ఆ అడుగులకు ఏడాది

వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఏడాది

పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌

సంక్షేమ పథకాల్లో మరో మేలిమి రత్నం ..అమ్మ ఒడికి శ్రీకారం

ప్రతీ సంక్షేమంలోనూ పాదయాత్ర ముద్రలే

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో ఓ చారిత్రక ఘట్టానికి తెరలేపిన ప్రజాసంకల్పయాత్ర.. అసలు సిసలు ప్రజానేత వైయస్‌ జగన్‌ మనో సంకల్పానికి ప్రతీక. పల్లెల్ని చుట్టి, పట్టణాలు దాటి..ఆంధ్రప్రదేశంతా సాగిన ఆ నాయకుడి నడక కోట్లాది ప్రజల గుండె తలుపులు తట్టింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు ఓ యోధుడయ్యాడు. పాదయాత్ర దారెంబడే ప్రజాసమస్యలకు పరిష్కారమార్గాలు కనిపెట్టాడు. మాటిస్తున్నాను.. నెరవేరుస్తాను.. మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతానని హామీ ఇచ్చాడు. ప్రజా నాయకుడిగా జనం మధ్యలో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే నెరవేర్చి చూపించారు. ఒక్క అడుగుతో మొదలై కొట్లాది మంది ధైర్యం వెంటరాగా.. సాగిన ప్రజా నాయకుడి నడక పూర్తయి నేటికి ఏడాది.

2017లో ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్పయాత్ర ఇచ్ఛాపురంలో 09–01–2019న ముగిసింది. సుమారు 14 నెలల పాటు సాగిన పాదయాత్రలో వైయస్‌ జగన్‌ కోట్లాది మంది ప్రజలను కలుసుకొని వారి బాధలను, కష్టాలను కళ్లారా చూశారు. నేను ఉన్నాను.. నాన్నలా అండగా ఉంటాను. నేను విన్నాను.. మీ కష్టాలన్నీ కడతేర్చుతాను.. రాజన్న సుపరిపాలన తీసుకువస్తానని ప్రజలందరి గుండెల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఎముకలు కొరికే చలిలో.. భగభగ మండే ఎండల్లో.. తడిసి ముద్దయ్యే చినుకుల్లో కూడా నడక ఆగలేదు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ముందుకు సాగాడు. ఆ నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద వెక్కించే మాటలు తూలినా.. దేహంలో కత్తిపోటు దిగినా.. పాదయాత్రికుడి గుండెల్లో ధైర్యం కాసింతైనా తగ్గలేదు. ప్రజల కోసం, వారి బతుకులను మార్చడం కోసం కష్టాలు వింటూనే 3648 కిలోమీటర్లు ఇచ్ఛాపురం వరకు నడిచాడు.

పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురంలోని లొద్దపుట్టి దగ్గర ’విజయ సంకల్పం’ పేరుతో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రజా సంకల్పం ముగియడంతో.. జననేతకు అభినందనలు తెలిపేందుకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జననేత నడిచే దారంతా జనంతో కిక్కిరిసిపోయింది. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

2017 నవంబర్‌ 6న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 341 రోజులు పాటు సాగిన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో 2516 గ్రామాల్లో 124 బహిరంగ సభలతో పాటు 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్మించారు. పాదయాత్రలో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. వారి బాధలను విన్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే జీవితాల్లో వెలుగులు తీసుకువస్తానని మాటిచ్చాడు. ప్రజల దీవెన, దేవుడి ఆశీర్వాదంతో 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించారు.. వైయస్‌ జగన్‌.

చెప్పాడంటే..చేస్తాడంతే!
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూపిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. నాడు నేను విన్నాను..నేను ఉన్నానని మాట ఇచ్చారు. అచ్చం అదే చేస్తున్నారు. అభాగ్యులకు అండగా ఉంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్నారు.  ప్రమాణస్వీకారం చేసిన నాడు చెప్పారు.. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. పచ్చపత్రికలు మతం పేరుతో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. ప్రజల కోసం చేపడుతున్న ప్రతి పనిలోనూ తనకున్న క్లారీటీతో ముందుకుసాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఒక్క రోజు వృథా చేయకుండా ప్రజలకు అవసరమయిన ప్రతీది వారి చెంతకు చేర్చాలన్న తాపత్రయం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో పాలనపరమైన అడుగులు వేస్తూ తనకంటూ ఒక కొత్త చరిత్రను సృష్టించుకుంటున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ఈ ఏడు నెలల్లో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాదయాత్ర ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర ముగింపు రోజునే ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టడం మరో అపూర్వ ఘట్టం.

Back to Top