సింగపూర్ తో రహస్య మంతనాలు..!సమావేశాల్లో కానరాని నిపుణులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సింగపూర్ బృందంతో అనుసరిస్తున్న సీక్రెట్ మంత్ర ఏంటి..? ఇంకెవరినీ చంద్రబాబు ఇందులో ఎందుకు ఇన్ వాల్వ్ చేయడం లేదు. ప్రతిసారీ చంద్రబాబు మాత్రమే సింగపూర్ నిపుణులతో ఎందుకు చర్చలు జరుపుతున్నారు...? ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీకి సింగపూర్ ను ఎంపిక చేయడం దగ్గరి నుంచి చంద్రబాబు మాత్రమే వాళ్లతో సమావేశమవ్వడం వెనక గూడుపుఠాణీ అర్థం కావడం లేదు. సింగపూర్ బృందంతో ఇప్పటివరకు చంద్రబాబు, ఆయన తరుపున మంత్రి నారాయణ మాత్రమే చర్చలు జరిపారు. ఇంకెవరూ వాళ్లతో భేటీ అయిన దాఖలాలు లేవు.
చంద్రబాబు కేంద్రంగా చర్చలు..! ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పేరుతో చంద్రబాబు మూడుసార్లు సింగపూర్ వెళ్లారు. కానీ ఆయన వెంట నిపుణులెవరినీ తీసుకెళ్లలేదు. సింగపూర్ బృందం ఎప్పుడు ఏపీకి వచ్చినా చంద్రబాబుతోనే మంతనాలు జరుపుతోంది. రాజధాని మాస్టర్ ప్లాన్ డెవలప్ మెంట్ పేరుతో మరోసారి చంద్రబాబు బృందం సింగపూర్ పయనమవుతోంది. చంద్రబాబు వెంట వెళ్తున్న 12 మందిలోఒక్కరంటే ఒక్కరు కూడా నిపుణులు లేరు. మరోవైపు, మంత్రులెవరిని కాదని చంద్రబాబు నారాయణ, యనమల రామకృష్ణుడులను మాత్రమే వెంట తీసుకెళ్లడం పలు విమర్శలకు తావిస్తోంది. లోపాయికారి ఒప్పందాల కోసమే సింగపూర్ పర్యటన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
చంద్రబాబు టీం..!చంద్రబాబు వెంట వెళ్తున్న వారిలో ఇద్దరు మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఠక్కర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పివి.రమేష్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సంషేర్ సింగ్ రావత్, సీఆర్డీఏ సీఈవో నాగులపల్లి శ్రీకాంత్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, ముఖ్య భద్రతాధికారి నాగేంద్ర ఉన్నారు.