డ్రాగన్ కోసమే ధ్వంసరచన

  • చైనా కోసం చెత్త పనులు
  • అభివృద్ధి పేరుతో కూల్చివేతలు
  •  వేలాది ఇళ్లు, పదుల సంఖ్యలో ఆలయాల కూల్చివేత
  •  హడావుడి, తాత్కాలిక పనుల వెనుక  అసలు రహస్యం ఇదే?
  •  ఘాట్‌లలో అప్పుడే ఊడిపోతున్న టైల్స్

అమరావతి: పుష్కరాలు 12 రోజులు కూడా గడవకముందే ఆ పేరిట ప్రభుత్వం చేసిన పనుల్లో డొల్లతనం బట్టబయలవుతోంది. పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్‌లలో అతికించిన నాసిరకం టైల్స్ ఎక్కడివక్కడ ఊడిపోతున్నాయి. దుర్గాఘాట్, పున్నమిఘాట్, పవిత్ర సంగమం (ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్)లు కాంక్రీట్ ఫ్లోరింగ్‌తోనే సరిపెట్టారు. అక్కడ టైల్స్ కూడా అతికించలేదు. పనుల్లో నాణ్యత లోపించిన కారణంగానే టైల్స్ ఊడిపోతున్నాయని, సమయం చాలకపోవడంతోనే కాంక్రీట్ ఫ్లోరింగ్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వస్తున్నా.. కృష్ణా పుష్కరాల మాటున ప్రభుత్వం పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
పుష్కరాల పేరిట నదీ ముఖ పర్యాటకానికి (రివర్ ఫ్రంట్ టూరిజం) ముందస్తు ప్రణాళికతో మార్గం సుగమం చేసిందని అంటున్నారు. పుష్కరాల పేరుతో నిర్మించిన ఘాట్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడం వెనుక రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి అవరోధం లేకుండా చేసే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 వ్యతిరేకత రాకుండా పుష్కరాల సెంటిమెంట్
కృష్ణా తీరంలో రివర్ ఫ్రంట్ టూరిజానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అలా చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆ తరువాత గుర్తించింది. దీంతో పుష్కరాల సెంటిమెంట్‌ను వాడుకోవాలని నిర్ణయించుకుంది. సౌకర్యాలు, ఘాట్లు, రోడ్లు అభివృద్ధి పేరుతో విధ్వంసానికి ప్రణాళిక రచించింది. కృష్ణా జిల్లా విజయవాడ, ఇబ్రహీంపట్నంతో పాటు గుంటూరు జిల్లా సీతానగరంతో కలిపి కృష్ణా నది వెంబడి ఏళ్ల నుంచి పేదలు నివసిస్తున్న దాదాపు 2,500కు పైగా ఇళ్లను తొలగించింది. 40కి పైగా ఆలయాలు తొలగించారు. ఇబ్రహీంపట్నంలో జాతిపిత మహాత్మగాంధీ, విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, విజయవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ టీవీఎస్ చలపతిరావు తదితర నేతల విగ్రహాలను ప్రజావ్యతిరేకత మధ్య తొలగించారు. ఇదంతా కూడా పుష్కరాల కోసమే చేస్తున్నట్టు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ పుష్కర ఘట్టం ముగియగానే కృష్ణా తీరాన్ని రివర్ ఫ్రంట్ టూరిజం కోసం డ్రాగన్ (చైనా)సంస్థ చేతికి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి పుష్కర ఘాట్ల నిర్మాణం కూడా చైనా సంస్థ రూపొందించిన నమూనా మేరకే జరగడం గమనార్హం. కాగా ఆయా పనులను చైనా సంస్థల ప్రతినిధులు కూడా పర్యవేక్షించారు. కాంట్రాక్టర్లకు, చైనా సంస్థలకు వందలాది కోట్లు దోచిపెట్టేందుకు టీడీపీ పథక రచన చేస్తోంది. 

Back to Top