నడకలో జగన్.. హావభావాల్లో వైఎస్నడకలో అన్ననూ.. హావభావాల్లో నాన్ననూ తలపిస్తూ చురుగ్గా అడుగులేస్తోంది ఓ యువతి.  వెంట వస్తున్న వేలాదిమంది ప్రజలతో మమేకమవుతూ, ఎదురవుతున్న వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ హుషారుగా.. చకచకా సాగుతోందామె. ఎడమ చేతితో అభివాదం చేస్తున్న తీరు తండ్రి మహానేత రాజశేఖరరెడ్డిని తలపిస్తోంది. నమస్కరిస్తూ అడుగులేయడం అన్న జగన్‌ను గుర్తుకుతెస్తోంది.
ఐదు రోజులలో 76.3 కిలోమీటర్లను అవలీలగా అధిగమించారు. వైయస్ షర్మిల. ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతున్న ఆమెకు జనం ఎక్కడికక్కడ ఘనంగా స్వాగతం పలికారు. జేజేలు చెప్పారు. జనాన్ని మాటలతో మురిసిస్తూ.. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతూ షర్మిల యాత్ర సాగింది. 
పొలాల్లోకి వెళ్ళి మరీ రైతులతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఇళ్ళలోకి వెళ్ళి మహిళలతో ముచ్చటించారు. మంచిచెడ్డా మాట్లాడారు. వీధుల్లో ఎదురొచ్చిన వారినందరినీ పలకరిస్తూ.. వారితో మాట్లాడిస్తూ.. కరచాలనం చేస్తూ షర్మిల యాత్రను సాగించారు. ఐదురోజుల్లో వెల్లువలా వచ్చిన జన సందోహంతో విజయవంతమైన యాత్రను చూసి పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం జనసందోహం రెట్టింపు కావడం  వారి సంతోషాన్నీ ఆ మేరకు పెంచింది. 
యాత్రలో అడుగడుగునా షర్మిల పాలక, ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. తాను చేసిన వ్యాఖ్యానాలకు అనుకూలంగా ప్రజలనుంచి సమాధానాలు రాబట్టారు. తన అన్న జగన్‌ జైలుపాలు కావడానికి  కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కవడమే కారణమని ఆమె చెప్పినప్పుడు ప్రజల నుంచి అవును.. అవును.. అనే నినాదాలు వినిపించాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సీబీఐ ఎందుకు వదిలేసిందన్న ఆమె ప్రశ్నకు వారు మద్దతు పలికారు.
మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కంటే తరిమికొట్టడమే లక్ష్యం కావాలని షర్మిల వ్యాఖ్యానించినపుడు చప్పట్లు మార్మోగాయి. ముందుచూపులేని ప్రభుత్వం కారణంగానే రాష్ట్రాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయని షర్మిల అరోపించినపుడు కూడా అవును.. అవును అని ప్రజలు స్పందించారు. అధికార విపక్షాలపై ఆమె సంధించిన విమర్శలు ఆయా పార్టీల నేతలలో ఆందోళనను పెంచాయి. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసిన వైనం షర్మిల రాజకీయ చతురతను ఆవిష్కరించింది. అవిశ్వాసం పెట్టే సత్తా ఉన్న చంద్రబాబు తన అవినీతి అక్రమాలనుంచి తనను కాపాడుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని విమర్శించి ప్రజలలో హుషారునింపారు. 
రైతులు, ఇతర వర్గాలతో మాట్లాడిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వానికీ, తన తండ్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికీ మధ్య తేడాను బేరీజు వేయించారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు ప్రజలు అనుకూల సమాధానాలను ఇచ్చారు. కుమార్తె షర్మిలతో తల్లి విజయమ్మ కూడా రావడంతో యాత్రకు మరింత ఆదరణ లభిస్తోంది. ఈ పరిణామాలు పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచాయి. ఉరకలెత్తించాయి.

Back to Top