కోడెల తనయుడా? మజాకా?

• కొనుగోలు 17.3 ఎకరాలు
• చెల్లించినది రూ. 93 లక్షలు
• ప్రస్తుత విలువ 18.4 కోట్లు

రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సెపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.  రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడా నికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం.. అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత. తన వద్దకు వచ్చిన వారిని బతిమాలో, బెదిరించో.. నయానో భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని తన బినామీల పేర్లతో కొట్టేయడం రివాజుగా మారింది.


సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్‌ఫ్రా పేరుతో  ఎకరం రూ.ఎనిమిది లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ.. అదేమీ పట్టని రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని గుత్తా నాగప్రసాద్‌కు కట్టబెట్టేసింది. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ఆ నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నారు.
 
ఎవరీ గుత్తా నాగప్రసాద్?
గుత్తా నాగ ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు. సాధారణ కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్ బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. కోడెల పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రమాదంలో మరణించినపుడు నాగప్రసాద్‌కు ఆ కుటుంబంతో సన్నిహిత బంధం ఏర్పడింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా కోడెల వ్యవహరించే సమయంలో నాగ ప్రసాద్‌ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులను కోడెల నాగ ప్రసాద్‌తో చేయించేవారని సమాచారం. కోడెల క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాగప్రసాద్ ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కోడెల స్పీకర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన తనయుడు కోడెల శివరామ కృష్ణకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూనే.. గుంటూరులో హోండా షోరూంలో ప్రైవేటు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చిలుకలూరిపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగ ప్రసాద్.. కోడెల తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట నియో జకవర్గాల్లో పనులు చక్కబెడుతుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్‌కు కోట్లాది రూపాయలు వెచ్చించి.. భూములు కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా?
Back to Top