చంద్ర‌బాబులో ఎన్ని‘క‌ల‌’లో..

2009 ఎన్నిక‌ల్లో ఈసీ తీరుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

2019లో అదే ఈసీపై విమ‌ర్శ‌ల తూటాలు 

ఏబీ వెంకటేశ్వరావుపై బాబుకు ఎందుకంత శ్రద్ధ

అమ‌రావ‌తి:  టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ఎంత‌టికైనా తెగిస్తారు. ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోతే అదేదో జాతికి మొత్తం న‌చ్చ‌న‌ట్లు గ‌గ్గోలు పెడ‌తారు. ఆయ‌న‌కు అనుకూలంగా ఉంటే శెభాష్ అంటూ పొగుడుతారు. ఇది ఇప్ప‌టి నుంచి కాదు..ఆది నుంచి కూడా బాబు తీరు అదే. 2009లో ఎన్నికల కమిషన్‌ బెస్ట్‌ అని ప్రశంసలు కురిపించిన చంద్రబాబే ఇప్పుడు ఈసీ వరస్టు అంటూ నిందలు వేస్తున్నారు. ఇదంతా ఒక పోలీస్‌ అధికారి కోసమే. ఎవరా అధికారి.. ఆ అధికారిపై చంద్రబాబుకు ఎందుకు అంత ప్రేమ అనేది ఆంధ్రరాష్ట్ర ప్రజల సందేహం. ఇంటలిజెన్స్‌ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఏబీ వెంకటేశ్వరావుని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీకి ఫిర్యాదు చేస్తూనే వస్తుంది. ప్రతిపక్ష ఫిర్యాదు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఎన్నికల కమిషన్‌ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. వేరే ప్రాంతానికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోని చంద్రబాబు సర్కార్‌ ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కుతూ హైకోర్టును ఆశ్రయించింది. 

ఏబీపై ఎందుకింత ప్రేమ..
చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలే ఇటీవల వెల్లడించాయి. పోలీసు అధికారిగా కాకుండా.. తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో.. ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ వెంకటేశ్వరరావు చెబితేనే సీఎం అమలు చేస్తాడని ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాటలను బట్టి అర్థం అవుతుంది. ఇదే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏబీ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలున్నాయి. పోలీస్‌ అధికారిగా కాకుండా.. బాబు పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేయడంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని టీడీపీ వర్గాలే అంటున్నాయి. అందుకనే ఆయన్ను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 716 జీఓను విడుదల చేసింది. మరునాడే 716 జీఓను రద్దు చేసి మరో జీఓ 720ను జారీ చేసింది. జీఓ రద్దు, కొత్త జీఓ జారీ వెనుక రహస్యం ఏంటని ప్రజలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఇంటలిజెన్స్‌ చీఫ్‌ను ఈసీ పరిధిలో చూపించిన ప్రభుత్వం ఇప్పుడెందుకు కాదంటుందని ప్రశ్నిస్తున్నారు.

2009లో దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేక కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈసీ బెస్టు అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో ఈసీ వరస్టు అంటూ నిందలు వేస్తున్నారు. ఆ అధికారి లేకుంటే ఎన్నికలు జరుగవన్నట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు. ఏబీపై వేసింది వేటు కాదు.. కేవలం బదిలీ మాత్రమే. ఎన్నికల ప్రక్రియ ముగియగానే అదే పోస్టులో కొనసాగించవచ్చు. అంతెందుకు వైయస్‌ఆర్‌ హయాంలో ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను అప్పట్లో విధుల నుంచి తప్పించారు. ఈసీ పనులకు అడ్డుతగలకుండా.. తన పాలన చూపించి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు.. ఒక పోలీసు అధికారి కోసం ఇంత వెంపర్లాడడం వెనుక చిదంబర రహస్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top