ప్రాణాలతో బాబు పరిహాసం

– నాడు ఎన్టీఆర్‌.. నేడు భూమా నాగిరెడ్డి
– బాబు ఖాతాలో మానసిక క్షోభ మరణాలు 
– మాట తప్పి మట్టి కప్పుతున్న చేష్టలు 

భూమా అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపింది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అఖిల ప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చి పబ్లిసిటీ కోసం భూమా చావును కూడా వాడుకునేందుకు చంద్రబాబు వెనకాడటం లేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభలో లేకపోవడం చూపించి సంతాప సభను టీడీపీ బహిరంగ సభగా మార్చేశారు. తల్లి చనిపోయి మూడేళ్లు కూడా గడవక ముందే ఇప్పుడు తండ్రినీ కోల్పోయిన కుటుంబానికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించాల్సింది పోయి భూమా చావును అడ్డం పెట్టుకుని ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానం కోసం అతి పైశాచికంగా కుళ్లు రాజకీయాలు చేయడం సిగ్గు చేటు. 

సంతాప తీర్మాణం ఇలాగేనా
సాధారణంగా సంతాప తీర్మాణమంటే పార్టీలకతీతంగా సభలో ఉన్నవారంతా చనిపోయిన వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని సభా ముఖంగా అందరితో పంచుకుంటారు. తమకు శత్రువే అయినా చనిపోయిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక్క అక్షరం కూడా తప్పుగా మాట్లాడరు. ఇది తెలుగు సాంప్రదాయం. కానీ ఇలాంటి తెలుగు సాంప్రదాయాలు, ఆత్మగౌరవాలను ఎప్పుడో భోగి మంటల్లో వేసి తగలేసిన పచ్చ పార్టీ భూమా సంతాప తీర్మాణాన్ని రాజకీయం చేసేసింది. ఎంత దారుణంగా అంటే భూమా పేరును కూడా ప్రస్తావించకుండా సంతాపం ప్రకటించేస్తున్నారు పచ్చ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక్కడా వైయస్‌ జగన్‌ను విమర్శించడానికే వారికి సమయం వినియోగిస్తున్నారంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది. జగన్‌ను వీలైనంత ఎక్కువగా విమర్శించి చంద్రబాబు దగ్గర పేరు సంపాదించాలన్న తొందరలో పల్లె రఘనాథ రెడ్డి లాంటి వారు అత్యుత్సాహం ప్రదర్శించారు. భూమా నంద్యాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తే ఆయనేమో ఆళ్లగడ్డ నుంచి అని కనీసం సోయి లేకుండా మాట్లాడేశారు. ధూళిపాళ్ల నరేంద్ర అయితే ఆయన మాట్లాడిన పది మాటల్లో కనీసం ప్రతి వాక్యంలోనూ వైయస్‌ జగన్‌ పేరుండేలా జాగ్రత్త పడ్డారు. జగన్‌ను ఎక్కువగా విమర్శించి బాబును ఇంప్రెస్‌ చేసేసి మంత్రి పదవి కొట్టేసేందుకు ఇదో వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడం పక్కా బహిరంగ సభను తలపించింది.

భూమా చావుకు ఆయనే కారణం 
నిజానికి భూమా చావుకు చంద్రబాబే అసలు కారణమని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తనకు వైరి వర్గమైన చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని బాబు ఆజ్ఞాపించడం దగ్గర మొదలైన వేధింపులు చివరికి భూమా చితి కూడా చల్లారేదాక  ఆగిపోలేదు. అసలే కర్నూలు జిల్లాలో టీడీపీ సరైన మెజారిటీ కూడా లేదు. స్థానిక సంస్థల్లో పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఆ పార్టీకి లేనే లేదు. అయినా శిల్పా చక్రపాణిరెడ్డిని రంగంలోకి దింపి బాధ్యతలు భూమాపై పెట్టాడు. ఎప్పటికైనా మంత్రిని కావాలన్న భూమా కోరికను ఆసరాగా చేసుకుని చంద్రబాబు ఆయనతో ఆటాడేసుకుని మరణమృదంగం సృష్టించేశాడు. గెలిపించుకొస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా స్పష్టంగా చెప్పకుండా గవర్నర్‌ ఒప్పుకోవడం లేదని సాకు చూపించాడు. అయినా వెనక్కి తగ్గని భూమా.. తాను రాజీనామా చేసి తిరిగి గెలుస్తానని కూడా చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఈనెల 19న భూమా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లబోతున్నారనే చర్చ కూడా నడిచింది. అయితే భూమా ఒక్కడే ఉప ఎన్నికలకు వెళితే పార్టీ ఫిరాయించిన మిగతా 20 మందితోనూ రాజీనామా చేయించాల్సి వస్తుందని ఊహించిన బాబు అందుకు ససేమిరా అన్నట్టు భూమా తన సన్నిహితులకు చెప్పుకున్నారని సమాచారం. ఇక్కడే భూమా తీవ్ర అసహనంతో ఉండిపోయారు. కోరుకున్న మంత్రి పదవి సంవత్సరం గడిచినా రాకపోవడం.. పార్టీ మారినా తనకు గుర్తింపు దక్కకపోవడం భూమాను తీవ్ర నిరాశకు, ఒత్తిడికి గురిచేసింది. ఇంత తీవ్ర ఒత్తిడితో ఉన్న కారణంగానే భూమా మాసివ్‌ స్ట్రోక్‌ వచ్చిందని డాక్టర్లు కూడా నిర్ధారించారు. పైగా చనిపోయే ముందు రోజు రాత్రి కూడా తన కొడుకు జగత్‌విఖ్యాత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినప్పుడూ భూమా ఇదే చెప్పారని బయట ప్రచారం నడుస్తున్నది వాస్తవం. తాను ఒత్తిడిలో ఉన్నానని ఉదయం మాట్లాడతానని కొడుకుతో చెప్పినట్టు కర్నూలులో ప్రచారం సాగుతోంది. 
Back to Top