దేశంలో పెరుగుతున్న కొత్త తరం ముఖ్యమంత్రుల సంఖ్య

1960ల్లో పుట్టిన సీఎంలు ఇప్పుడు అధికారంలో 11 మంది! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌త్యేక క‌థ‌నం

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల వయసుపై దృష్టి సారిస్తే...ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల్లో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేయగా, రాజస్తాన్‌ బీజేపీ నేత భజన్‌ లాల్‌ శర్మ శుక్రవారం ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా మొత్తం 30 మంది సీఎంల (కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో కలిపి) ఏఏ దశాబ్దాల్లో పుట్టారో చూద్దాం. దేశంలో స్వాతంత్య్రం రావడానికి ఒకట్రెండు ఏళ్ల ముందు పుట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇద్దరే కనిపిస్తారు. పినరయి విజయన్‌ (కేరళ) 1945లో, నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా) 1946లో జన్మించారు. సిద్దరామయ్య (కర్ణాటక) స్వాతంత్య్రం రావడానికి కొది ్దరోజులు ముందు 1947 ఆగస్ట్‌ 3న పుట్టారు. వీరితోపాటు 1940 దశకంలో పుట్టిన నాలుగో సీఎం ఇటీవల మిజోరంలో అధికారంలోకి వచ్చిన జడ్పీఎం పార్టీ నేత లాల్దుహోమా. ఆయన 1949 ఫిబ్రవరి 22న పుట్టారు. అంటే 70 ఏళ్లు దాటిన ముఖ్యమంత్రులు దేశంలో ఈ నలుగురు మాత్రమే. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన సమయంలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే– భారతదేశంలో 60 ఏళ్లు లేదా 50 సంవత్సరాలు నిండకుండానే ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అర్ధమౌతోంది. 1980ల్లో పుట్టిన యువ నాయకులు ఇంకా ఎవరూ ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిగా ఎదగలేదు. తొలి ప్రధాని పండిత నెహ్రూ మరణించిన ఏడేళ్ల తర్వాత అంటే 1970ల్లో పుట్టిన నాయకులు 8 మంది ఇప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పెద్ద తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తన మొదటి పదవీకాలం దిగ్విజయంగా పూర్తిచేసుకుంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారితోపాటు మరో ఏడుగురు ముఖ్యమంత్రులు: పేమా ఖాండూ, ప్రమోద్‌ సావంత్, హేమంత్‌ సొరేన్, కాన్రాడ్‌ సంగ్మా, యోగీ ఆదిత్యనాథ్, పుష్కర్‌ సింగ్‌ ధామీ, భగవంత్‌ సింగ్‌ మాన్‌ (వరుసగా అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, ఝార్ఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలు). 

1960ల్లో జన్మించిన ముఖ్యమంత్రులే ఎక్కువ మంది (11) 
1940లు, 1950లు, 1970ల్లో పుట్టిన ముఖ్యమంత్రుల సంఖ్యతో పోల్చితే 1960ల్లో జన్మించిన ప్రస్తుత సీఎంలు ఎక్కువ మంది ఉన్నారు. దేశ నిర్మాణం వేగం పుంజుకోవడం మొదలైన 1960ల్లో పుట్టిన ముఖ్యమంత్రులు ఇప్పుడు 11 మంది ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తోపాటు ఇలాంటి ముఖ్యమత్రులు: ఎనుముల రేవంత్‌ రెడ్డి, హిమంత బిశ్వశర్మ, భూపేంద్రపటేల్, సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కూ, మోహన్‌ యాదవ్, ఏక్‌ నాథ్‌ శిందే, ఎన్,బీరేంద్రసింగ్, భజన్‌ లాల్‌ శర్మ (ప్రమాణం చేయాలి), ప్రేంసింగ్‌ తమాంగ్, విష్ణుదేవ్‌ సాయ్‌ (వరుసగా తెలంగాణ, అస్సాం, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్తాన్, సిక్కిం, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల సీఎంలు). ఇక స్వాతంత్య్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకు అంటే 1950ల్లో జన్మించిన నేతలు ముఖ్యమంత్రులుగా ఏడుగురు ఉన్నారు. ఈ తరహా ముఖ్యమంత్రుల్లో వయసులో అందరికన్నా పెద్ద కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి (1950 ఆగస్ట్‌ 4). ఇలా 1950ల్లో జన్మించిన మిగిలిన సీఎంలు: నెయిఫియూ రియో, నితీశ్‌ కుమార్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్, ఎంకే స్టాలిన్, మాణిక్‌ సాహా, మమతా బెనర్జీ (వీరు వరుసగా నాగాలాండ్, బిహార్, హరియాణా, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల సీఎంలు). ఇక భవిష్యత్తులో 1980ల్లో జన్మించిన నాయకులు కొన్ని రాష్ట్రాల్లోనైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టే రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నవంబర్‌ చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్తాన్‌ సీఎం పదవికి బీజేపీ యువ ఎంపీ మహంత్‌ బాలక్‌ నాథ్‌ పేరు కూడా మొదట పరిశీలనలో ఉందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 1984లో జన్మించిన బాలక్‌ నాథ్‌ కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అలవర్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై మొదటిసారి ఎన్నికయ్యారు. చదువుకున్న యువకులు 30 ఏళ్లు నిండకుండానే రాజకీయాల్లో ప్రవేశిస్తున్న కారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు వయసు తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

Back to Top