చిత్తూరు: చంద్రబాబునాయుడు పుట్టిన ఊరు ఉన్న చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు గుండాగిరి చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఏడు గ్రామాలలో వాస్తవంగా జరుగుతున్నది తెలిస్తే రీపోలింగ్ జరపడం కాదు ప్రభుత్వాన్నేబర్తరఫ్ చేయాల్సి ఉంటుంది. పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏడు గ్రామాలలోని దళితులు ఇప్పటికీ ఓటు హక్కు పొందలేకపోయారు- ఈ ఒక్క వాక్యం చాలు అక్కడ ఏం జరుగుతున్నదో చెప్పడానికి. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నది రాజకీయ పోరాటం కాదు. అక్కడి దళితుల బతుకుపోరాటం, జీవించాలనే ఆరాటం, ప్రాథమిక హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం అది. రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయిన ఎన్ ఆర్ కమ్మపల్లి, వెంకటరామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, పులవర్తివారి పల్లి తో బాటు రావిళ్లవారిపల్లి, మంగిలిపట్టు గ్రామాలలో కూడా రీపోలింగ్ జరిపించాలి లెక్కప్రకారం. అయితే ఎందుకో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలోకి అవి రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా? 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ గ్రామాలలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా? ఇది చూడండి ఎన్.ఆర్.కమ్మపల్లి – మొత్తం ఓట్లు 626. టిడిపికి 624, వైసిపికి 2 ఓట్లు మొత్తం 13 మంది అభ్యర్ధులకు సున్నా. వెంకట రామాపురం లో మొత్తం ఓట్లు 320 అందులో టిడిపికి 316 వైయస్ఆర్‌సీపీ ఒక్క ఓటు వచ్చింది. రావిళ్లవారిపల్లి (రీపోలింగ్ జరగడం లేదు) మొత్తం ఓట్లు 508. తెలుగుదేశానికి వచ్చింది ఎన్నో తెలుసా? 508. కొత్త కండ్రిగలో మొత్తం ఓట్లు 859 కాగా టిడిపికి 812 వచ్చాయి. కమ్మపల్లిలో 931 ఓట్లు ఉండగా టిడిపికి 771 ఓట్లు వచ్చాయి. పులవర్తివారి పల్లిలో 716 ఓట్లు ఉంటే అందులో 499 టిడిపికి వచ్చాయి. ఇవన్నీ వేస్తే వచ్చినవి అయితే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అన్నీ గుద్దుకున్నవే! అక్కడి దళితుల పరిస్థితి దారుణం!! ఓట్ల అంశం కాబట్టి రాజకీయం అనుకుంటారు కానీ ఈ గ్రామాలలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే దళితుల పిల్లలు స్కూలుకు వెళ్ల కూడదు. వెళ్లినా అక్కడి టాయిలెట్లు వాడకూడదు. తెలిసోతెలియకో అవసరార్ధమో టాయిలెట్లు వాడితే వాటర్ పైప్ లైన్లు కోసేస్తారు. దళితుల స్మశానం ఒక సామాజిక వర్గం వారి పొలాల ఆవల ఉంటుంది. దళితుల శవాలను తీసుకెళ్లాలంటే వారి పర్మిషన్ అవసరం. వారు అనుమతించకపోతే ఆ దళిత శవానికి అంత్యక్రియలు కూడా జరగవు. ఇదంతా చదువుతుంటే 1979లో వచ్చిన మాభూమి సినిమా గుర్తుకు వస్తున్నదా? ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూపించిన దానికన్నా దారుణాలు అక్కడ జరుగుతున్నాయి. చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నోటి మాటగా ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యంతో చెబితే కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది అని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంత దారుణమైన ఆరోపణో వారికి కూడా తెలుసు. ఎంతో కాలం నుంచి వేలాది ఫిర్యాదులు ఆ గ్రామాల నుంచి వెళ్లాయి. వందలాది మంది తమకు కోటు హక్కు ఇవ్వమని కోరుతూనే ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు ఆ గ్రామస్తుల కోరికలు సమంజసమైనవేనని నివేదికలు ఇచ్చారు. అయినా ఏమీ జరగలేదు. న్యాయం చేద్దామనుకున్న అధికారులపై బదిలీవేట్లు ఇదంతా తెలుగుదేశంనాయకులకు తెలుసు. ఎందుకంటే అక్కడి దళితులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన ఆర్డీవోను బదిలీ చేయించింది వారే కాబట్టి. జిల్లా ఉన్నతాధికారులు ఏవైనా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించగానే వారికి బదిలీ ఆర్డర్లు సిద్ధమైపోతాయి. పోలింగ్ జరిగిన తర్వాత 32 రోజులకు రీపోలింగ్‌కు ఆర్డర్ ఇస్తారా? ఇదెక్కడైనా జరిగిందా? అని చంద్రబాబునాయుడు ఎంతో అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రీపోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వడానికి 32 రోజులు ఎందుకు పట్టిందో ఆయనకూ తెలుసు. ఈ ఏడు గ్రామాలలో తమకు వేరే పోలింగ్ బూత్ పెట్టాలని చాలా సంవత్సరాలుగా అక్కడి దళితులు కోరుతున్నారు. ఒక తాసిల్దార్ పూర్తిగా విచారణ జరిపి ఐదు గ్రామాలలో వేరే పోలింగ్ బూత్‌లు పెట్టాలని సిఫార్సు చేశారు. అంతే వారం రోజుల్లో ఆమెను బదిలీ చేశారు తప్ప వేరే పోలింగ్ బూత్‌లు పెట్టలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఓట్ల నమోదు సందర్భంగా అక్కడకు వచ్చి పరిస్థితి చూసి వేరే పోలింగ్ బూత్‌లు పెట్టాలని సిఫార్సు చేశారు. పది రోజుల్లో అతను ట్రాన్సఫర్ అయ్యాడు. సిసోడియా ఏపి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు విచారణ జరిపించారు. దళితులను అక్కడ ఓట్లు వేయనివ్వడంలేదని తేలింది. ఎస్‌సి, ఎస్‌టి హక్కుల సంఘం కూడా చెప్పింది కేంద్రం నుంచి ఎస్‌సి ఎస్‌టి హక్కుల సంఘం వచ్చింది. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో ఇచ్చింది. మళ్లీ విచారణ. చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా? అన్ని పోలింగ్ బూత్‌లు పెట్టడం సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ టాయిలెట్ సౌకర్యం లేదు- అని రిపోర్టులు పంపిన అధికారులు చిత్తూరు జిల్లాలో ఉన్నారు. ఇక దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? గత ఎనిమిది నెలలుగా ఫిర్యాదుల, విచారణలు, నివేదికలు…. గడుస్తూనే ఉంది పోలింగ్ తేదీ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వల్ల న్యాయం జరగదని ఆలోచించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడు పోలింగ్ కేంద్రాలను అతి సున్నిత కేంద్రాలుగా నోటిఫై చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించాలని నేరుగా ఆదేశాలు ఇచ్చింది. వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒకరిద్దరు పోలీసులను మించి పెట్టలేదు. ఒక మహిళా అభ్యర్ధిని దారుణంగా కొట్టారు!! పోలింగ్ రోజు ఒక మహిళా అభ్యర్ధిని రావిళ్లవారిపల్లిలో బట్టలు ఊడదీసి కొట్టిన సంఘటన జరిగింది. మాఫియాగా మారిన మీడియాలో ఇవేవీ రావు. పోలింగ్ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి నిన్న మొన్నటి వరకూ వైయస్ఆర్‌సీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపుతూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని వెబ్ కాస్టింగ్ ఆధారంగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. దాంతో జిల్లా అధికారులు రంగంలో దిగి అంతా సక్రమంగానే ఉంది అని రిపోర్టు ఇచ్చారు. అనుమానం వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి అధికారులను నివేదిక కోరింది. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత వెబ్‌కాస్టింగ్ పై రిపోర్టును, గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పరిశీలించింది. అన్నింటిని కూలంకషంగా చూసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా చెప్పకుండా నేరుగా రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అందుకోసం 32 రోజులు పట్టింది తప్ప ఇదేదో కావాలని చేసింది కాదు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది!! ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఇంత జరిగినా అన్నీ తెలిసినా తెలుగుదేశం నాయకులు ఎలా బుకాయిస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఇవన్నీ తెలిసి కూడా ఊరుకొని ఉంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించి ఉండేవారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి సోదరులారా ఇది ఒక సామాజిక వర్గపు పైశాచికత్వంపై దళితులు చేస్తున్న పోరాటం తప్ప రాజకీయం కాదు.