గుంటూరు : ‘యువతకు శ్రీమతి షర్మిల ఓ ఐకాన్... ఇది ఓ చెల్లి సంతోషంతో చేసిన వ్యాఖ్య.’ ‘ఆమెను చూస్తే ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు... ఇది ఓ అవ్వ కనబరచిన ప్రేమ భావన.’ ‘ఆమె విమర్శనాస్త్రాలు ప్రత్యర్థుల గుండెల్లో బాణాలు... ఇది ఓ యువకుడు ఉత్సాహంగా విసిరిన ఈటె.' 'అక్షరాలా ఆమె జగనన్న వదిలిన బాణమే... అందరూ అంటున్న మాట.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి సై అంటూ వంత పాడుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిస్సిగ్గుతనానికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 92వ రోజు గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. ఆమె తండ్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే మండుటెండలను కూడా లెక్కచేయకుండా సుదీర్ఘ, చారిత్రక పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు వెంట నడుస్తుండగా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఎదురుపడిన ప్రతి అవ్వనూ... తాతను... అక్కనూ... చెల్లిని... అన్ననూ... తమ్ముడిని... ప్రేమగా, ఆప్యాయంగా పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ కలివిడిగా సాగిపోతున్నారు. ఆమె సాగిన ప్రతిదారీ జన సంద్రమే అవుతోంది. జగనన్న వస్తాడనీ... రాజన్న రాజ్యం తెస్తాడనీ.. ప్రజలందరి కష్టాలూ తీరుతాయని భరోసా ఇస్తూ శ్రీమతి షర్మిల ముందడుగు వేస్తున్నారు. రాజన్న కూతురుని కళ్ళారా చూసిన ఆనందంలో కొందరు పువ్వలు.. ఇంకొందరు జ్ఞాపికలు అందజేస్తున్నారు. మరికొందరు ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఆభిమానాన్ని... ఆప్యాయతనూ శ్రీమతి షర్మిల అందుకుంటున్నారు.
ఉత్తేజం కలిగిస్తున్న షర్మిల ప్రసంగాలు :శ్రీమతి షర్మిల ప్రసంగాలు పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్నిస్తుంటే, యువతలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. అమ్మా.. బాగున్నావా! అన్నా.. వ్యవసాయం ఎలా ఉంది, కరెంట్ ఎన్ని గంటలు ఉంటోంది, ఎరువుల ధరలు ఎలా ఉన్నాయంటూ శ్రీమతి షర్మిల ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మార్గమధ్యలో కలిసిన విద్యార్థులకు పలు సూచనలు ఇస్తున్నారామె. ఎన్ని కష్టాలు ఎదురైనా మధ్యలో చదువులు ఆపొద్దని, జగనన్న రాజ్యంలో ఫీజు రీయింబర్సుమెంట్ పథకం అమలులోకి వస్తుందని ధైర్యం చెబుతున్నారు. విపక్షాలపై ఆమె చేస్తున్న ప్రసంగాలు తమకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నాయని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలుగుతోందని కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు అంటున్నారు.
అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, టిడిపిల కుట్రలపై శ్రీమతి షర్మిల చేస్తున్న ప్రసంగాలు పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారంనాడు ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లోని బుడంపాడు. నారాకోడూరు, వేజండ్ల గ్రామాల మీదుగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన పాదయాత్రలో ఆమెను కలిసిన వివిధ వర్గాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వేజెండ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
మంచి రోజులు త్వరలోనే వస్తాయి :పొన్నూరు రోడ్‌లోని సంగడిగుంటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస నుంచి షర్మిల పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బుడంపాడుకు ఆమె చేరుకున్నారు. రహదారులకు ఇరువైపులా పంట పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులు ఆమెను కలుసుకున్నారు. రోజంతా పనిచేసినా వంద రూపాయల కూలి రావడం లేదని వారు శ్రీమతి షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని వారికి భరోసా ఇచ్చి ఆమె ముందుకు సాగారు.
మధ్యాహ్నం భోజన విరామం తరువాత నారాకోడూరు వద్ద పొన్నూరు నియోజకవర్గంలో ప్రవేశించిన శ్రీమతి షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆమెను చూసేందుకు పల్లెలకు పల్లెలే కదిలి వచ్చాయి. జన సందోహం మధ్య అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. నారాకోడూరు ఎస్సీకాలనీ వాసులు మేళతాళాలతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.
ఆత్మీయ అతిథిపై ఆప్యాయత :నారాకోడూరు ఎస్సీకాలనీ నుంచి వేజెండ్ల అడ్డరోడ్డు మీదుగా వేజెండ్ల రైల్వే గేటు దాటి గ్రామంలో ప్రవేశించిన శ్రీమతి షర్మిలకు గ్రామ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఊరంతా సెంటరుకు తరలివచ్చింది. ఆత్మీయ అతిథిని ఆప్యాయంగా పలకరించారు. పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ముఖ్యంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోడానికి కాంగ్రెస్, టిడిపిలు పన్నిన కుట్ర గురించి గ్రామస్తులకు అర్ధమయ్యేలా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు, విద్యార్థులు, మహిళలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో అనేక కష్టాలు పడుతున్నారని, గ్రామాలకు వస్తే వారి కష్టాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
చంద్రబాబు చరిత్ర హీనుడయ్యారు :రెండువేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసిన చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా చరిత్ర హీనుడయ్యాడని శ్రీమతి షర్మిల విమర్శించారు. అక్కడి నుంచి యాదవపాలెం, ఎస్సీకాలనీలలోని మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుద్దపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.