ప్రతిపక్ష నేతకు కూడా రక్షణ లేనంత దిగువకు ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి. పటిష్ట భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగే వరకు పరిస్థితులు దిగజారడం ఒక ఎత్తయితే... విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాల్సిన పోలీసు యంత్రాంగం అధికార టీడీపీకి వత్తాసు పలకేలా కేసును నీరు గార్చేలా వ్యవహరించడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంఘటనలో నిజానిజాలను నిగ్గు తేల్చి సర్కారుపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా చూడాల్సిన ముఖ్యమంత్రి.. సాక్షాత్తు తానే రంగంలోకి దిగి కేసును పక్కదారి పట్టించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతిపక్ష మీద దాడి జరిగి రెండు నెలలు గడిచినా కేసులో పురోగతి లేకపోగా.. చంద్రబాబు కనుసన్నల్లో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. పోలీసుల సహకారంతో నిజాన్ని సమాధి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడిని చిన్న పిల్లల వ్యవహారంగా అనుకూల మీడియాలో ప్రసారం చేయించి వ్యవహారాన్ని కనుమరుగు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం గురించి నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెప్పిన వివరాలు వాస్తవాలను మరుగున పడేశాలా రచించిన పథకంలాగా చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. టీడీపీ నాయకుల మాటలను, ఆరోపణలను కమిషనర్ ద్వారా చెప్పించి నమ్మించాలనే ప్రయత్నం అనేది సుస్పష్టం. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేత మీద దాడి జరిగినప్పుడు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసింది. నిజానిజాలను విశ్లేషించకుండా.. ఆధారాలు లేకుండా జగనే స్వయంగా తనపై దాడి చేయించకున్నాడని ముఖ్యమంత్రి చెప్పడం అనుమానాలకు కారణమైంది. పైగా ఆ క్షణం నుంచి టీడీపీ నాయకులు కూడా బాబు మాటలకు తాళం వేస్తూ.. ఆయన మాటలనే వల్లె వస్తుండటం చూసి కేసును నీరుగార్చబోతున్నారని ప్రజలంతా అవగాహనకు వచ్చారు. అందుకే వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కేసును కేంద్ర దర్యాప్తు బృందానికి అప్పగించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అదలా ఉంచితే ఇప్పుడు కమిషనర్ చెప్పిన వివరాలు అనుమానాలను నిజం చేస్తున్నాయి. దాడి జరిగినప్పుడు పోలీసులు స్పందించిన తీరు, హత్యాయత్నం జరిగిన విధానం, ఆ తదనంతర పరిణామాలు చూసి నిపుణుల నుంచి చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటిని ఏవీ నివృత్తి చేయకుండా కేవలం వారు చెప్పాలనుకున్న వివరాలను మాత్రం చెప్పేసి అనుమానితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని స్పష్టమైంది. వీటికి బదులేదీ...? – ప్రతిపక్ష నేత మీద దాడి జరిగినప్పుడు నిందితుడు శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్ల గురించి మాట్లాడిన పోలీసులు తాజా ప్రెస్ మీట్‌లో వాటి వివరాలు ఎందుకు వెల్లడించలేదు. – హత్యాయత్నంకు ముందు నిందితుడు శ్రీనివాస్.. పొలాలు కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలొచ్చాయి. దానికి సంబంధించి కొంత అడ్వాన్సులు కూడా ఇచ్చాడని ప్రచారం జరిగింది. దానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. – నిందితుడు శ్రీనివాస్.. జగన్ అభిమాని అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కమిషనర్ మాత్రం ప్రచారం కోసం హత్యాయత్నం చేశాడంటున్నారు. పబ్లిసిటీ కోసం చేసి ఉంటే.. ముందుగానే అవయవదానం కోసం ఎందుకు అప్లై చేసి ఉంటాడు. నాకు ప్రాణాపాయం ఉందని మీడియా కనపడగానే ఎందుకు అరిచినట్టు. పబ్లిసిటీ కోసమే అయితే మీడియాతో చెప్పి ఉండేవాడే కదా.. – నిందితుడు శ్రీనివాస్ కుటుంబం టీడీపీ వారని ఊరంతా చెబుతున్నారు. కానీ శ్రీనివాస్ మాత్రం జగన్ అభిమాని అని చెబుతున్నారు. ఎప్పట్నుంచో లేనిది ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరకముందు నుంచే ఫ్లెక్సీ ఎందుకు వేయించినట్టు.. – ఫ్యూజన్ ఫుడ్స్ యజమానిని ఏ కోణంలో విచారించారో మీడియాకు కమిషనర్ వివరించనేలేదు. – సీసీ టీవీ ఫుటేజీలు ఎప్పట్నుంచి లేవో.. ఎందుకు లేవో కూడా కమిషనర్ చెప్పలేదు. – కమిషనర్ తాజా ప్రెస్ మీట్‌లో శ్రీనివాస్ గతంలో కుక్‌గా, వెల్డర్‌గా చేశాడని చెబుతున్నారు. ఎక్కడ చేశాడో చెప్పనేలేదు. రెండు నెలలుగా లేని కొత్త విషయం తాజాగా బయటపడిందా. – శ్రీనివాస్ ఖరీదైన ఫోన్ వాడుతున్నట్టు చెబుతున్నారు. ఊర్లో పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు.. దీనంతటికీ డబ్బెకడిది. – శ్రీనివాస్ ఫోన్ కాల్ డేటా ప్రస్తావన ఎక్కడా కమిషనర్ ఎందుకు చేయలేదు.