ఈ ధర్మపోరాటాలు ఇక ఆపండి: బాబుకి దండం పెట్టిన జెసి


''చేసిన అభివృద్ధినే తట్టుకోలేక ప్రజలు ఉబ్బి తబ్బిబ్బయి నానా ఇబ్బందులు పడుతోంటే... ఇంకా అభివృద్ధి అభివృద్ధి అంటూ మా ప్రాణాలు తీయకండి సార్.. మీకు దండం పెడతా!'' బహిరంగ వేదికపై చంద్రబాబుని పొగిడే పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న జెసి దివాకర్ రెడ్డి మాటలివి. ఈ ధర్మపోరాట దీక్షలవీ ఇక ఆపేయండి. మీరు ప్రజలకేం చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకంతా అర్థమయింది అంటూ ఒక సెటైర్ కూడా వేశాడు జెసి. పనిలో పనిగా బాబు నిప్పు గుణాన్ని భుజానికెత్తుకుని సాధ్యమైనంతవరకు ఊరేగాడు జెసి. అతని పొగడ్తలు విని చంద్రబాబు అత్యంత అరుదైన తన చిరునవ్వును ప్రజలకు పరిచయం చేశాడు. అక్కడితో జెసి ప్రవాహం ఆగలేదు. వెల్ ఫేర్ స్కీమ్స్ చేసి చేసి మీరు చాలా బాధపడిపోతున్నారు బాబుగారూ... ఇది మీకు చాలా కష్టమైపోతోంది. దయచేసి ఇక ఆపేయండి. నాకు కావాల్సినవేవో కాస్త చేస్తే నేను నా బిడ్డ నా మనవడు ఇలా తరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అంటూ తన మనసులోని కోరిక కూడా బయటపెట్టాడు జెసి. చిల్లుపడ్డ కొబ్బరి చిప్పతో వచ్చి ఇంత స్థాయిలో కూడబెట్టిన విషయాన్ని కూడా ధర్మపోరాట వేదికపైనుంచే పొగిడిపాడేశారు దివాకర్ రెడ్డి. ఇవన్నీ వింటున్న బాబు ఇది రాష్ట్రం గురించి అంటున్నాడో.. తన వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక కాస్త కంగారుకు గురయ్యాడు. ఇక ఆలస్యం చేస్తే ఏమైనా జరగవచ్చు అనే భయంతో, వెంటనే ఫస్ట్ ప్రైజ్ డిక్లేర్ చేస్తూ జెసి పూనకాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి వింటున్న ప్రజలకు మాత్రం బాబు పోరాటం, జెసి ఆరాటం మంచి వినోదాన్ని పంచాయి.

Back to Top