ఆదివాసీలకు రూ.300 కోట్ల విలువైన వరాలు

నేడు ఆదివాసీ దినోత్సవం  

రూ.100 కోట్ల విలువైన యూనిట్ల పంపిణీ

రూ.44 కోట్లతో నిర్మించిన 27 పాఠశాల భవనాలు ప్రారంభం

ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.4,988 కోట్లు 

గిరిజన సంక్షేమ శాఖకు రూ.2,153 కోట్లు

అమరావతి : ఆదివాసీలకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. శుక్రవారం ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా రూ.300 కోట్ల విలువైన వరాలను ప్రకటించబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో రూ.100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేయనుంది. ప్రధానంగా అరకు లోయలో నిర్వహించే రాష్ట్రస్థాయి సభలో పలువురికి సాయాన్ని అందిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ తదితర 27 స్కూల్‌ భవనాలను ఆదివాసీ దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. అధునాతన సౌకర్యాలు గల వీటిని రూ.44 కోట్లతో నిర్మించారు.

మరోవైపు రూ.15 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలు, ఇతర సామగ్రిని కాఫీ తోటలు పెంచుతున్న రైతులకు అరకు, పాడేరు ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల్లో కాఫీ తోటలు పండిస్తున్న గిరిజనులకు కూడా రూ.10 కోట్లను కేటాయించారు. ఈ మొత్తాలను వారికి చెక్కుల రూపంలో అందజేస్తారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో రూ.16 కోట్లతో ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పర్యవేక్షణ లేక పాడైన ప్లాంట్లకు మరమ్మతులు చేపడతారు.
 
మరిన్ని సదుపాయాలు 
గిరిజనులు సేకరించే ఫలాలు, పండించే పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా సంతలు నిర్వహించే ప్రాంతాల్లో గోడౌన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.19.97 కోట్లతో చేపట్టే ఈ పనులకు ఆదివాసీ దినోత్సవం రోజున శంకుస్థాపన చేస్తారు. గిరిజన సంతల్లో ప్లాట్‌ఫారాల నిర్మాణం కూడా చేపడతారు. మరోవైపు గిరిజన గూడేల్లో ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ‘గిరి సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రపంచ బ్యాంక్‌ రూ.60 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతానికి 200 గ్రామ సచివాలయాల్లో వీటిని నిర్మించేందుకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఒక్కోసేవా కేంద్రం నిర్మాణానికి రూ.30 లక్షల చొప్పున సర్కారు ఖర్చు చేస్తోంది. ఇదిలావుంటే.. ఆదివాసీ పిల్లలకు హక్కుల్ని తెలియజేయటం, ఆదివాసీల పూర్తి డేటా సేకరించడం, వివిధ శాఖలతో సమన్వయం ద్వారా సౌకర్యాల కల్పనకు అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూ.25 కోట్లు వెచ్చించనుంది. 

70 రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 
వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తరువాత 70 రోజుల్లో ఆదివాసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. 12,293 మంది గిరిజనులకు వార్డు, పంచాయతీ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే 23,970 మందిని వలంటీర్లుగా నియమించారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద 2019–20 సంవత్సరానికి రూ.4,988 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2018–19తో పోలిస్తే రూ. 811 కోట్లు ఎక్కువ నిధులు ఇచ్చింది. గిరిజన సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.2,153 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సర బడ్జెట్‌ కంటే రూ.24 కోట్లు ఎక్కువ. నవరత్నాలలో భాగంగా పోస్టు మెట్రిక్‌ చదువుకుంటున్న 66 వేల మంది గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల వంతున రూ.132.11 కోట్లు కేటాయించింది.

వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద గిరిజన వధువుకు ఇచ్చే సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఇందుకోసం ఈ ఏడాది రూ.53 కోట్లు కేటాయించింది. గిరిజన కుటుంబాలకు గతంలో 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వగా, ప్రస్తుతం 200 యూనిట్లకు పెంచింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.139 కోట్లు కేటాయించింది. దీనివల్ల 4.78 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. గిరిజనుల కోసం పాడేరులో మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.66 కోట్లు మంజూరు చేసింది. విజయనగరంలో తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తూ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందుకోసం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గిరిజనుల్లో ఎవరైనా ప్రమాద వశాత్తు మరణిస్తే వైఎస్సార్‌ ప్రమాద బీమా కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గిరిజన రైతుల కోసం వ్యవసాయ బోర్లు వేసేందుకు రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 

ఆదివాసీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి 
అరకు లోయలో శుక్రవారం నిర్వహించే రాష్ట్రస్థాయి ఆదివాసీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించే ఉత్సవాలకు రూ.75 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గిరిజనుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పించనున్నారు.

Back to Top