మళ్లీ నమ్మి మోసపోతే...మునిగిపోయినట్టే!!

రెండు దశాబ్దాల క్రితం మాట. అప్పట్లో ఏ.పిలో పబ్లిక్‌రిలేషన్స్‌ సంబంధించి కొత్తగా పీజీ డిపిఆర్‌ కోర్సు ఒకటి మొదలయింది. బహుశా దేశంలో కూడా...
ఆ రోజుల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్స్‌పై భలే కథ ఒకటి చెబుతూ వుండేవారు. వాట్‌ నాట్‌...అన్నింటా అత్యంత సమర్థత చూపే సత్తా వారికి ఉండాల్సిందేనన్నది సారాంశం. వారి వాక్చాతుర్యం, ప్రజల్ని ఆకట్టుకునే నేర్పరితనం ఎలా వుండాలంటే..నరకాన్ని కూడా కోరుకుని మరీ ఎంటరయిపోవాలి అవతలివారు. సరే... ఆ కథేందో చూద్దాం.
నరకమంటే జనం వణికిపోయే రోజులు. అక్కడి శిక్షల గురించి పురాణాల్లో...గుళ్లల్లో బొమ్మల్లో చూసి దడదడలాడిపోయేవాళ్లు. అంతో ఇంతో మంచిగా వుంటే పోలా...పోయిన తర్వాత నరకం బాధలు తప్పించుకోవచ్చని ఆలోచించేవాళ్లు. అలాంటి రోజుల్లో...నరకానికి డిమాండ్‌ తగ్గుతోందని, స్వర్గంలోని ఆకర్షణల దెబ్బకు మనుషులంతా అటే మొగ్గుచూపుతున్నారని ఆలోచించిన నరకాధిపతి...యమభటులతో అసలు పని కాదనుకుని...నరకం కోసం పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్స్‌ను రిక్రూట్‌ చేసుకున్నాడు. ఇక చూస్కోండి...వారు పని మొదలుపెట్టగానే...రిజల్టు కనిపించసాగింది. చచ్చి పైదాకా చేరుకున్న జనానికి అటు స్వర్గ,నరకద్వారాలు కనిపించేవి. సరిగ్గా అక్కడే డిపార్ట్‌మెంట్‌ ఓపెన్‌ చేసేశారు పీఆర్‌ పర్సన్స్‌. ఇంకేముంది అక్కడకు జనం రావడం ఆలశ్యం...నరకం నుంచి మంచిమంచి ...ఖుషీఖుషీ పాటలు సౌండ్‌ ఎఫెక్ట్‌తో వినిపించేవి. స్వర్గంలో వుండాల్సిన రంభ,ఊర్వశి,మేనక, తిలోత్తమలు నరకంలో కనిపించేవారు. డాన్స్‌లతో కనువిందుచేసేవారు. వారిచుట్టూ చేరుకున్న వారు పొందుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఓవైపు మధుపానం, మరోవైపు మగువల విలాసాలు...అనుభవించినవారికి అనుభవించనంతగా నరకవైభోగాలు వెలిగిపోతూ కనిపించేవి. ఇంకేముంది...స్వర్గానికి వెళ్లే అవకాశమున్న వారు సైతం మరో ఆలోచన లేకుండా ...నరకాన్నే ఛాయిస్‌గా ఎంపికచేసుకోవడం మొదలుపెట్టారు. ఎంట్రీ లెవెల్‌ అదిరిపోయేది. గాల్లో తేలిపోతున్నట్టుగా...దూదిపింజల మేఘాలపై నడిచిపోతున్నట్టు...ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌తో నరకంలోకి ...లోలోపలికి వెళ్లిపోయేవారు.
అలా వెళ్లినవారు ...అలా లోపలిపోగానే వారి పరిస్థితి ఏమయ్యేదంటే..  త్రీడీ ఎఫెక్ట్‌లో కనిపించిన అప్సరసల ప్లేస్‌లో...యమభటులు కనిపించేవారు. పూలమాలలేసి మరీ స్వాగతిస్తారన్న భ్రమల్లో వున్న పాపం..నరమానవులకు ఛెళ్లుఛెళ్లుమని ఒళ్లు తేలేలా కొరడాలకొద్దీ దెబ్బలదెబ్బలు పడేవి. పిల్లాడు బొమ్మను విసిరేసినట్టుగా...వచ్చిన మనుషులను సలాసలాకాగే నూనె గోళాల్లో పడేసేవారు. మరికొందరినేమో...రంపాలతో పరపరా కోసి...సరదా తీర్చుకునేవారు. ఇలా యమభటులు చీల్చిచెండాడుతున్న...బాధితుల ఆలోచనంతా ఒక్కటే. అసలేం జరిగింది. బయట కనిపించింది. లోపల సినిమా బ్రహ్మాండమని భ్రమలు కల్పించింది ఎవరు? ఎవరు? అని బుర్రలు బద్దలు కొట్టుకొంటుండగా...పాపం, మాతో చావుశిక్షలు పడుతున్నది చాలక...తలలెందుకు కొంటుకుంటారంటూ....ఓ యమభటుడు అసలు రహస్యం చెప్పాడు. అయ్యా, పాపం అమయాకపు మనుషుల్లారా, బయట నరకాన్ని స్వర్గంగా చూపింది మా పీఆర్‌వో పర్సన్స్‌. అంతా త్రీడీ గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్సే. అవన్నీ తాత్కాలికమే...భ్రమాజనితమే అని తెలియని మీరు పిచ్చిమొహాలేసుకుని ...నరకం ..నరమంటూ చిక్కుకుపోయారు. అనుభవిస్తున్నారని ...అసలు విషయం చెప్పేశాడు. కళ్లు తెరుచుకున్నాయి. సత్యం బోధపడింది. కానీ చేసిదేముంది...మళ్లీ తమకు అవకాశం వచ్చేదాకా...అనుభవించాల్సిందేనని...భూలోకం నుంచి చంకలుగుద్దుకుంటూ...నరకానికెళ్లిన జనం అలా...అలా ఉండిపోయారు. ...మంచికాలం కోసం ఎదురుచూస్తూ....!
కథంతా చదివేశారా? 
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. తనను తాను సీఎం కన్నా, సీఇవోగా చెప్పుకోవడానికి ఇష్టపడతాననే మన చంద్రబాబుగారు, ఎన్నికల వేళ వచ్చేసరికి పీఆర్‌వోగా మారిపోతారు. బ్రోచర్లలాంటి మేనిఫెస్టోల తయారీ ఓవైపు చేస్తూనే, ఓట్లపండగకు మూడునాలుగు నెలలముందు...ప్రజలకు అప్పటికప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌ వండిపెట్టినట్టు...పప్పుబెల్లాల్లా తాయిలాలు గబగబాపంచేస్తారు. ఇచ్చేస్తారు. ఇచ్చేసినట్టుగా భ్రమల్లో ముంచేస్తారు. సరిగ్గా...ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. నాలుగున్నరేళ్ల పాటు పెన్షన్లు బాబో అటు అర్హులు నెత్తీనోరూ పట్టించుకోకున్నా, ఇప్పుడు మాత్రం వెయ్యికిరెండువేలు చేసేసి ఇదిగో ఇచ్చేస్తున్నా అంటున్నారు బాబు. 
అసలు రైతులనగా నెవరు? వ్యవసాయం అంటే ఏమిటి? గిట్టుబాటు ధరనా? అన్నట్టుగా ఇంతకాలం చేసిన బాబు...ఇప్పుడు ఏకంగా పంటసాయం ఇదిగో ఎకరాకు పదివేలు అనేస్తున్నాడు. ఇలా అన్నీ...వీలయితే,ప్రతిపక్షనాయకుడు నిజాయితీగా అందిస్తానన్న నవరత్నాలన్నీ ...కాఫీకొట్టేసి, ఇప్పుడే ప్రజలకు ఇచ్చేస్తాడేమో?! అమరావతి ఇష్యూలో బాబుగారి గ్రాఫిక్స్‌ ..హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌ను మించిపోయాయి. ఇక ప్రజలకు ఎన్నికలముందు అరకొరగా గ్రాఫిక్స్‌చూపించేసి, ఐదేళ్ల గద్దెను కొట్టేస్తే... ఆ తర్వాత అంతా ఆకాశవిహారమే. అనుకున్నప్పుడల్లా...గద్దలా దేన్నయినా తన్నుకుపోవచ్చు. 
బాబూ...పీఆర్‌వో మార్క్‌...ఎన్నికలముందు ప్రజాసంక్షేమం కపటనాటకానికి భ్రమసి, మురిసిపోతే... ఆ తర్వాత పరిస్థితి...మునుపటిలానే...అదేనండి...2014నుంచి 2019 వరకు బాబు పాలనాకాలం పరిస్థితి. 
ఇప్పుడు అందరూ....,దెబ్బతిన్న ఏపీ ప్రజలందరూ...మనందరిప్రభుత్వాన్ని కోరుకోవాలి. ఏ కొందరికో పరిమితమయ్యే ఏసీలను మరిచి, అందరికీ అందుబాటులో ఉండే ఫ్యానుగురించి ఆలోచించాలి. అవునుమరి, ఆలోచించాలి...మనకోసం, ప్రజలందరి మంచి కోసం. మంచి మార్పు కోసం!! ఏపీలో మార్పురావాలి. విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేసే రాజకీయాలే నడవాలి...................
మనకు కావాల్సింది పీఆర్‌వోలు కాదు...ప్రజాసంక్షేమం గురించి తపించే మనుషులు. ప్రజానాయకులు.

 

Back to Top