షర్మిలకు అడుగడుగునా జనం బ్రహ్మరథం

అనంతపురం, 31 అక్టోబర్‌ 2012 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు అనంతపురం జిల్లా వాసులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. షర్మిలకు మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. ఏ రోజుకారోజు ఉదయం ఆమె బస చేసిన గుడారం నుంచి కాలు బయటపెట్టే సమయానికే ఆ ప్రాంతంలో అభిమానులు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు కిక్కిరిసిపోతున్నారు. గుడారం నుంచి బయటికి వస్తూనే షర్మిల అందరికీ ఆదరంగా అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. చిరునవ్వు చెదరకుండా షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో తనను కలిసిన, తనను చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఆమె మమేకం అవుతున్నారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారి కష్టాలు, కడగండ్లను కళ్ళారా చూస్తున్నారు. జగనన్న సారథ్యంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, మన కష్టాలు తీరిపోతాయని వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 13వ రోజు మంగళవారం రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. జిల్లాలో ఎనిమిదో రోజు షర్మిల మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు.

పీఏబీఆర్ తాగునీటి పథకం పైపులైన్ పక్కనే ఉన్నా తమ కాలనీలో మంచినీటి ఎద్దడి నెలకొందని, మంచినీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నామని పిల్లిగుండ్ల కాలనీ మహిళలు షర్మిల వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన షర్మిల.. జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకే దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైయస్ పిల్లిగుండ్ల కాలనీకి నీళ్ళిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని రాజన్న రాజ్యంలో జగనన్న కార్యరూపం దాల్చేలా చూస్తారని రాప్తాడు బహిరంగ సభలో షర్మిల భరోసా ఇచ్చారు.

Back to Top