సమైక్య కదంతొక్కిన వైయస్ఆర్‌ కాంగ్రెస్

‌హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కదంతొక్కుతున్నారు. లక్ష్య సాధన కోసం ఎంతటి పోరాటాలు, ప్రాణ త్యాగాలకైనా వెనుకాడబోమని వారు స్పష్టం చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అనేక చోట్ల పార్టీ శ్రేణులు ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు.

ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు, ఆటో, రిక్షా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కదంతొక్కారు. సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ నినాదాలు చేశారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించి  సమైక్యవాదాన్ని ‌ఎలుగెత్తి చాటారు.

పిడుగురాళ్లలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఐలాండ్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మంగళగిరిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్, నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో ఎన్నారై జంక్షన్ నుంచి అంబేద్క‌ర్ సెంట‌ర్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‌ఆర్కే స్వయంగా ఆటో నడిపి నిరసన తెలిపారు. దాదాపు 200 ఆటోలు ,100 బైక్‌లు ప్రదర్శనలో పాల్గొన్నాయి.

పొన్నూరులో  పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకట రమణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఐలాండ్‌సెంటర్ వరకు ఆటోలు,‌ రిక్షాలతో ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట రామిరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ మేరాజోతు హనుమం‌త్ నాయ‌క్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ ‌చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు.

రేపల్లెలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. తరువాత తాలూకా సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడులో పార్టీ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరులో రిక్షాల ర్యాలీ నిర్వహించారు.

వినుకొండలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూఫ్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసా‌ద్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో దీక్ష శిబిరం కొనసాగుతు‌న్నది. నరసరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆటోలు, రిక్షాలతో ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు నగర కన్వీన‌ర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షే‌క్ షౌక‌త్‌ల ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

‌గుంటూరు జిల్లాలో చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం శుక్రవారం 80వ రోజుకు చేరుకుంది. పిడుగురాళ్లలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎపిఎన్జీవోలు మూసివేయించారు. మాచర్లలో కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయించి నిరసన తెలియజేశారు. నరసరావుపేటలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పొన్నూరులో జెఎసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రేపల్లెలో ఎన్జీవోలు చేపట్టిన దీక్షలు 56వ రోజుకు చేరుకున్నాయి. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలే‌ దీక్షలు కొనసాగుతున్నాయి. వేమూరులో కేంద్ర ప్రభుత్వ  కార్యాలయాలు మూతపడ్డాయి. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో రాజకీయ జెఎసి దీక్షా వేదికపై రాష్ట్ర విభజనను నిరసిస్తూ పెదకాకాని శివాలయ పాలక మండలి సభ్యులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అపరిచితుడనే లఘునాటిక ప్రదర్శించారు.

ఏలూరులో సమైక్య ఆటో ర్యాలీ :
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే అడ్డుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌పశ్చిమ గోదావరి జిల్లా శ్రేణులు నినదించాయి. రాష్ట్రం ముక్కలైతే అభివృద్ధి వెనక్కి పోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆటో, మోటార్ సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు.

ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఆటోలు, మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో 300 ఆటోలతో ర్యాలీ చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివా‌స్ ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.‌ పార్టీ నాయకులు మేడిది జాన్సన్, గ్రంధి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం చౌక్‌లోని వైయస్ఆర్‌ కాంగ్రెస్ దీక్షా శిబిరంలో దొంగపిండి సర్పంచ్ తిరుమాని బాలచంద్రరావుతో‌ పాటు 50 మంది గ్రామస్తులు దీక్షలో పాల్గొన్నారు.

చింతలపూడిలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తాజా మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, మరో సమన్వయకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆటో ర్యాలీ జరిగింది. బోసుబొమ్మ సెంటర్‌లో ఆటోల హారం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కొయ్యలగూడెంలో నిర్వహించిన ఆటోల ర్యాలీలో బాలరాజు రిక్షా తొక్కి నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో రిక్షా, ఆటోల ర్యాలీ నిర్వహించారు. గోపి రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పోలీస్ ఐలండ్ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి.

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పార్టీ ‌నాయకుడు విడివాడ రామచంద్రరావు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. తణుకులో రిలే దీక్షలు గురువారం 16వ రోజుకు చేరాయి. గుమ్మంపాడు సర్పంచ్ పెన్మత్స రామరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట నుంచి మలకపల్లి వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు ర్యాలీని ప్రారంభించారు.

కొవ్వూరు మండలంలో మండల కన్వీనర్ ముళ్లపూడి కాశీవిశ్వనా‌థ్ ఆధ్వర్యంలో ఐ.పంగిడి నుంచి ప్రారంభమైన ఆటో ర్యాలీ పలు గ్రామాల్లో సాగింది. పార్టీ నాయకులు ముదునూరి నాగరాజు, సుంకర సత్యనారాయణ పాల్గొన్నారు. కొవ్వూరులో ఆటో ర్యాలీని మోషే‌న్‌రాజు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ కన్వీనర్ మైపాల రాంబాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిమి హరిచరణ్, పేరిచర్ల బోసురాజు, వర్రే శ్రీనివా‌స్ పాల్గొన్నారు.‌

ఆచంట నియోజకవర్గ సమన్వయకర్తలు కండిబోయిన శ్రీనివాస్, మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర మండలాల్లో ఆటో, మోటార్ సైకి‌ల్ ర్యాలీలు జరిగాయి. ఆచంట, పెనుగొండ గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం, నిడమర్రులో నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ చేశారు.‌

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు నిడదవోలు, పెరవలిలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పెరవలిలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పాలకొల్లులో పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి దీక్షలను పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ ప్రారంభించారు. ఉండిలో ఆటో ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సర్రాజు పాల్గొన్నారు. గోపాలపురంలో ఆటోలు, సైకి‌ల్ రిక్షాల ర్యాలీ నిర్వహించారు. దెందులూరు నియోజవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశో‌క్‌గౌడ్, పి.వి. రావు, కొఠారు రామచంద్రరావు దెందులూరు, పెదవేగి మండలాల్లో ఆటో ర్యాలీలు నిర్వహించారు.

తాజా వీడియోలు

Back to Top