మత్తెక్కిస్తున్న మందు బాబు

  • ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
  • అడుగుకో బార్‌..వీధికో బెల్ట్‌ షాపు
  • రోజుకో అఘాయిత్యం
  • ఎన్నికల హామీని మరిచిన చంద్రబాబు
  • కాసులకు కక్కుర్తి పడి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
  • పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న బాబు
ఏపీ: నవ్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చుతానని అధికార పీటం ఎక్కిన చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబుల నిషా ప్రభుత్వ గల్లా పెట్టెను నింపేస్తోంది. వీధికో బెల్టు షాపులు వెలుస్తున్నాయి. ఇది చాలదన్నట్లు అడుగుకో బార్‌ ఏర్పాటు చేయాలని సర్కార్‌ యత్నించడం దుర్మార్గం. ప్రతీ ఏటా తన పరిధిని విస్తరించుకుంటూ పోతున్న మద్యం రంగాన్ని వీలైనంత మేర క్యాష్‌ చేసుకోవాలనే యోచనలో బాబు ఉన్నారు. మద్యంపై ఖజానాకు ఆదాయం పోటెత్తుతుండడంతో.. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలపై పన్ను రేటును పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇప్పటికే సంకేతాలు అందాయి.

పెరిగిన మద్యం విక్రయాలు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మద్యం విక్రయాలు మరింతగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2014లో రూ. 11,569 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగ్గా.. 2015లో రూ. 12,596 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ కంటే ఏపీలో రూ. 600 కోట్లు అదనంగా జరిగాయి. ఏపీలో మద్యం విక్రయాల పరంగా విశాఖ టాప్‌ లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా రూ. 876 కోట్ల మద్యం విక్రయాలు విశాఖలో జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రూ.836 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 814 కోట్లు, గుంటూరులో రూ.792 కోట్ల విక్రయాలు జరిగాయి.  మద్యం ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోన్న ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులపై కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే మద్యం లైసెన్స్‌ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవట్లేదు.

బార్‌ లైసెన్స్‌ నిబంధనల్లో సవరణలు
రాష్ట్ర ప్రభుత్వం అడుగుకో బార్‌కు అనుమతులు ఇచ్చేయనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో గల ఆహార పార్లర్స్‌లోను, బీచ్‌లలోనూ మద్యం విక్రయాలకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బార్‌ లైసెన్స్‌ ల నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ను జారీ చేశారు. బీచ్‌ల్లోను, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ బార్లను తెరవడానికి వీలుగా కనీసం నిర్మాణ జాగాను తగ్గించేశారు. కనీసం 200 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం ఉండాల్సి ఉండగా ఇప్పుడు బార్ల ఏర్పాటునకు కనీసం 100 చదరపు మీటర్లు ఉంటే చాలని నిబంధనల్లో సవరణలు చేశారు.

సుప్రీం ఆదేశాలు బేఖాతరు
జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులను వంద మీటర్ల లోపు ఉన్న వాటిని తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు కమిటీ రాష్ట్రాన్ని హెచ్చరిస్తుండగా... దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా జాతీయ రహదారులకు వంద మీటర్ల లోపు బార్‌ లెసైన్స్‌ ఇచ్చేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేశారు. పర్యాటక కేంద్రాలుగా పేర్కొన్న బీచ్‌ల్లోను, ఇతర ప్రాంతాల్లోను విరివిగా బార్‌ లెసైన్స్‌లను మంజూరు చేయనున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ నుంచి హోటల్‌కు లైసెన్స్‌ పొంది ఉన్న అన్నింటికీ కూడా బార్‌ లైసెన్స్‌ జారీ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తినడానికి ఆహారం దొరికే ప్రతీ దుకాణం, ఆహార పార్లర్లలో మద్యం విక్రయాలకు లెసైన్స్‌ మంజూరు చేస్తారు.

మృత్యు మార్గాలు
జాతీయ రహదారులు మృత్యుమార్గాలుగా మారాయి. ఏదో ఒక పనిమీద మనిషి రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి చేరతామన్న గ్యారంటీ లేదు. తాగి వాహనాలు నడిపేవారిని కట్టడి చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులూ అమలు కావడం లేదు. రహదారుల పొడవునా మద్యం ఏరులై పారుతోంది. అడుగుకో వైన్‌ షాప్‌ దర్శనమిస్తోంది. ఇటీవల నెల రోజుల క్రితం నెల్లూరు శివారు కిసాన్‌నగర్‌ హైవేపై 19 ఏళ్ల యువకుడు కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న వారు మద్యం సేవించి ఉండడమే ఇందుకు కారణమని తేలింది. పడారుపల్లి జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీ కొడుకులను కారు ఢీ కొనడంతో తండ్రి చనిపోగా, కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ఇందుకు కారణం. నెల్లూరు నగరంలో మయూరి హోటల్‌ వద్ద మద్యం సేవించి కారు నడుపుతూ.. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోయారు. జాతీయ రహదారులపై పెట్రోలింగ్‌.. అంబులెన్స్‌ల ఏర్పాటు, సెన్సార్లు, ఇంటర్‌ సెప్టెర్‌ వాహనాలతో వేగ నియంత్రణ, సీసీ కెమెరాలతో నిఘా.. ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా.. వాటి అమలు అంతంతమాత్రంగానే ఉంది. జాతీయ రహదారులపైనే వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. రాత్రి 2 దాటాక ప్రయాణం వద్దన్నా వాహనాలు ఆగడం లేదు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం.. వాహనదారుల అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. జాతీయ రహదారిల పక్కనే మద్యాన్ని వరదై పారిస్తూ  మృత్యుదారులుగా మారుస్తోంది. 

బాబుకు వాటాలు
మద్యం విక్రయాల్లో వచ్చే లాభాల్లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు వాటాలు అందుతున్నాయి. చంద్రబాబుకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేదు. కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెట్టడం, ప్రజలను మద్యానికి బానిసలను చేయడమే చంద్రబాబు విజన్‌. ఎన్నికల ముందు, సీఎంగా ప్రమాణ స్వీకారంచేసేటప్పుడు బెల్ట్‌ షాపులు రద్దు చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు  అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా బెల్ట్‌షాపులు పెట్టండి. మద్యం అమ్మకాలు పెంచండి. ప్రజల చేత ఎంతైనా తాగించండి. మాకు వాటా ఇవ్వండి అని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. వీధికో బెల్ట్‌ షాపు తెరిచి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. రాష్ట్రంలో మద్యానికి బానిసలైన  కుటుంబాలను మరింతగా సర్వనాశనం చేయడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇకనైనా బెల్ట్‌ షాపులను రద్దు చేసి, మద్యం విక్రయాలను నియంత్రించకపోతే చంద్రబాబుకు పుట్టగతులుండవ్‌.

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేదం
రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తామని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో విజయవాడ నగరంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో వైయస్‌ జగన్‌ స్పందిస్తూ మద్యపాన నిషేదంపై హామీ ఇచ్చారు. మద్యం విక్రయాలు, బెల్ట్‌ షాపులపై వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
 
 
Back to Top