'సమైక్యం'పై సడలని పోరు

కడప 23 ఆగస్టు 2013:

ఉద్యమం ఉప్పెనలా మారి  సమైక్యవాదులందరినీ ఏకం చేస్తోంది. ఎవరికి వారే నాయకులై ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదని జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వారు తమ స్వరాన్ని పెంచుతున్నారు. దీంతో రోజురోజుకు ఉద్యమం సమరోత్సాహంతో ముందడుగు వేస్తోంది. వైయస్‌ఆర్  కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతోపాటు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
కడపలో వైయస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు వైయస్ అవినాష్‌ రెడ్డి, అంజాద్‌ బాష, నాగిరెడ్డి దీక్ష ఐదో రోజుకు చేరింది. వీరి దీక్షలకు జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, పార్టీ  నేత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైయస్ కొండారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ పరిసరాలు పోటెత్తాయి.
 
అధికారులు భారీ ర్యాలీని చేపట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్తు  ఉద్యోగులు నగర శివార్లలో రాస్తారోకో చేపట్టడంతో అధికసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు, మదీన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులతో పాటు పలు సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి రావడంతో కలెక్టరేట్ పరిసరాలు జనసందోహంతో నిండిపోయాయి. విద్యార్థులు విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. రోడ్డుపైనే విద్యార్థులు కరాటే ప్రదర్శించారు.  
 
 జమ్మలమడుగులో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు.ఎర్రగుంట్లలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీని నిర్వహించారు. దీనికి టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి సంఘీభావం తెలిపారు.  
శ్రీమతి విజయమ్మ దీక్షకు మద్దతుగా ప్రొద్దుటూరులో రిలే దీక్షలు కొనసాగాయి. పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భారీ ర్యాలీని నిర్వహించారు. నీటి ట్యాంకర్ల యజమానులు భారీ ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
 పులివెందులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో  రిలే దీక్షలు సాగాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రోడ్డుపైనే ప్రజాకోర్టును నిర్వహించారు. నూర్‌భాష్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
 
 రాయచోటిలో సమైక్యవాదులు కదం తొక్కారు. పది వేల మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలు రోడ్లపైకి చేరడంతో రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్ష భగ్నంను నిరసిస్తూ పట్టణంలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నేతృత్వంలో పట్టణంలో బంద్‌ను నిర్వహించారు. రోడ్డుపైనే బైఠాయించారు. రాజకీయ జేఏసీ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.
 
రాజంపేటలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గుర్రంతో ర్యాలీని నిర్వహించారు. జేఏసీ ఉద్యోగుల రిలే దీక్షలు సాగాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, టీడీపీ నేత బ్రహ్మయ్య, కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా రాజంపేటలో రెండో రోజు దీక్షలు కొనసాగాయి.
 
బద్వేలులో రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. పోరుమామిళ్ల, కలసపాడులో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి.
 
కమలాపురంలో రిలే దీక్షలు కొనసాగాయి.  ఉపాధ్యాయులు గ్రామ చావిడి నుంచి సోనియా దిష్టిబొమ్మను ఊరేగించారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. మైదుకూరులో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.

Back to Top