కర్నూలు: మహానేత వైయస్ మరణించాక తమకు పావలా వడ్డీ రుణాలు అస్సలు అందడం లేదని పలువురు మహిళలు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల ముందు వాపోయారు. కర్నూలు జిల్లా హెచ్.మురవణి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముందు ఓ మహిళ షర్మిల వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. ఒక పక్కన వడ్డీలేని రుణాలు అందిస్తున్నామంటూ గొప్పగా చెబుతున్న కిరణ్ ప్రభుత్వ హయాంలో భారీగా వడ్డీలు కట్టించుకుని నడ్డి విరుస్తున్నారని ఆమె భోరున విలపించింది. తాము సంఘం ద్వారా 1.5 లక్షలు అప్పు తెచ్చుకుంటే 14 నెలల కాలంలో రూ. 25 వేల వడ్డీ కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పావలా వడ్డీ రుణాలు కూడా తమకు ఇవ్వడం లేదని షర్మిలకు ఫిర్యాదు చేసింది. రాజన్న ఉన్నప్పుడు తమకు ఇలాంటి దుస్థితి రాలేదని చెప్పింది. రాజన్న కాలంలో మాదిరిగా ఈ ప్రభుత్వానికి తమ లాంటి పేదల గోడు వినే పరిస్థితి గాని, సమస్యలను పరిష్కరించే దృష్టి గాని లేదని ఆమె విచారం వ్యక్తం చేసింది.
ఆ మహిళ బాధలు విన్న షర్మిల స్పందిస్తూ, ‘ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటోంది. వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఒక వైపున ఊదరగొడుతోంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలు, అన్నదాతలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు’ అని షర్మిల భరోసా ఇచ్చారు.
అనంతరం షర్మిల రచ్చబండ కార్యక్రమంలో స్థానికులతో ముచ్చటించారు. ఆ సంభాషణ సాగిందిలా..మహిళలు: మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. వచ్చిన వాళ్లకు బిల్లులు ఆగిపోయాయి.షర్మిల: ఈ అవ్వకు ఇల్లు లేదట. మహానేత రాజన్న ఉన్నప్పుడు 40 లక్షల ఇళ్లు కట్టించారు. ఇప్పుడు బిల్లులు ఇవ్వక ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయట. కొత్తగా ఇళ్లు ఇవ్వడం లేదట. జగనన్న సీఎం అయ్యాక ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టిస్తాడు.
వృద్ధురాలు: నాకు పెన్షన్ రాదు. నా భర్తకూ రావడం లేదు.షర్మిల: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 75 పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి. కొత్తగా దరఖాస్తు వస్తే.. పెన్షన్ పొందుతున్నవారిలో ఎవరైనా చనిపోయాకే కొత్తగా మంజూరు చేసేవారు. రాజన్న అయితే అలా కాకుండా అందరికీ ఇచ్చారు. పెన్షన్ సొమ్ము పెంచి ప్రతినెలా రూ. 200 ఇచ్చారు. జగనన్న సీఎం అయ్యాక వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు వెయ్యి పెన్షన్‌గా ఇస్తారు.
మరో వృద్ధురాలు: నాకు ఏడాదిగా పెన్షన్ రావడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వడం లేదు..షర్మిల: ఈ అవ్వకు 90 ఏళ్లు ఉంటాయి. కానీ ఏడాదిగా పెన్షన్ ఇవ్వడంలేదట. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందీ ప్రభుత్వం!
మరో మహిళ: ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా మా గ్రామానికి రాలేదు. కేవలం కాంగ్రెస్సోళ్లకే ఇస్తారు.షర్మిల: పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రాజన్న పేదల పక్షాన నిలబడ్డారు. ఈ ప్రభుత్వం వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ల నాయకుల పక్షాన మాత్రమే నిలబడుతోంది.
మరో మహిళ: మా ఇంటిలో ఐదుగురం ఉన్నా 16 కిలోలే బియ్యం ఇస్తున్నారు.షర్మిల: రాజన్న ఉంటే 30 కిలోలు వచ్చేవి. జగనన్న సీఎం అయ్యాక మీకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 30 కిలోలు ఇస్తారు.
షర్మిల: రుణాలు ఇస్తున్నారా? ఎంత వడ్డీ పడుతోంది?మహిళలు: మాకు పావలా వడ్డీ కింద రుణాలు రావడం లేదు. వడ్డీ రూ.2 నుంచి రూ. 3 వరకూ పడుతోంది. షర్మిల: పైగా ఈ సీఎం వడ్డీ లేని రుణాలు అంటూ చెబుతున్నారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి. జగనన్న సీఎం అయ్యాక వడ్డీ లేని రుణాలు అందుతాయి.
రైతులు: కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎండినా నష్టపరిహారం ఇవ్వడం లేదు.షర్మిల: వైయస్ ఉన్నప్పుడు ఏడు గంటలు ఉచిత కరెంటు ఇచ్చారు. జగనన్న సీఎం అయ్యాక మళ్లీ రైతురాజ్యం వస్తుంది.