నారా వారి నయవంచన

చంద్రబాబు పరిపాలనలో వెక్కిరిస్తున్న వైఫల్యాలు

జనాన్ని భ్రమల్లో ముంచిన సీఎం   

ఒక్క హామీనైనా నిలబెట్టుకోని వైనం

విద్య, వైద్యం, సంక్షేమం.. నిర్వీర్యం

మద్యం, మట్టి, ఇసుక, గనులు.. అన్నింటా అవినీతే

సంక్షేమ పథకాలన్నీ పచ్చ నేతలకే..

పేదల బతుకులు మరింత దుర్భరం

అవినీతిలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

ప్రలోభాల ఎరవేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు

రాజకీయాల్లో నైతిక విలువలకు బాబు పాతర

  

అమరావతి: నలభై ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇతమిత్థంగా ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసేందుకే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలోని అగ్రగామిగా నిలిపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. శాంతి భద్రతలను గాలికొదిలేశారు. రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టపగలే పాతరేశారు.
రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్‌ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు గద్దెనెక్కాక ఆ మాటే మర్చిపోయారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకేపెద్దపీట వేస్తున్నారు. తన వైఫల్యాలు, అసమర్థతకు అభివృద్ధి అనే ముసుగు వేస్తూ జనాన్ని భ్రమల్లో ముంచేస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏదైనా సాధించారా? అని పరికించి చూస్తే నిరాశే ఎదురవుతోంది. బాబు పాలనలో కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలూ మోసపోయారు. ఫలానా వారికి ఫలానా మేలు చేశానని నోరువిప్పి చెప్పుకోలేని దుస్థితిలో సీఎం ఉన్నారంటే ఆయన పనితీరు ఏమిటో ఇట్టే  తెలిసిపోతోంది. విద్య, వైద్యం, సంక్షేమం.. అన్ని రంగాలనూ నిర్వీర్యం చేశారు.
పదేళ్లు అధికారానికి దూరమై రాజకీయ అస్తిత్వం కోల్పోయే దశకు చేరువైన చంద్రబాబు.. 2014 ఎన్నికలకు ముందు 600కుపైగా హామీలతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కల్పిస్తానని.. రూ.5.000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానంటూ ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారు. రైతుల నెత్తిన అప్పుల భారం పెరిగిపోయింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ హామీ ఇచ్చి విస్మరించారు.
డ్వాక్రా మహిళలు అప్పులూ మాఫీ చేయకుండా నయవంచనకు పాల్పడ్డారు. మహిళలపై దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు దండన విధించాల్సిన చంద్రబాబు.. ఆయనకు పనితీరులో నంబర్‌ వన్‌ ర్యాంకు ఇవ్వడం గమనార్హం. పరిపాలనలో చంద్రబాబు వైఫల్యాల వల్ల రాష్ట్రం పీకల్లోతు సంక్షోభంలో చిక్కుకుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఉద్యోగాల్లేవ్‌.. భృతి రాదు
ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవగా మార్చేసి, సక్రమంగా నిధులు కేటాయించకుండా.. అక్కరకు రాని షరతులు విధించి నిరుపేదలను పరిహసం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించడంలో, మందులు అందుబాటులో ఉంచడంలోనూ చేతులెత్తేశారు. బాబు నిర్వాకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు పతనావస్థకు చేరుతున్నాయి. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.రెండు వేలు ఇస్తామన్న హామీని చంద్రబాబు గాలికొదిలేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులనే తొలగిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించుకోస్తానంటూ నాలుగేళ్లలో 22 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి విశాఖపట్నంలో నాలుగుసార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, వారితో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించారు.
లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ, ఆ ఒప్పందాలేవీ కార్యరూపం దాల్చలేదు. కొత్తగా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం విషయంలో చంద్రబాబు సవాలక్ష ఆంక్షలతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను దూరం చేశారు. ప్రభుత్వం నుంచి ఫీజులు రాక విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. జన్మభూమి కమిటీల ముసుగులో సంక్షేమ పథకాలను టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టి.. పేదలను మరింత పేదలుగా మార్చడంతో బాబు విజయం సాధించారు.  
అంతర్జాతీయ స్థాయి అవినీతి
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేకుండా చేశారని, తాను అధికారంలోకి వస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధాని నగరాన్ని నిర్మిస్తానని చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. రాజధాని ఏర్పాటుపై తన వంది మాగదులకు ముందే లీకులిచ్చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకు రైతుల భూములు కాజేసి రూ.కోట్లు దోచుకున్నారు. ఆ తర్వాత రాజధాని పేరుతో రైతుల నుంచి 33,000 ఎకరాల పచ్చటి పంట పొలాలను లాక్కున్నారు.
మాస్టర్‌ ప్లాన్‌ అంటూ రాజధాని నిర్మించకుండా కాలయాపన చేశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో అమరావతిలో 1,691 ఎకరాలను సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కమీషన్లు కొట్టేయడానికి స్కెచ్‌ వేశారు. శాశ్వత భవనాలు నిర్మించకుండా.. తాత్కాలిక భవనాల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. నాలుగేళ్లలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసన మండలి భవనాలు మినహా మరే ఇతర నిర్మాణాలు చేపట్టకుండా ప్రజల కలలను పురిట్లోనే చిదిమేశారు.
నైతిక విలువలకు తిలోదకాలు
ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్షల కోట్లు వేనకేసుకుంటున్న చంద్రబాబు.. ధన బలంతో స్వరాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ ప్రత్యర్థులను అస్థిరపర్చడానికి పూనుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు నోట్ల కట్టలిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు.
రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన ధనంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల దాకా ముట్టజెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. నైతిక విలువలను పాతాళంలోకి తొక్కేశారు. అవినీతిలో, విలువల్లేని రాజకీయాలు చేయడానికే చంద్రబాబు అనుభవం ఉపయోగపడిందని టీడీపీ సీనియర్‌ నేతలే చెబుతుండడం గమనార్హం.
బాబు అక్రమార్జనకు అంతేలేదు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు అవినీతి గురించి చెప్పాలంటే దానికి అంతే ఉండదు. రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కోసం కేంద్రం నుంచి చేజిక్కించుకుని నీరుగార్చారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల్లో రూ.వేల కోట్లు మింగేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి, అంచనా వ్యయాలను భారీగా పెంచేసి, ఆయా పనులను తన సన్నిహిత కాంట్రాక్టర్లకు అప్పగించి భారీ ఎత్తున కమీషన్లు వసూలు నొక్కేస్తున్నారు.
కేవలం కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో రూ.12,866 కోట్ల విలువైన పనులను టీడీపీ కార్యకర్తలకు నామినేషన్‌ విధానంలో కట్టబెట్టారు. పనులు చేయకున్నా నిధులు చెల్లించారు. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా, చిత్రావతి, తుంగభద్ర వంటి నదులతోపాటు వాగులు, వంకల్లో ఇసుకను టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా లూటీ చేసి.. రూ.కోట్లకు పడగలెత్తుతుంటే వాటికి అడ్డకట్ట వేయాల్సిందిపోయి వాటాలు రాబట్టుకుంటున్నారని చంద్రబాబుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
మద్యం, మట్టి, ఇసుక, గనులు.. చంద్రబాబు అక్రమ సంపాదనకు కాదేది అనర్హం. రూ.వేల కోట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి తన మనుషులను రాష్ట్రంపైకి ఉసిగొల్పారు. అన్ని వ్యాపారాలను హస్తగతం చేసుకుంటున్నారు. దారికి రాని వారిని బెదిరింపులతో లొంగదీసుకుంటున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు అక్రమార్జన రూ.లక్షల కోట్లలోనే ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.
అన్నిరంగాలూ అవినీతిమయం..
బాబు ఏలుబడిలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అవినీతిని చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే దాటేశారంటే ఇక ఈ నాలుగేళ్లలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాబు పాలన అవినీతిమయంగా ఉందని 2016లో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) ఓ నివేదికలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోకెల్లా మొదటిస్థానంలో ఉందని ఆ నివేదికలో పేర్కొంది.
తాజాగా 2018లో సీఎంఎస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో ఉంది. అన్ని రంగాలూ అవినీతిమయమయ్యాయి. ఇసుక నుంచి ఇరిగేషన్‌ వరకు, బొగ్గు కొనుగోళ్ల నుంచి సోలార్‌ టెండర్ల వరకు, మట్టి నుంచి మద్యం డిస్టిలరీల వరకు అన్నింటా అవినీతే. రాజధాని పేరుతో భూములు కొల్లగొట్టారు. చివరకు గుడి భూములను కూడా వదలలేదు. నాలుగేళ్లలో అవినీతి నాలుగు లక్షల కోట్లు దాటిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

Back to Top