నెల్లూరు జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణాస్వర్ణముఖినదికి ఇసుక గండంఇటుకబట్టీల మాటున తడ, శ్రీసీటీకి ట్రాక్టర్లతో అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీకి తెర లేచింది. అధికారం ఉందన్న ధీమాతో పచ్చ తమ్ముళ్లు యథేచ్చగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అక్రమ ఇసుక రవాణాన్ని అరికట్టాల్సిన కొందరు అధికారులు వ్యాపారస్తుల నుంచి ముడుపులు తీసుకొని ఇసుక దందాకి అండగా ఉండడంతో రేయింబవళ్లు నిర్వీరామంగా ట్రాక్టర్లతో స్వర్ణముఖినది నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. జిల్లాలో తాగునీరు, సాగునీటికి జీవనాధారమైన స్వర్ణముఖినదిని కాపాడాల్సిన కొందరు అధికార పార్టీకి చెందిన వ్యాపారులు, ట్రాక్టర్ యజమానులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో స్వర్ణముఖినదికి ఇసుకగండం పొంచి ఉంది.
స్వర్ణముఖి నదే జీవనాధారంజిల్లాలోని పెళ్లకూర మండలంలో ప్రజలకు స్వర్ణముఖి నదే జీవనాధారం. ఈ నది ఇరువైపుల పదివేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందుతుంది. నదికి ఇరువైపుల వ్యవసాయ విద్యుత్ మోటార్లు కింద 10 వేల ఎకరాలకు పైగా వివిద పంటలు సాగు చేస్తున్నారు. స్వర్ణముఖినది ఆధారంతో రెండు పంటలు పండించే అన్నదాతలకు ఇసుక అక్రమ త్రవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దిగువచావలి, ఎగువచావలి, తాళ్వాయిపాడు, పెన్నేపల్లి, పుల్లూరు, చింతపూడి, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు గ్రామాల నుండి ట్రాక్టర్‌లతో రేయింబవళ్లు ఇసుక అక్రమంగా శ్రీసిటీ, తడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానూరు, తాళ్వాయిపాడుపాడు, పెన్నేపల్లి, చావలి, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, ట్రాక్టర్ యజమానులు రేయింబవళ్లు ట్రాక్టర్లతో స్వర్ణముఖినది లోని ఇసుకను అక్రమ రవాణా చేసి 'లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో నిరంతరం సిరులు కురిపిస్తున్న అక్రమ ఇసుక రవాణాపై ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఇటుక బట్టీల మాటున నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి సమీపంలో పెన్నేపల్లి, తాళ్వాయిపాడు గ్రామాల వద్ద ఉన్న ఇటుక బట్టీల వద్ద ఇసుక డంపింగ్ చేసి ట్రాక్టర్లతో రాత్రి వేళ్లల్లో శ్రీసిటీ, తడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.3500 నుండి రూ.4200 వరకు డిమాండ్ ఉండటంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ట్రాక్టర్ యజమానులకు ఇసుక వ్యాపారం వరంగా మారింది. పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, కలవకూరు గ్రామాల నుండి స్వర్ణముఖినదిలోని ఇసుకను ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి, వెంకటగిరి పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పాలచ్చూరుకు చెందిన పలువురు ట్రాక్టర్ యజమానులు స్వర్ణముఖినదిలోని ఇసుకను మేనకూరు సెజ్ పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అధికార పార్టీ వ్యాపారులకు అండగా ఓ మాజీ ఎమ్మెల్యే నిలవడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సైతం నెల మాముళ్లు ముసుగులో అక్రమ రవాణా విషయంలో స్పందిచడం లేదు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరుస్వర్ణముఖినది నుంచి ఇసుక రవాణాలను నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ సెంధిల్‌కుమార్ స్వర్ణముఖినది నుంచి అక్రమ ఇసుక రవాణాని అరికట్టేందుకు నెలబల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసులచే నదీ తీర గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ ఇసుక తరలింపులకు చెక్ పడింది. అయితే గత ఆరు నెలల కిందట చెక్‌పోస్టును ఎత్తివేయడం వలన అక్రమ ఇసుక రవాణా ఊపందుకుంది. ఈక్రమంలోనే తడ, శ్రీసిటీ, మేనకూరు సెజ్ పరిశ్రమలు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, తొట్టంబేడు మండలంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలకు ట్రాక్టర్లతో ఇసుక యధేచ్ఛగా తరలించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులుస్వర్ణముఖినది నుంచి ఇసుక అక్రమ రవాణాపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాని అరికట్టాల్సిన బాధ్యత రెవెన్యూశాఖదే అనీ పోలీసులు, మాది కాదు..పోలీసులే అని రెవెన్యూ యంత్రాంగం ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటున్నారు. పెళ్లకూరు మండల కేంద్రానికి వెళ్లే వివిద శాఖల అధికారులకు చావలి, తాళ్వాయిపాడు, పెన్నేపల్లి గ్రామాల వద్ద ఇసుక లోడుతో వెళుతున్న పలు ట్రాక్టర్లు ఎదురు పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం. జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.