వైయ‌స్ జ‌గ‌న్ అనే నేను..

సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
 
2019లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం

అదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైయ‌స్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన

ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి దన్నుగా నిలిచిన జనం

గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైయ‌స్ఆర్‌సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు

 అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైయ‌స్‌ జగన్‌ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. 

వైయ‌స్ఆర్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైయ‌స్‌ జగన్‌  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.  

సువర్ణాక్షరాలతో లిఖించేలా   
గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్‌ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. 

దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.

మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..
ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం వైయ‌స్‌ జగన్‌.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్‌ గుర్తుపై రెండు బట­న్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. 

సీఎం వైయ‌స్ జగన్‌ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైయ‌స్ఆర్‌సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు.   

Back to Top