డీల్ కుదిరింది ఎవరి మధ్య?

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై దుమ్మెత్తిపోసే క్రమంలో టీడీపీ- టీఆర్‌ఎస్- సీపీఐ విచిత్రంగా వియ్యమందుతున్నాయి. సూత్రరహితమయిన, నీతి విరుద్ధమయిన ఈ అక్రమ సంబంధానికి ఎల్లో మీడియా బాకాలు ఊది, బాజాలు వాయిస్తోంది. ఈ మూడు పార్టీలకూ సామాన్యమయిన లక్షణం ఏమన్నా ఉందంటే అది ఒక్కటే! సిగ్గూ శరం లేకుండా, లజ్జా బిడియం లేకుండా, అవకాశవాదానికి అచ్చమయిన మచ్చుతునకలుగా రాణించడమే వారి మధ్య ఉన్న సామ్యం, సామాన్య లక్షణం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నీతీ, ఏ సూత్రబద్ధతా లేకుండా ‘మహాకూటమి’ పేరిట కుమ్మక్కయిన పార్టీలివి. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ఈ మూడు మిత్ర పక్షాల్లోఒక పార్టీ -టీఆర్‌ఎస్- ప్లేటు ఫిరాయించి ఎన్డీయేకి మద్దతిస్తానని ప్రకటించిన సంగతి జనం మర్చిపోలేదు. ఇక, సీపీఐ-టీడీపీలు ఏ విషయంలో కలుస్తాయో, దేని విషయంలో విడిపోతాయో, ఆ సంబంధాలకు ప్రాతిపదికలేమిటో ఎవరికీ తెలియదు. సీపీఐకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదని వంక చూపించి ఆ పార్టీని అఖిల పక్ష సమావేశానికి పిలవని ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు. ఆయనగారి ఆదరాభిమానాలను -ఇటీవలే సీపీఐ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన- సురవరం సుధాకరరెడ్డి ఈ మధ్యే గుర్తుచేసుకుని, ప్రజలకు సైతం గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో, సీపీఐ రాష్ట్ర నాయకత్వం తలదన్ని, జాతీయ నాయకత్వాన్ని బుజ్జగించి, ఆ పార్టీని తనదారికి తెచ్చుకున్న ఘన చరిత్ర టీడీపీది. అయినా సిగ్గులేకుండా ఆ పార్టీ చంకెక్కుతామని సీపీఐ నిర్ణయించుకుంటే ఎవరు మాత్రం ఏంచెయ్యగలరు?కానీ, నిక్కమయిన ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీఒక మంచి నిర్ణయం చేసిన పాపానికి ఆ పార్టీని ఆడిపోసుకోడానికి తెగిస్తే జనం వాళ్ల మొహాన్న ఉమ్మేస్తారు! అంతకుమించి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెనక ఏదో డీల్ ఉందని టీఆర్‌ఎస్ అధినేత బరితెగించి వ్యాఖ్యానించారు. ప్రతి రాజకీయ వ్యవహారం వెనకా ఓ డీల్ ఉండక తప్పదనుకుంటే, టీఆర్‌ఎస్ - టీడీపీల కొత్త దోస్తీ వెనక ఏం డీల్ కుదిరిందనుకోవాలి?ఇంతకీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీఏ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది? ఏ ఎన్నికల్లోనయినా, ఓటు వేయక పోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అందులోనూ దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడమనేది ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింప జేసే రాజకీయ పక్షాలు విధిగా పాటించాల్సిన ధర్మం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలొచ్చినపుడు మాకు ఓట్లేయండి అని ప్రజలను అర్థించే రాజకీయ పార్టీలు అదే తమ విషయానికి వచ్చినపుడు మొహం చాటేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పలాయనం చిత్తగించడమే అవుతుంది. అందుకే దేశ రాజ్యాంగానికి ఐదేళ్ల పాటు సారథ్యం వహించే రాష్ట్రపతి ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేసి తీరాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి భావించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరూ ఈ వాదనను గట్టిగా సమర్థించారు.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలోని హేతుబద్ధత ఏమిటి?ప్రణబ్ ముఖర్జీ యూపీఏ ప్రతిపాదించిన అభ్యర్థే అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆ కోణంలో చూడలేదు. దేశం అనేక జటిలమైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఒక సీనియర్ రాజకీయ వేత్తగా ఉండి వాటిని పరిష్కరించి ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచిన వ్యక్తి ప్రణబ్. మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధాని అయినా యూపీఏ ప్రభుత్వానికి మాత్రం ప్రణబ్ ముఖర్జీయే పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణబ్ కు ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆ ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలు 17 మంది వారిని అనుసరిస్తున్న మరో ముగ్గురు (ఇద్దరు కాంగ్రెస్, ఒక టీడీపీ) ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటు వేయడానికి ముందుకు కదిలారు.ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది- మసిబొగ్గులా ఉండే మట్టికుండ, అడుగుభాగంలో మాత్రమే మసిపట్టి ఉండే కెటిల్‌ను చూసి హేళనచేసిందట! టీడీపీ- టీఆర్‌ఎస్- సీపీఐ గురివింద గింజలు తమ సౌందర్యాన్ని ఒక్కసారి సమీక్షించుకుంటే మంచిది!

Back to Top