,509 పరిష్కరించారు. అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా, 62,312 పరిష్కారమయ్యాయి. ► ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 4,154 ఓబీసీ సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ► ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8,263, ఆధార్‌తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి. ► ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని, జగనన్న ప్రభుత్వంలో ఏ పని అయినా సులభంగా పూర్తవుతోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండీ కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వలంటీర్‌ను కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను కానీ సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. సర్టిఫికెట్ ఇంటికి తెచ్చిచ్చారు.. నాకు బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం సర్టిఫికెట్ అవసరమైంది. వీటి కోసం గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదు. ఇప్పుడు మా ఇంటికే వలంటీర్ వచ్చి నాకేం కావాలో మరీ అడిగి తెలుసుకున్నాడు. కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే బర్త్ సర్టిఫికెట్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – అభిదా, కణేకల్లు క్రాస్, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా తొమ్మిదేళ్ల తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫ్యామీలీ మెంబర్ సర్టిఫికెట్ లేకపోవడంతో కుటుంబ ఆస్తుల కోసం తగాదాలు చోటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తొమ్మిదేళ్ల క్రితం ఆఫీసుల చుట్టూ తిరిగినా అది ఇక రాదని ఆశ వదులుకున్నాం. ఇక మా కుటుంబం బతుకింతే అనుకున్నాం. కొద్ది రోజుల కిందట మా ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది, వలంటీరుకు మా పరిస్థితి వివరించాం. వివరాలు తీసుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకు సురక్ష క్యాంపులో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందించారు. తొమ్మిదేళ్ల మా ఇబ్బందులకు పరిష్కారం చూపించారు. – సాసబోయిన దాసు, ప్రైవేటు ఉద్యోగి, గెడ్డవీధి, జ్ఞానాపురం, విశాఖ జిల్లా కొత్త రేషన్ కార్డు వచ్చింది మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా తెల్లరేషన్ కార్డులో నేను, నా భర్త సాగర్, మా అత్తమామలు యాకోబు, రాణి, మరిది మధు ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు రేషన్‌కార్డు డివైడ్ చేయాలని కోరినా ఫలితం లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వారం క్రితం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మా ఇంటికొచ్చారు. సమస్య చెప్పాం. నాకు, నా భర్తకు కలిపి వేరే కార్డు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దుడ్డు ఇందు, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా