() దేవుడి సొమ్ముకు ప్రభుత్వం కుచ్చు టోపీ() విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జా() ఎకరా రూ.13 కోట్ల విలువ చేసే భూమి రూ. 27 లక్షలకే కొనుగోలు() అడ్డగోలుగా దోచేసుకొన్న టీడీపీ నేతలు
హైదరాబాద్) అక్కడ సర్కారుకు చెందాల్సిన భూమి ఉంది. కబ్జా చేసేస్తున్నారు కాబట్టి అమ్మేయండి! అంటాడో బాబు.సరే! అలాగే కానివ్వండి!! అంటూ ఆగమేఘాల మీద ఉత్తర్వులిచ్చేస్తాడు అధికారంలో ఉన్న బాబు.ఈ వేలమైతే కష్టం. దానికి తోడు ఎక్కువ ధరైతే నష్టం. తక్కువైతేనే మాకిష్టం... అంటాడు మరో బాబుఇంకేం! అనుకున్నట్టే జరిగిపోతాయి. వెయ్యి కోట్ల విలువైన కుంభకోణం ఇది. అమరావతి రాజధాని సాక్షిగా, అమరేశ్వర స్వామి కళ్లు కప్పి, దేవాదాయ శాఖ భూముల్ని స్వాహా చేసిన బాగోతం ఇది.
ముఖ్యమంత్రి చంద్రబాబు...టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కలిసి ఆడేసిన డ్రామా. అమరావతిలో ఉండే సత్రం కోసం చెన్నై దగ్గర్లో తనకున్న 473 ఎకరాల భూమిని దానం చేశారు అప్పటి జమీందారు. అందులో కబ్జాలు పోగా మిగిలింది 83.11 ఎకరాలు. బాబు సీఎం పీఠమెక్కగానే పన్నాగం మొదలైంది. కబ్జాలు పోగా మిగిలిన భూమిని తక్షణం అమ్మేయాలని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న లేఖ రాశారు. ఎవరైనా భూమి కబ్జా అవుతుంటే రక్షించాలని కోరుతారు. మిగిలినదాన్నయినా కాపాడండని అభ్యర్థిస్తారు. కానీ ఈయన మాత్రం... అమ్మేయమని కోరారు. అదీ వింత. ఇక సీఎం కార్యాలయం తక్షణం స్పందించటం... నెల తిరిగేసరికల్లా దేవాదాయ శాఖ ఉత్తర్వులివ్వటం. 2015 ఏఫ్రిల్ కల్లా వేలానికి కావాల్సిన తంతును ఆ శాఖ పూర్తి చేయటం జరిగిపోయాయి.
చిత్రమేంటంటే చిన్న దుకాణానికి కూడా ఈ-వేలం పిలిచే దేవాదాయ శాఖ.. దీనికి మాత్రం అలా పిలవలేదు. గజం రూ. 25వేల నుంచి 30 వేలు పలికే ఆ ప్రాంతంలో ఎకరా ధరను కేవలం రూ. 50 లక్షలుగా నిర్ణయించింది. వేలానికొచ్చిన బాబులు అదీ ఎక్కువన్నారు. దీంతో రూ. 13 కోట్లకు పైగా విలువచేసే ఎకరా ధరను 50 లక్షల అప్‌సెట్ ధర నుంచి రూ. 27 లక్షలకు తగ్గించి ఆ లెక్కనే అమ్మేశారు. వెయ్యి కోట్లక పైగా విలువైన భూమిని రూ. 22 కోట్లకు విక్రయించారు. కొన్నది కాపు కార్పొరేషన్ చైర్మన్. వీళ్లంతా తెర ముందు పాత్రలేనని... తెర వెనక బాబుల చేతుల్లో కొన్ని వందల కోట్లు ముడుపులు పడ్డాయి.
సర్కారు భూములు అక్రమణకు గురైతే ఏం చేయాలి? అందులోనూ విలువైన దేవాలయ భూములైతే... ఎంత జాగ్రత్త వహించాలి? కబ్జాదారులను తరిమికొట్టి వాటి కపాడాలి కదా..! కానీ చంద్రబాబు జమానాలో అంతా రివర్స్... భూములు కబ్జాదారుల నుంచి బడాబాబుల చేతుల్లోకి రాజమార్గంలో చేరిపోవడానికి ప్రణాళిక రచించారు. ఆగమేఘాలపై పైళ్లు పుట్టుకొచ్చాయి. శరవేగంగా పరుగులు పెట్టాయి. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం... ఆ భూములను అమ్మేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించాడు... ముఖ్యమంత్ని కార్యాలయం నుంచి దేవాదాయ శాఖకు లేఖ రాసింది... దేవాదాయ శాఖ వెంటనే వేలంపాటకు అనుమతించేసింది... అనక రంగంలో దిగిన ముఖ్యమంత్రి సన్నిహితుడు... ఏరికోరి నియమించుకున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మరికొంత మంది అధికార పార్టీ నాయకులే ఆ భూములను వేలంలో కొనేశారు. విచిత్రమేమిటంటే ఎకరా రూ. 13కోట్లు పలికే భూమి ఎకరా రూ. 50 లక్షల చొప్పున అమ్మితే చాలని ఈవో చేత కూడా పలికించారు. ఆ రేటుకూ ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ ఎకరం రూ. 27 లక్షలకు ఫైనల్ చేసేశారు. అలా చివరకు 83.11 ఎకరాల విలువైన భూములు రూ. 22 కోట్లకు అప్పనంగా అయినవారికి కట్టబెట్టేశారు. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో ఎవరి పాత్రను వారు యథాశక్తి రక్తికట్టించారు. గద్దల్లాంటి పెద్దల దెబ్బకు దేవుడైనా అబ్బా అనాల్సిందేనని రుజువు చేశారు. భూములు కోల్పోయిన అమరేశ్వరుడు అమరావతిలో నిస్సహాయంగా నిలబడ్డాడు.