ఒకటో తారీఖు కష్టాలు

– సమస్యలు పక్కనపెట్టి బాబు సర్కారు మొద్దునిద్ర
– వ్యాలెట్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లంటూ కాలక్షేపం
– సాధ్యాసాధ్యాలను మరిచి మరోసారి తప్పటడుగు
– డిసెంబర్‌ మాసంలో పెళ్లిళ్లు.. క్రిస్మస్‌ పండుగ 

డిసెంబర్‌ ఒకటో తారీఖు వచ్చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులు, వ్యాపారులే కాకుండా జనమంతా భయంతో వణికిపోతున్నారు. నెలతిరిగే సరికి చెల్లించాల్సిన పేపర్‌ బిల్లు, పాల బిల్లు, ఇంటి అద్దె, పనిమనిషికి ఇవ్వాల్సిన జీతం... ఇలా రకరకాల బిల్లుల గురించే వారి భయమంతా. ఇవ్వడానికి అకౌంట్లలో డబ్బులున్నా తెచ్చుకునే దిక్కులేదు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా వీధిన పడింది. ఇప్పటికే 23 రోజులు గడిచిపోయింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోగా రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. డబ్బులు తెచ్చుకుందామని బ్యాంకులు, ఏటీఎంలకు వెళితే నో క్యాష్‌ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఇంతలో మరో షాక్‌. ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న 500 నోట్లు కూడా ప్రింటింగ్‌ ఆగిపోయిందని ఆర్‌బీఐ సావధానంగా ప్రకటించింది. దీంతో కష్టాలకు సీక్వెల్‌ మొదలైనట్టుగా తయారైంది పరిస్థితి. సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టెక్నాలజీకి తానే మూల పురుషుడినంటూ జనానికి అర్థంకాని భాషలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఏపీ పర్సు, మొబైల్‌ బ్యాంకింగని పాడిందే పాడుతూ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. సాధ్యాసాధ్యాలను పర్యవేక్షించకుండా మరోసారి జనాన్ని సమస్యల సాగరంలో ముంచడానికి పబ్లిసిటీ బాబు చీటింగ్‌కు తెరలేపాడు. ఈ నేపథ్యంలో బాబు చెప్పే టెక్నాలజీ సాధ్యమయ్యే పనేనా...చూద్దాం

గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంల శాతమెంత
నోట్ల రద్దుతో జనం అల్లాడిపోతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయ్యాయన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ఉన్నట్టుండి మొబైల్‌ బ్యాంకింగ్ , ఇంటర్నెట్, టెక్నాలజీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇదంతా చూస్తుంటే దప్పికేసినప్పుడు బావి తవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఉన్నట్టుండి ప్రజలంతా టెక్నాలజీకి అలవాటు పడితే మంచిదని క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌తో నల్లధనాన్ని అరికడతామంటూ తాము చేసిన తప్పుకు దేశ  ప్రయోజనాల ముద్రను అంటగడుతున్నారు. ఉన్నట్టుండి అంతా మొబైల్‌ బ్యాంకింగ్‌కు అలవాటు పడాలంటే సాధ్యమయ్యే పనేనా..? దాదాపు 60 శాతం గ్రామీణ భారతంలో ఉన్నట్టుండి అలవాటు పడటమంటే ఎలా.. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మరోసారి జనంపై కష్టాలు మోపే కుట్రకు చంద్రబాబు సర్కారు సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో రైతులకు ఎంతమందికి ఖాతాలున్నాయి. జనమంతా బ్యాంకులకు పోటెత్తితే సేవలందించడానికి సరిపడా సిబ్బంది బ్యాంకర్లకు అందుబాటుల్లో ఉండొద్దా. అన్నిటికీ మించి మన డబ్బులు మనకు ఇవ్వడానికి డబ్బులు లేక బ్యాంకులు వణకుతున్నాయి. 

సెల్‌ఫోన్‌ సిగ్నలే లేదు.. మొబైల్‌ బ్యాంకింగా
మొబైల్‌ బ్యాంకింగ్‌ అమలు కావాలంటే ప్రధానంగా కావాల్సింది అకౌంట్‌లో డబ్బులుండటం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కావాల్సింది సెల్‌ఫోన్‌కు సిగ్నలుండటం. ఐదు నిమిషాలపాటు ఫోన్‌ మాట్లాడాలంటేనే పది సార్లు కట్‌ అవుతుంటే మొబైల్‌ బ్యాంకింగ్‌లతో కొనుగోళ్లు ఎలా చేస్తారు. చిల్లర ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు చూసుకునే దుకాణదారులు పొరపాటున సాంకేతిక కారణాలతో అకౌంట్‌లో డబ్బులు కట్‌ అయితే నానా గగ్గోలు పెడతారు. వీళ్లందరికీ ఎవరు అవగాహన కల్పిస్తారు. పోయిన డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారు. ఫోన్లో తెలియకుండా పది రూపాయాల బ్యాలెన్స్‌ కట్‌ అయితే అల్లాడిపోతాం. అలాంటిది హ్యాకర్లు మన బ్యాంకు అకౌంట్‌ను హ్యాక్‌ చేస్తే పరిస్థితి ఏంటి. నిన్నటికి నిన్న పేటీఎం వ్యాలెట్‌ యాప్‌ను హ్యాక్‌ చేసి పది లక్షల అకౌంట్‌ల సమాచారాన్ని సేకరించారని వార్తలొచ్చాయి. ఎప్పట్నుంచో వాడుకల్లో ఉన్న అంతపెద్ద వ్యాలెట్‌కే హ్యాకర్ల బెడద తప్పలేదు. ఏపీ గవర్నమెంట్‌ తూతూ మంత్రంగా ప్రవేట్ గా పెట్టే యాప్‌ ‘ఏపీ పర్సు’తో ఇలాంటి కష్టాలన్నీ గట్టెక్కగలవని ఎలా నమ్మగలం. గ్రామీణ ప్రాంతాల్లో డీటీహెచ్‌లు విజయవంతం కాకపోవడానికి మరో ప్రధాన కారణం కూడా ఇలాంటి సాంకేతిక కారణాలే. అందుకే ఎక్కువ మంది లోకల్‌ కేబుల్‌ టీవీ ప్రొవైడర్‌లనే ఆశ్రయిస్తున్నారు. 

పింఛన్లు అకౌంట్‌లో ఎందుకు వెయ్యడం లేదు
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం లబ్ధిదారులకు రావాల్సిన పలు రకాల పింఛన్లు ఇప్పటికీ చేతికి ఇచ్చే సాంప్రదాయాన్నే కొనసాగిస్తుంది. మొదట్లో అందరికీ బ్యాంకు అకౌంట్‌లు ఉండాలని హడావుడి చేసి తీరా అందుకునే సమయానికి చేతికే ఇవ్వడం బెటరని తేల్చేశారు. మళ్లీ ఇప్పుడేమో బ్యాంకింగ్‌ వ్యవస్థ అంటూ జనాల బుర్రలు తినేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో అక్రమాలను అరికడతామంటూ చంద్రబాబు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్‌ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ–పాస్‌ మిషన్లు సమస్యల పుట్టలుగా మారిపోయాయి. ఇన్నాళ్లు మాన్యువల్‌గా సరుకులు తీసుకున్నప్పుడు అంతా చకచకా జరిగిపోయేది. ఈ– పోస్‌ మిషన్లు వచ్చిన తర్వాత ఒకరికి సరుకులు ఇవ్వాలంటేనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. వేలిముద్రలు సరిపోక జనం అల్లాడిపోతున్నారు. అన్నీ ఉన్నా సిగ్నల్‌ ఉండదు. ఈ పరిస్థితి కేవలం గ్రామాల్లోనే కాదు.. పట్టణాలనూ వేధిస్తుంది. ఇదంతా చూస్తుంటే జనాన్ని సమస్యల నుంచి పక్క దారి పట్టించేందుకు మరో సమస్య సృష్టించే కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం తెరలేపిందన్నది మాత్రం వాస్తవం. 

రాబోయేది పెళ్లిళ్లు పండగల సీజన్‌ 
డిసెంబర్‌ మాసంలో వేల పెళ్లిళ్లు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పెళ్లంటే చిన్న విషయం కాదు. నగదు, నగలు, సంబరాలు, హడావుడితో కూడినది అనేది అందరికీ తెలిసిన నిజం. నోట్ల రద్దుతో ఇప్పటికే చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. మంచి ముహూర్తాలు దాటిపోతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైనా మంచి సంబంధం దొరికితే వీలైనంత తొందరగానే పెళ్లి చేయాలని చూస్తారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇలానే ఆలోచిస్తాయి. తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయోనని వారి భయం. దీనికితోడు  క్రిస్టియన్లకు ముఖ్యమైన పండుగ క్రిస్మస్‌ కూడా డిసెంబర్‌25న ఈనెలలోనే రాబోతుంది. జనవరి 1 న్యూ ఇయర్‌ సంబరాలు కూడా రాబోతున్నాయి. ఇవన్నీ డబ్బులతో కూడుకున్న వ్యవహారమే. బ్యాంకులే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలనేది ప్రతి ఒక్కర్నీ వేధిస్తున్న సమస్య.
Back to Top