గురుశిష్యుల స్వార్థ రాజకీయాలు

వాళ్లు సీఎంగా ఉండడం ప్రజల దురదృష్టకరం..
ప్రజల కోసం పనిచేసే వైఎస్సార్సీపీని గెలిపించండి
పేదల గుండెల్లోంచి మహానేతను తొలగించలేరు

వరంగల్ః వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి కేసీఆర్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. ఒకే బడికి చెందిన గురు శిష్యులు అధికారంలో ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజల దురదృష్టమన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు స్వార్థ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన కారణంగానే ఇవాళ వరంగల్ లో ఉపఎన్నిక వచ్చిందని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. నిరంతరం ప్రజాసంక్షేమం కోసమే పరితపిస్తూ, ప్రజల విలువలు కాపాడే వైఎస్సార్సీపీని గెలిపించాలని వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

వైఎస్సార్సీపీ గెలుపుతోనే సాధ్యం..
ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణలోని ఇతర నేతలంతా వైఎస్సార్సీపీకి లభించిన వరాలని లక్ష్మీపార్వతి కితాబిచ్చారు. తెలంగాణలో వైఎస్సార్సీపీని ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారని కొనియాడారు. వరంగల్ ఓటర్లు రాజకీయ చైతన్యం కలిగిన వారని లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ....ప్రజల అండకోసం  నిలబడిన వైఎస్సార్సీపీని గెలిపిస్తేనే  ప్రయోజనం ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ను గెలిపిస్తే పార్లమెంట్ లో స్థానిక సమస్యలపై పోరాడుతారని చెప్పారు.  

పేదల గుండెల్లో కొలువైన నేత..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ప్రతి పథకం పేదవాడి గుండెల్లో నిలిచిందని  నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన నేత రాజశేఖర్ రెడ్డి అని, అందువల్లే ఆయన చేసిన అభివృద్ధిని ఎవరూ మర్చిపోలేకపోతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. ప్రజల గుండెల్లోంచి రాజశేఖర్ రెడ్డిని తప్పించాలని ఇతర పార్టీల నాయకులు ఎంతగా తపించినా అది సాధ్యం కాదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను ఆదరించినట్లే  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. 

ఎన్నని..చేయని అభివృద్ధే లేదు..
అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. రూ. 2లకే కిలో బియ్యం, చదువు భారమైన నిరుపేద కుటుంబాల విద్యార్థులకు పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకునే అవకాశం, మంత్రులతో సమానంగా కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని లక్ష్మీపార్వతి అన్నారు. బోరుబావులకు ఏటా లక్ష కోట్ల కనెక్షన్లు, ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కా గృహాలు సహా మరెన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. ఈఅభివృద్ధి ఫలాలన్నీ కొనసాగాలంటే  రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని లక్ష్మీపార్వతి తేల్చిచెప్పారు.

తాజా వీడియోలు

Back to Top