కృష్ణమ్మ చెంతకు ప్రజాసంకల్పం


నిన్నటిదాకా ఒక లెక్క...నేటి నుంచీ ఒక లెక్క...అని ఓ ప్రముఖ హీరో డైలాగ్ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర గురించి కూడా ప్రజల్లో అలాంటి మాటే వినిపిస్తోంది. రాయలసీమ జిల్లాలు, పల్నాడును దాటుకుని వైఎస్ జగన్ పాదయాత్ర కృష్ణాజిల్లాలో అడుగుపెట్టనుంది. అధికార రాజధాని, ప్రభుత్వం నిరంకుశత్వం కేంద్రీకృతమైన చోట, కుల రాజకీయాలు కుప్ప పోసిన చోట ప్రజా సంకల్పం అడుగు పెట్టబోతోంది. అవినీతిని దాచిపెట్టి, అభివృద్ధి ముసుగులో అధినేతలు చేస్తున్న ఆగడాలు బట్టబయలు కావడానికి, జన సందోహం తన ఆక్రోశం ప్రదర్శించడానికి ప్రజా సంకల్పం ఓ అవకాశం కానుంది. తెరచాటున దాచిన పాపాల చిట్టాలన్నీ పాదయాత్రలో బయటకు రానున్నాయి. ఆనంద నగరం అంటూ ఊదర గొడుతున్న ప్రభుత్వాల పనితీరు నిజంగా ఎలా ఉందే రేపటి నుండీ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలే ప్రతిపక్ష నేత ముందు గొంతువిప్పి చెప్పనున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ జరిగే అవినీతి దుర్వవ్యస్థ గురించి ఎవ్వరికీ తెలియనిది కాదు. కానీ ఆర్భాటాలతో, సొంత పత్రికల సొల్లుతో సమస్యలను పచ్చగోడల మధ్య బంధిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ రాక ఆ గోడలను బద్దలు కొట్టనుంది. ప్రజాగ్రహాల వెల్లువ బట్టబయలు కానుంది. ప్రజల్లో టిడిపి  ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో ప్రతి జిల్లాలోనూ ప్రజా సంకల్ప పాదయాత్రలో అడుగడుగునా ఘోషించే గుండె చెప్పింది. నేడు అధికార పార్టీ, అధికార నిర్వాకాలను, అరాచకాలను దగ్గర నుండి, చూస్తూ, నిజాలను విప్పి చెప్పేందుకు అవకాశం లేక, చెప్పినా పట్టించుకునే నాధుడు లేక కుమిలిపోతున్న రాజధాని జిల్లా వాసుల గుండె మంటలకు ఓ ఓదార్పు దొరకనుంది. 

ప్రజా సంకల్పం కృష్ణాజిల్లాలో ప్రత్యేకం ఎందుకంటే

ఇతర ప్రాంతాలతో పోలిస్తే భౌగోళికంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలను ప్రత్యేకంగా చెబుతారు. సీమ జిల్లాలు కరువు కోరల్లో అల్లాడుతున్నాయి. నీటి వసతులు లేక, ప్రాజెక్టులు రాక, ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అందించక ఆ ప్రాంత వాసులు ప్రభుత్వ తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. కానీ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా చెప్పుకునే కృష్ణాజిల్లా పంటలకు పెట్టింది పేరు. పుష్కలమైన నీటి వసతి, మాగాణులు ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. ఏడాదికి మూడు పంటలు పండే భూములతో, తోటలతో కళకళలాడే ఈ జిల్లా ఇప్పుడు రాజధాని కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. పరిపాలనా రాజధానిని పొంది మరింత ప్రతిష్ట తెచ్చుకోవాల్సిన ఈ జిల్లా నిత్యం సమస్యలతో అల్లాడుతోంది. వ్యవసాయానికి రాచనగరులా ఉండే ఈ జిల్లా రాజధాని పేర సంక్షోభంలో పడింది. పంటపొలాలన్నీ బీళ్లు కాగా, రైతులు వ్యవసాయానికి దూరమై మనోవ్యధకు లోనయ్యారు. వ్యవసాయం లేకపోవడంతో కూలీలకు జీవనోపాధి కరువైంది. కొన్ని వేలమంది వ్యవసాయాధారిత పనులు కోల్పోయి రోడ్డున పడ్డారు. మహానగరం విజయవాడ రాజధాని కలలను సాకారం చేయగల స్థితి లేక వెలవెలబోతోంది. మొత్తంగా ప్రభుత్వ అలసత్వానికి, అవినీతికీ, ప్రజల మనోవ్యధకు అద్దం పడుతోంది కృష్ణాజిల్లా. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం సాంకేతిక నగరం, ప్రపంచస్థాయి రాజధాని, పెట్టుబడుల హబ్ అంటూ సాంకేతిక పాలన ముసుగులో నిజాలను దాచి మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ప్రంపచంలో గొప్ప ఐదు రాజధానుల్లో ఒక్కటిగా అమరావతిని చేస్తానంటూ నమ్మబలికిన ఈ 40 ఏళ్ల అనుభవజ్ఞుడు ఎంత దారుణంగా మోసం చేసాడో చూసాక ఈ జిల్లా వాసులు మరింత కుంగిపోతున్నారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎప్పుడు తమ జిల్లాలోకి అడుగు పెడుతుందా, ఈ మోసకారి పాలన గురించి ఎప్పుడు వైఎస్ జగన్ కు చెప్పాలా అని ఎదురు చూస్తున్నారు కృష్ణా ప్రజలు. 

అవినీతికి కేంద్రబిందువై

భారీగా తీరప్రాంతం ఉన్న కృష్ణాజిల్లా అధికార టిడిపికి అవినీతిఖిల్లాగా మారింది. ఇసుక అక్రమరవాణాలో అంతులేని అన్యాయాలకు కేంద్రబిందువయ్యింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే ఇసుక అక్రమార్కులు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇందులో ముఖ్యమంత్రి కుమారుడికి సైతం వాటాలున్నట్టు వార్తలొచ్చాయి. ఇక తీరప్రాంత ఆక్రమణలైతే ఇబ్బుడి ముబ్బుడిగా పెరిగిపోయాయి. నదీ తీరం అంతా ఆక్రమణల పాలైంది. నదిలోకి చొచ్చుకుపోతూ కూడా కట్టడాలు, వ్యాపార సముదాయాలు తయారయ్యాయి. ముఖ్యమంత్రే నదీ తీరంలో శాశ్వతనివాసం ఏర్పరుచుకుంటే ఇక నిబంధనలను ఖాతరు చేసేవారెవ్వరు? అధికారులపై ఒత్తిళ్లు, మహిళా అధికారులపై దాడులు, రాజధానికి భూములిచ్చిన వారి కష్టాలు ఇవీ కృష్ణా జిల్లాకు అదనపు సమస్యలు. 

కుల రాజకీయాలు

కోస్తా ప్రాంతం అంతా రెండు ప్రధాన వర్గాల ఆధిపత్యం లో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పాలక పక్షంలో ఉన్న చంద్రబాబు గత ఎన్నికల్లో, తనది కాని రెండో వర్గపు ఓటర్లను వారి వర్గానికే చెందిన హీరో మాయలో పడేసి ఓట్లు గుంజుకున్నారు. ఆ కులానికి రిజర్వేషన్ ఆశ పెట్టి, నాడు ఓట్లు దండుకున్నారు. కానీ తర్వాత ఆ కులానికి మెండి చేయి చూపి, వారి ఆగ్రహావేశాలకు కారణమయ్యారు. ఇప్పుడా హీరోసైతం టిడిపి అధినేత నీడ నుంచి బైటకొచ్చి సొంతంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతి కులానికీ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి చేయూత ఇస్తామని ప్రకటించారు. అధికార పక్షం చేసిన ద్రోహంతో అట్టుడుకుతున్న కొన్ని వర్గాలకు వైఎస్ జగన్ రాక ఆశాకిరణంలా కనిపిస్తోంది. కుల రాజకీయాలు చేసి పబ్బం గడుపుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు కృష్ణాజిల్లా వాసులు సిద్ధమౌతున్నారు. అన్నివర్గాలనూ సమానంగా ఆదరించాలనే వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలని, తమకు జరిగిన మోసాన్ని ప్రతిపక్ష నేతకు వివరించాలని తొందరపడుతున్నారు. 

అభివృద్ధి పేరుతో ప్రజలను వంచించి, రాజధాని పేరుతో రైతులను ముంచి, ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసగించి, రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను నిర్లక్ష్యం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన  చంద్రబాబు కు తగిన గుణపాఠం చెప్పేందుకు అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా వారే ముందుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు అధికారపు అడ్డాగా, అబద్ధాల చెదలాగా చెలామణీ అవుతున్న చోట ప్రతిపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర ప్రజల స్పందనకు వేదిక అవుతుందంటున్నారు. 





 

తాజా వీడియోలు

Back to Top