దుష్ప్రచారాలు జయకేతనాన్ని అడ్డుకోలేవు

 
పుత్రోత్సాహము తండ్రికి/ పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా/ పుత్రుని గనుగొని పొగడగ/ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు. తండ్రికి నిజమైన పుత్రో త్సాహం కొడుకు పుట్టినప్పుడు లభించదనీ, ఆ కుమారుడిని అందరూ పొగుడుతున్నప్పుడు కలుగుతుందనీ దీని భావం. ఇవాళ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే తాను కన్న కలలను సార్థకం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాలన చూసి ఎంత ఆనందించే వారో అన్న అభిప్రాయం కలుగు తోంది. 

ప్రొఫెసర్‌ అని నన్ను ఆప్యాయంగా పలకరించే వైఎస్‌ కళ్లలో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే తొణికిస లాడేది. ఆయన ప్రారంభించిన ప్రతి పథకమూ ప్రజల కోసమే. ఇవాళ ఆయన బాటలో ప్రవేశించి తనదైన బాటను ఏర్పర్చుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకున్న జగన్‌ రానున్న ఎన్నికల్లో అంత కంటే ఎక్కువగా ప్రజాబలాన్ని సాధిస్తారని ఆత్మ విశ్వా సంతో చెప్పవచ్చు.

జగన్‌ విద్యాధికుడైనందువల్లే విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రజలకు విద్య, వైద్యం చేరువ అయితే... వారు తమంతట తాము అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయం. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’, ‘గోరుముద్ద’, ‘విద్యాకానుక’, ‘నాడు–నేడు’ వంటి రకరకాల పేర్లతో విద్యాభివృద్ధికి పథకాలు చేపట్టారు. బడుగు–బలహీన వర్గాల ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు.

ఇక వైద్యం విషయానికి వస్తే... వైఎస్‌ హయాంలో మొదలైన ‘ఆరోగ్యశ్రీ’ని జగన్‌ ప్రభుత్వం మరింత వినూ త్నంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేయడమే కాదు, కరోనాతో సహా 2,446 ప్రొసీజర్స్‌ను ఆ పథకం కింద చేర్చారు.

అలాగే ఇవాళ ఏపీలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్నంత అండదండలు మరే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పెట్టుబడి సాయం, భరోసా కేంద్రాలు, పొలాల్లోనే పంటల కొను గోలు, పంటల బీమా, సరళమైన రిజిస్ట్రేషన్లు, ఉపకరణాల సబ్సిడీ వంటివి జగన్‌ మనసులో  రైతుకున్న అభిమానానికి సంకేతం.

రైతులే కాదు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు; ఆటో, టాక్సీడ్రైవర్లు; డ్వాక్రా మహిళలు... ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి ఏదో రకంగా నగదు రూపంలో లబ్ధి లభించేలా జగన్‌ చర్యలు తీసుకోవడం అపూర్వం. ఎక్కడా దళారులు తమ బొక్క సాలు నింపుకోకుండా కేవలం మీట నొక్కడం ద్వారా నిధులు లబ్ధిదారుల ఖాతాలకు చేరడం జగన్‌ ప్రభుత్వ ప్రత్యేకత. ఇవాళ ఇళ్లు లేని పేదలు ఉండకూడదనేదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యం. అందుకే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. పేదలకోసం 17 వేల కాలనీలు నిర్మించారు. 

అధికార వికేంద్రీకరణ ద్వారే ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని భావించినందువల్లే జగన్‌ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. వినూత్నమైన గ్రామసచివాలయాల ద్వారా ప్రజల వద్దకు పాలన చేరుకుంది. అందుకే ప్రజా సంక్షేమ పాలనలో దేశంలో జగన్‌ సర్కార్‌ ప్రథమ స్థానంలో ఉన్నదని స్కాచ్‌ గ్రూప్‌ పరిపాలనా రిపోర్ట్‌ కార్డు వెల్ల డించింది. పోలీసు వ్యవస్థ, భద్రత, వ్యవసాయం, ఇ– గవర్నెన్స్, జిల్లా పరిపాలన నిర్వహణ, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల అమలులో  కూడా  ఏపీ ప్రథమ స్థానంలో నిలి చింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ అద్భుత కృషి చేసిందని నాబార్డ్‌ వార్షిక నివేదిక  విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వార్షికంగా 2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.    

దారుణమేమంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావ డాన్నీ, ఆయన సమర్థవంతంగా పాలించడాన్నీ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడాన్నీ, ప్రజల ఖాతాల్లోకి ఇప్పటివరకూ లక్షన్నర కోట్లకు పైగా డబ్బు బదిలీ కావడాన్నీ ఆయన ప్రత్యర్థులు జీర్ణించు కోలేకపోతున్నారు. వారంతా కుమ్మక్కై, మీడియాలో అధిక భాగాన్ని ఆక్రమించి జగన్‌ సర్కార్‌పై తప్పుడు కథనాలను ప్రతిరోజూ ప్రచారం అయ్యేలా చూస్తున్నారు. అనేక ఇతర రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దారుణంగా ఉన్నదంటూ దుష్ప్రచా రానికి దిగుతున్నారు.

రెండు పత్రికలు, మూడు టీవీ చానల్స్‌తో జనం మనసును జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం సాధ్యం కాదు. అదే సాధ్యమైతే గత ఎన్నికల్లోనూ, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్‌ను జనం ఆదరించేవారు కారు. ఇవాళ జగన్‌ సర్కార్‌ విశ్వసనీయత తెలిసినందువల్లే ఈ అభూత కల్పనను జాతీయ స్థాయిలో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధః జగత్సహోదరులకు– ఇంత వరకూ సామాజికంగా, ఆర్థికంగా, అన్నివిధాల వెలుగుకు నోచుకోని వర్గాలకు జగన్‌ పాలన జగన్మోహనంగా వుంది. జగన్‌ అంటే విశ్వసనీయత, జగన్‌ అంటే చెప్పింది చేయడం, జగన్‌ అంటే జయకేతనం!

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ 
వ్యాసకర్త అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ
(వైయ‌స్ఆర్‌సీపీ ప్లీన‌రీ సందర్భంగా)

Back to Top