జగన్ బాటలో యువ నాయకులు

పరిపాలన అంటే కేవలం అధికారులతో పని చేయించడం మాత్రమే కాదు. స్వయంగా జావాబుదారీగా ఉండటం. ప్రజల క్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండటం. బాధ్యతగా మెలగడం. ఇవన్నీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి తన పరిపాలనలో భాగంగా ఆచరించి చూపిస్తున్నారు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం, సమీక్షించడం, అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకోవడం, దూరద్రుష్టితో ఆలోచించడం, అవసరమైన చర్యలను ఆలస్యం చేయకుండా ఆదేశించడం, పొరపాట్లు జరిగితే బాధ్యత తీసుకోవడం, విజయాలను అందరి సహకారంతో అని వినమ్రంగా ఒప్పుకోవడం లాంటి లక్షణాలతో తోటి యువనాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు యంగ్ సీఎం. 
నాయకులు కాదు సేవకులుగా
ఆయన బాటలోనే కొందరు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు నడుస్తున్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్వయంగా తానే ఒక వీడియో చేసి ప్రచారం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తులు మరణిస్తే ఆ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉన్న మలుపులు, కల్వర్టులు, వంతెనలు, రోడ్లు రిపేర్ జరిగే ప్రాంతాలు, క్రాసింగ్ ల వంటి ప్రదేశాలేవైనా ప్రజల ద్రుష్టికి వస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయమంటూ ఆమె విజ్ఒప్తి చేసారు. అలాంటి ప్రదేశాలపై తక్షణమే సురక్షితమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. రవాణా అధికారుల బాధ్యతతో పాటు ప్రజలూ సహకరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అనే సందేశాన్ని పోస్టు చేసారీ మహిళా ఎమ్మెల్యే. తనకు సంబంధించిన శాఖ కాకపోయినా ప్రజా ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే తనకు తానుగా చేసిన ఈ పనిని ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.
మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి నియోజకవర్గంలో పర్యటించే సమయంలో వీధి స్తంభాల నుంచి మెయిన్ వైర్లు కిందకు ఉండటాన్ని గమనించి సంబంధిత అధికారులను పిలిచి అప్పటికప్పుడే సమస్య పరిష్కరించేలా చేసారు. ప్రమాదానికి కారమయ్యే అవకాశం ఉండటంతో తక్షణం స్పందించి అధికారులు చర్యలు తీసుకున్నారు. నాయకుడు నిబద్ధత కలవాడైతే ఉద్యోగులు పని తీరు కూడా మెరుగుపడుతుందనడానికి ఇంకంటే సాక్ష్యం ఏం కావాలి. ప్రమాదాలు జరిగాక చింతించడం కాదు ముందే జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సంబంధిత అధికారులను మందలించారు. 
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా నియోజకవర్గ సమస్యలను తీర్చడంలో ముందుంటారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో డ్రైనేజీ సమస్యను పట్టించుకోని అధికారులపై మురుగు కాల్వలో రోజంతా నిలబడి తన నిరసనను తెలిపారు. అధికారులు కదలి వచ్చి డ్రైనేజీ సమస్యను పరిష్కరించేదాకా తన పట్టు వదల్లేదు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూడా ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటుంటారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తూ కట్టిన భారీ ఫ్లెక్సీలు కనిపించాయి. గాలికి అవి కిందకు పడితే ప్రమాదమని భావించిన ఆయన స్వయంగా వాటిని తొలగిస్తూ, కార్యకర్తలను, అధికారులను కూడా వాటిని తొలగించమని సూచించారు. దేవాలయాలు, మసీదులు, చర్చి ప్రాంగణాల్లో రాజకీయాలకు తావు ఉండకూడదని కూడా అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అనుమతి లేకుండా ఉంచిన ఫెక్సీలు తీసేసినందుకు అధికారులను తాట తీస్తా అని బెదిరించిన గజపతి నగరం టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు లాంటి ఎందరో అధికారపార్టీ నేతల్లా కాకుండా సామాన్యుల గురించి ఆలోచించే కోటం రెడ్డి గారి సంస్కారాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. 
ఇక గుడివాడలో కొడాలి నాని, మచిలీపట్నంలో పేర్ని నాని సామాన్యులను ఆగి పలకరించి సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. శాసనసభ్యులైనప్పటికీ సెక్యూరిటీ లేకుండా జనంలో ఒకరిగా కనిపిస్తారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ప్రజా సేవకులం అని తెలియజేస్తుంటారు. 
ఇటీవలే జరిగిన దేవీపట్నం బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై కూడా ప్రజల్లో సానుకూల భావం ఏర్పడింది. ప్రమాదం జరిగిన మరునాడే ముఖ్యమంత్రి స్వయంగా ప్రమాద స్థలికి వచ్చి, బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్టపరిహారంలో కొంత భాగం వెంటనే బాధితులకు అందజేసారు. ప్రమాదంలో మరణించిన వారి బంధువులను కలిసి విషయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితిని గురించి స్వయంగా వెళ్లి ఆరాతీసారు. అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలను సమీక్ష చేసారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిది బోటు యజమానులైనా, అధికారులైనా బాధ్యత మనందరిదీ అన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే అధికారుల నెత్తిన రుద్దడం చేయకుండా జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తున్నానన్న యువ ముఖ్యమంత్రిని చూసి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోయారు. 
మార్పు మంచి వైపు
అధికారులు, నాయకులు ప్రజలతో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో  పదే పదే తెలియజేస్తున్నారు సీఎం వైయస్ జగన్. ప్రేమగా పలకరించడం నుంచి, స్నేహభావంతో వారి సమస్యలను వినడం, సహ్రుదయంతో అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయడం అవసరం అని ప్రతి సమీక్షలోనూ వివరిస్తున్నారు. ప్రజలకు మనం నాయకులుగా కాదు సేవకులుగా పనిచేయాలంటూ సీఎం చెప్పడం, అదే బాటలో నేతలు ప్రజలతో మమేకమవ్వడం ప్రజలకు ఆనందాన్నిస్తోంది. ఒకప్పుడు సమస్యలు చెప్పుకోను వస్తే ప్రభుత్వ ఆఫీసుల్లో, నాయకుల దగ్గర ఎలాంటి అనుభవాలు ఎదురయ్యేవో తలుచుకుని, నేటి పరిస్థితితో పోల్చీ చూసుకుంటున్నారు రాష్ట్ర ప్రజానీకం. 
 

Back to Top