కర్నాటక మీడియా-చంద్రబాబుకు చుక్కలు

అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పడం అంటే బాబుకి మా చెడ్డ చిరాకనుకోండి. ఏదో అనుకుంటాం గానీ... మాటిమాటీకీ రూటు మార్చే మనుషులకు అదెంత కష్టమైన పనో మాటల్లో చెప్పలేం.  బాబుగారు కర్ణాటక ప్రచారానికి వెళ్లారు. అక్కడ చేతులూపడం అయిపోయిన తర్వాత ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఆ వెంటనే తనదైన శైలిలో  నీతులు మొదలుపెట్టారు. అక్కడున్న మీడియా అంతా నివ్వెరపోకుండా అలాగే తెలిసిన విషయమే కదా అన్నట్లు చూస్తూ ఉండిపోయింది. అయినాసరే వాళ్లలో ఉన్న జర్నలిస్టులు ప్రశ్నించకుండా ఉండలేకపోయారు.

ఇంతకీ బాబు ఏమన్నారో తెలుసా..! మోడీ అబద్ధాలకోరు, చెప్పిన ఒక్క హామీ నెరవేర్చలేదు. అతను దేశానికి ఎంతో నష్టం చేశాడు అని. ఆ మాటలు వినగానే కొంతమంది కొత్త తరం జర్నలిస్టులకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే బాబు గత ఐదేళ్లలో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకి బాగా తెలుసు. ఇదేంటి? ఈయన మోదీని పొగిడిన పొగడ్త పొగడకుండా పొగిడాడు కదా! ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడా అని బిత్తరపోయారు. ఇక బాబుగారు తన దండకం మొత్తం చదవడం మొదలుపెట్టారు. అదికాస్తా సెన్‌ఫోన్‌ కనెపెట్టిన విషయం వరకు వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్నారు సీనియర్ జర్నలిస్టులు. అప్పుడు మొదలైంది బాబు మీద ప్రశ్నల పరంపర.

అయితే మాత్రం..! నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టే ఉంటుంది కదా మన నిప్పుగారి తీరు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా, ప్రిపేర్‌ కాని వాడు క్వశ్చన్‌ పేపర్‌ మొత్తం తిప్పి రాసినట్టు తనకు నచ్చింది చెప్పుకుంటూ తప్పించుకుంటూ పోయాడు బాబు. ఇంతలో మరొక జర్నలిస్టుకి వళ్లుమండి, అదేంటండీ మోడీని అలా అంటారు... మీరే కదా ఆయన్ను దేశం చేసుకున్నగొప్ప అదృష్టం అన్నారు, ఇప్పుడిలా తిడుతున్నారేంటి? అని కడిగేసే ప్రయత్నం చేశాడు. దానికి బాబు యథాగా వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌... అని మొదలుపెట్టాడు. అందరూ లేచి నీళ్ల బాటిల్ ఖాళీ చేస్తూ అక్కడినుంచి చిత్తగించారు. వెనక బెంచీలో కూర్చున్న ఒక వ్యక్తి మాత్రం సీరియస్‌గా నోట్‌ రాసుకుంటున్నాడు. ఆ వార్త ఇలా సాగిపోతుంది.. ''కర్నాటకలో చంద్రబాబు సమాధానాలకు చెమటలు కక్కిన పాత్రికేయులు. సూటిగా కుండ బద్దలు కొట్టిన బాబు...'' ఇలా. హౌ ఎల్లో కాదు కాదు.. హౌ సిల్లీ ఇట్‌ ఈజ్‌!
 

Back to Top