పక్కనే డ్యామున్నా.. కళ్ళల్లో నీళ్ళు..

అనంతపురం:

రెండేళ్ళుగా తమ పంటలకు నీళ్ళివ్వడం లేదని రైతులు షర్మిలకు మొరపెట్టుకున్నారు.  పాదయాత్రలో భాగంగా అరవకూరులో ఆమె నిర్వహించిన రచ్చబండలో వారు పాల్గొని తమ కష్టాలు చెప్పుకున్నారు. ఆ గ్రామానికి చెందిన చిదంబరమ్మ అనే మహిళ ‘అమ్మా.. పీఏబీఆర్ డ్యాం పక్కనే ఉంది. వైఎస్ హయాంలో మా ఊరి చెరువుకు నీళ్లిచ్చినారు. పంటలు బాగా పండించుకున్నాం. రెండేళ్లుగా చెరువుకు నీళ్లు ఇవ్వడం లేదు. బోర్లు అన్నీ ఎండిపోయినాయి. తాగడానికే గుక్కెడు నీళ్లు లేవు. ఇంక పంటలేం పండించుకుంటాం.. ఏం తిని బతుకుతాం’ అంటూ షర్మిల ముందు విలపించింది. సుశీలమ్మ అనే మరో మహిళ మాట్లాడుతూ ‘సేద్యానికి కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వడం లేదు. వేళాపాళా లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నారు. పంటల కథ దేవుడెరుగు.. కనీసం పశువులకు మేత కూడా లేదు.. ఎలా బతికేది’ అంటూ షర్మిల ముందు వాపోయారు.
ఇంతలోనే మరో మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. మా గ్రామానికి ఆమ్‌ఆద్మీ బీమా లేదు.. అభయహస్తం పింఛన్లు  లేవు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే. ఈ ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తోంది. వైయస్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు’ అంటూ షర్మిలకు వివరించారు.
ఫీజులు కట్టలేక చదువు మానేశా..
జయపురం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ విద్యార్థిని మాట్లాడుతూ ‘ఫీజులు కట్టే స్థోమత లేక చదవు మానేశా. వైయస్ ఉండి ఉంటే ఫీజు కట్టేవారు.. నేను చదువుకుని.. మంచి ఉద్యోగం చేసి, మా అమ్మానాన్నలను బాగా చూసుకునేదాన్ని’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. పీఏబీఆర్‌కు వైయస్ పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. వైయస్ తన హయాంలో ఏటా నీటిని విడుదల చేయించారని చెప్పారు. అప్పుడు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేయించడం లేదు. అందుకే ఈ నీటి కష్టాలు.. వైయస్ చేపట్టిన ప్రతి పథకాన్ని ఈ ప్రభుత్వం నీరుగార్చుతోంది. చంద్రబాబు పాలనను ఈ ప్రభుత్వం తలపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ రెండూ రెండే.. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యంలో అందరికీ మేలు చేసే పాలన వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు.

Back to Top