అమరజీవి త్యాగాలను వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది

మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి 

విజయవాడ : అమరజీవి  పొట్టి శ్రీ‌రాములు 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.  విజ‌య‌వాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు, భాషా ప్రయుక్త రాష్ట్రం దక్కాలన్న ఆయన మహోన్నత సంకల్పం వల్లే నేడు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామని గుర్తు చేశారు. గాంధేయవాదిగా ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, ఎస్సీలకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

అమరజీవి త్యాగాలను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. అలాగే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను ఆహ్వానించి గౌరవించిన ఘనత కూడా వైయ‌స్ జగన్‌కే దక్కుతుందని తెలిపారు.

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, పొట్టి శ్రీరాములు స్మృతికి గానీ, రాష్ట్ర అవతరణకు గానీ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. 2014–19 మధ్య కాలంలో ఒక్కసారి కూడా అధికారికంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించలేదని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో ప్రజల కోరిక మేరకు నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన వైయ‌స్ జగన్, అధికారంలోకి రాగానే దానిని అమలు చేశారని ఆయన స్పష్టం చేశారు.

Back to Top